కొత్త సర్పంచులకు శిక్షణ
నిర్మల్‌చైన్‌గేట్: పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు. గ్రామాభివృద్ధిలో పల్లె సారథులే కీలకం. రెండేళ్లుగా గ్రామాలకు పాలకవర్గాలు లేక అభివృద్ధిలో వెనుకబడ్డాయి. ఎట్టకేలకు పంచాయతీల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. సర్పంచులు, వార్డు సభ్యులకు గ్రామాభివృద్ధి కోసం 24 అంశాలపై శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో మాస్టర్ ట్రైనర్లకు ఇప్పటికే శిక్షణ పూర్తయింది. ఈ నెల 19నుంచి సర్పంచులకు శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందించారు.
50మందికో బ్యాచ్ చొప్పున..
జిల్లా వ్యాప్తంగా ఎక్కువ మొత్తంలో నూతనంగా ఎన్నికై న సర్పంచులే ఉన్నారు. పాలనాపరమైన అనుభవం లేక ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో సర్పంచులకు విధులు, బాధ్యతలు, నిధులు సమకూర్చుకోవడంలాంటి అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. గత నెల 22న పాలకవర్గాలు బాధ్యతలు స్వీకరించాయి. జిల్లాలో 399 సర్పంచులు, 3,366 మంది వార్డు సభ్యులకు శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందించారు. జిల్లా వ్యాప్తంగా ఎనిమిది బ్యాచ్‌లుగా విభజించి బ్యాచ్‌కు 50 మంది సర్పంచులకు శిక్షణ ఇచ్చేందుకు నిర్ణయించారు. ఒక్కో బ్యాచ్‌కు ఐదురోజులు శిక్షణ ఇస్తారు. ముధోల్‌లోని ట్రిపుల్ ఐటీలో ఆరు మండలాలకు, నిర్మల్‌లోని మహిళా ప్రాంగణంలో 12మండలాలకు శిక్షణ ఇవ్వనున్నారు.
24 అంశాలపై అవగాహన
గ్రామ పాలనలో వ్యవస్థలు, పంచాయతీరాజ్ చట్టం ప్రకారం పంచాయతీలకు అధికారాలు, సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల బాధ్యతలపై అవగాహన కల్పించనున్నారు. ప్రాథమిక లక్ష్యాలు, నాయకత్వ లక్షణాలు, పారిశుద్ధ్యం, సమావేశాలు, స్టాండింగ్ కమిటీల ఏర్పాటు, వనమహోత్సవం, నిధులపై ఆడిట్, ప్రజారోగ్యం జనన, మరణాల నమోదు, ఈ అప్లికేషన్, ఆర్థిక ప్రణాళిక.. ఇలా 24 అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. అన్ని అంశాలపై పట్టు సాధించి గ్రామాభివృద్ధికి కృషి చేసేలా ప్రోత్సహించనున్నారు. అలాగే, పంచాయతీలకు వచ్చిన నిధులు దుర్వినియోగం కాకుండా పల్లె అభివృద్ధికి కృషి చేసేలా వివరించనున్నారు. సర్పంచులకు శిక్షణ సమయంలో బయోమెట్రిక్ ద్వారా హాజరు తీసుకోనున్నారు. ఆధార్ లింక్ ద్వారా బయోమెట్రిక్ అంటెండెన్స్‌ను శిక్షణ కేంద్రంలో నమోదు చేసుకోవాలి. ఈ శిక్షణకు ప్రతీ సర్పంచ్ తప్పక హాజరు కావాల్సి ఉంటుంది.
శిక్షణకు ఏర్పాట్లు చేస్తున్నాం
జిల్లాలోని సర్పంచులు, వార్డు సభ్యులకు ఈ నెల 19నుంచి శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందించాం. ఇప్పటికే మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ పూర్తయింది. జిల్లాలోని ముధోల్ నియోజకవర్గం పరిధిలోని ఆరు మండలాలకు చెందినవారికి బాసర ట్రిపుల్ ఐటీలో, మిగతా 12మండలాలకు చెందిన వారికి నిర్మల్ రూరల్ మండలంలోని చించోలి (బీ) సమీప మహిళా ప్రాంగణంలో శిక్షణ కోసం ఏర్పాట్లు చేస్తున్నాం.
– శ్రీనివాస్, జిల్లా పంచాయతీ అధికారి


