సాగు పనులను అడ్డుకున్న ఎఫ్‌బీవోపై దాడి
రెబ్బెన: రెబ్బెన రేంజ్ పరిధి తక్కళ్లపల్లి బీట్‌లో అటవీశాఖ భూమిలో సాగు పనులను అడ్డుకున్న ఎఫ్‌బీవో ఎండీ అయాజ్‌పై ముగ్గురు దాడికి పాల్పడ్డారు. రెబ్బెన ఫారెస్ట్ రేంజ్ అధికారి భానేష్ వివరాల ప్రకారం.. టైగర్ ఎస్టిమేషన్ ప్రక్రియలో భాగంగా వన్యప్రాణుల గణన పూర్తిచేసుకుని అయాజ్ వస్తున్నాడు. ఆదివారం తక్కళ్లపల్లి బీట్‌లోని 336 కంపార్టుమెంట్‌లో సప్ప రాజశేఖర్ అటవీశాఖ భూమిలో పంట సాగు పనులు చేస్తూ కనిపించాడు. ఎఫ్‌బీవో అడ్డుకోగా రాజశేఖర్ దురుసుగా ప్రవర్తించాడు. తన వద్ద పట్టా ఉందని తెలపగా రెవెన్యూ, అటవీశాఖ సంయుక్తంగా సర్వే నిర్వహించి వివాదంలో ఉన్న భూమి సమస్య పరిష్కరించుకోవాలని ఎఫ్‌బీవో సూచించి అడ్డుకోబోయాడు. రాజశేఖర్, తల్లి సప్ప లక్ష్మి, మామ పుప్పాల రమేశ్ కర్రతో అతనిపై దాడి చేయడంతో తీవ్రగాయాలయ్యాయి. బాధితుడి ఫిర్యాదుతో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు రెబ్బెన ఎస్సై వెంకటకృష్ణ తెలిపారు.


