ఉత్సవాలతో కదలిక
నిర్మల్: ‘ఏంటి నాన్నా.. మన నిర్మల్‌కు ఇంత హి స్టరీ ఉందా..!?’ ‘ఏంటమ్మా.. మన ఏరియా కూడా హిస్టారికల్ ప్లేసా..!?’ అని పిల్లలు అడుగుతుంటే చాలామంది తల్లిదండ్రులు అవునని తలూపుతూ నే.. లోలోపల తమకూ ఇప్పుడిప్పుడే మన చరిత్ర తెలుస్తోందని ఫీల్ అవుతున్నారు. ‘మరి మన నిర్మ ల్ గురించి, రాంజీగోండు చేసిన ఫైట్ గురించి మా సోషల్‌బుక్స్‌లో ఎందుకు లేదు..?’ అనే ప్రశ్నకు చాలామంది సమాధానమివ్వడం లేదు. తమకుతాము ఇప్పుడిప్పుడే ‘అవును.. మా ఏరియా హిస్టరీ ఎందుకు బయటకు రావడం లేదు..’ అని ప్రశ్నించుకుంటున్నారు. వారసత్వ వేడుకలుగా జిల్లా కేంద్రంలో నిర్వహించిన ‘నిర్మల్ ఉత్సవాలు’ నేటితరంపై ప్రభావం చూపుతున్నాయి. ప్రధానంగా తమదైన చరిత్రను తెలుసుకుంటున్న నేటితరం గర్వంగా ఫీలవుతున్నారు. ఇక్కడి చారిత్రక ప్రాంతాలను అభివృద్ధి చేయడంతోపాటు చరిత్రను ముందుతరాలకు అందేలా చేయాలంటూ పాలకులు, అధికారులను కోరుతున్నారు. చాలామంది నేరుగా కలెక్టర్ అభిలాషఅభినవ్ దృష్టికీ తీసుకెళ్లారు. ఈక్రమంలో కలెక్టర్ జిల్లాలో మ్యూజియం ఏర్పాటుతోపాటు ఒకట్రెండు గఢ్‌లనూ అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
మ్యూజియం ఏర్పాటు..
జిల్లాలో ఒక మ్యూజియం ఏర్పాటు, చారిత్రక ప్రాంతాల అభివృద్ధికి ముందడుగు పడనుంది. గతంలో కలెక్టర్‌గా పనిచేసిన వరుణ్‌రెడ్డి హయాంలోనూ నిర్మల్‌లో హిస్టారికల్ మ్యూజియం ఏర్పాటు కోసం ప్రయత్నాలు జరిగాయి. సమీకృత కలెక్టరేట్ నిర్మా ణం తర్వాత ఆఫీసులన్నీ అక్కడికి తరలిపోవడంతో, ఖాళీ అయిన పాత ఆర్‌అండ్‌బీ కార్యాలయాన్ని మ్యూజియంగా మార్చాలన్న యోచన చేశారు. ఎదురుగా ఉన్న సర్డ్‌మహల్(శీతలమందిరం) అభివృద్ధికీ ప్రతిపాదనలు సిద్ధంచేశారు. అంతలోనే 2023 అసెంబ్లీ ఎన్నికలు రావడం, ఆయన బదిలీ కావడంతో ఆ పనులు, ప్రతిపాదనలు అలాగే నిలి చిపోయాయి. తాజాగా జిల్లాకేంద్రంలో నిర్వహిస్తున్న నిర్మల్ ఉత్సవాలలో ప్రజల నుంచి భారీగా స్పందన వస్తుండటం, అలాగే చరిత్రను కాపాడాలన్న డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో కలెక్టర్ మ్యూజియం ఏర్పాటు దిశగా యోచిస్తున్నారు.
గఢ్‌ల అభివృద్ధి..
అడుగడుగునా ఉన్న రాతికట్టడపు గఢ్‌లు నిర్మల్ చరిత్రను ఇప్పటికీ కళ్లకు కట్టిస్తున్నాయి. ఈ ప్రాంత రాచరికపు ఠీవిని ప్రదర్శిస్తున్నాయి. 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత నిర్మల్–నిజామాబాద్ మార్గంలోని శ్యాంగఢ్, నిర్మల్–ఎల్లపల్లి దారిలో గల బత్తీస్‌గఢ్‌ల అభివృద్ధికి నిధులు విడుదలయ్యాయి. కానీ.. అవి కేవలం బయట గోడలకు పూతలు పూయడానికి మాత్రమే సరిపోయాయి. లోపల నామమాత్రంగా కూడా అభివృద్ధి పనులు చేపట్టలేదు. కలెక్టర్ ప్రశాంతి శ్యాంగఢ్ లోపల అక్కడక్కడ కూర్చోవడానికి సిమెంట్ కుర్చీలు వేయించారు. బయట అభివృద్ధి చేసేలోపు ఆమె బదిలీ అయ్యారు. ముషరఫ్‌అలీ కలెక్టర్‌గా ఉన్న సమయంలో నిర్మల్ సుందరీకరణలో భాగంగా శ్యాంగఢ్ చుట్టూ లైటింగ్ పెట్టించారు. ఇప్పుడు కలెక్టర్ అభిలాషఅభినవ్ స్థానిక సమీకృత కలెక్టరేట్‌కు దగ్గరలో ఉన్న బత్తీస్‌గఢ్‌ను అభివృద్ధి చేసేలా చర్యలు చేపడతామని చెబుతున్నారు.
ప్రతిపాదనలు చేస్తున్నాం..
జిల్లాకేంద్రంలో రెండేళ్లుగా నిర్వహిస్తున్న ‘నిర్మల్ ఉత్సవాలు’ విజయవంతం కావడం హర్షనీయం. జిల్లా చరిత్రను వెలుగులోకి తీసుకువచ్చేందుకు ఓ మ్యూజియం ఏర్పాటుతోపాటు గఢ్‌ల అభివృద్ధికీ ప్రతిపాదనలు తయారు చేస్తున్నాం. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికీ తీసుకెళ్తాం. – అభిలాషఅభినవ్, కలెక్టర్
ఉత్సవాలతో కదలిక


