కలప పట్టివేత
ఇచ్చోడ: గుడిహత్నూర్ మండలం చింతగూడ గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన కలపను స్వాధీనం చేసుకున్నట్లు ఇచ్చోడ అటవీ డివిజనల్ అధికారి చిన్న విశ్వనాథభూస్‌రెడ్డి తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. పక్కా సమాచారంతో శనివారం రాత్రి అధికారులతో కలిసి దాడులు నిర్వహించారు. కొందరు ఇళ్లల్లో అక్రమంగా నిల్వ ఉంచిన కలపను స్వాధీనం చేసుకుని ఇచ్చోడ ప్రభుత్వ టింబర్ డిపోకు తరలించారు. నిందితులు రాంటెంకి శ్రీకాంత్, దుర్గం నవీన్, రాంటెంకి వికాస్, జాడే రంజిత్, గొల్లపల్లి కిరణ్, కడారి మల్లేశ్, బోర్లకుంట సునీల్, పిప్పాల విజయ్, దుర్గం భగవాండ్లపై కేసులు నమోదు చేశారు. మొత్తం 122 కలప సైజులు ఉండగా, వీటి విలువ రూ.1,60,876 ఉన్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద కలప అవసరమైన వారికి ఇచ్చోడ ప్రభుత్వ కలప డిపోలో 10 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇచ్చోడ, ఆదిలాబాద్, ఇంద్రవెల్లి, బోథ్ ఎఫ్‌ఆర్వోలు టి.పుండలిక్, గులాబ్‌సింగ్, సంతోష్, ప్రణయ్, బజార్‌హత్నూర్, ఇచ్చోడ డిప్యూటీ ఏఆర్‌ఓలు ప్రవీణ్ మహాజన్, ఇబ్రహీం షరీఫ్, గుడిహత్నూర్ ఎఫ్‌ఎస్‌ఓ ఇమ్రాన్, దామన్‌గూడ ఎఫ్‌బీఓ బి.ప్రశాంత్ పాల్గొన్నారు.


