ఆత్మహత్యకు యత్నించిన వివాహిత మృతి
నెన్నెల: గడ్డిమందు తాగి ఆత్మహత్యకు యత్నించిన వివాహిత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఎస్సై ప్రసాద్ కథనం ప్రకారం..మండలంలోని కోణంపేటకు చెందిన దుర్గం సౌమ్య(28)కు 2022లో గుండ్లసోమారం గ్రామానికి చెందిన రాజ్‌కుమార్‌తో వివాహం జరిగింది. వీరికి ఒక పాప, బాబు ఉన్నారు. కొన్నిరోజుల నుంచి సౌమ్య కడుపునొప్పితో బాధపడుతోంది. తరచూ మాత్రలు వేసుకునేది. ఈనెల 21న మధ్యాహ్నం కడుపునొప్పి తీవ్రం కావడంతో గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన కుటుంబీకులు ఆమెను ఆటోలో మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతిచెందింది. ఆదివారం మృతదేహానికి పంచనామా నిర్వహించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.


