
హస్తకళలను ప్రోత్సహిద్దాం
నిర్మల్‌చైన్‌గేట్: టెక్నాలజీ పెరిగిన తర్వాత చేతి వృత్తులకు ఆదరణ కరువవుతోందని, కానీ, హస్త కళలకు ఉన్న ప్రాధాన్యతను అందరూ గుర్తించి ప్రోత్సహించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. మహిళల ఆలోచనలు వెలుగులోకి తెచ్చేందుకు మహిళా సంఘాలు తోడ్పాటునిస్తాయని పేన్నారు. పట్టణంలోని అంబేడ్కర్ భవనంలో ఆకాంక్ష హాత్ పేరుతో ఏర్పాటు చేసిన హస్త కళల ప్రదర్శనను ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్‌తో కలిసి గురువారం ప్రారంభించారు. పలు స్టాల్స్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నీతి అయోగ్ ఆస్పిరేషన్ బ్లాక్ కార్యక్రమంలో పెంబి మండలం జాతీయ స్థాయిలో 4వ ర్యాంకు సాధించిందని తెలిపారు. మొత్తం 500 మండలాల్లో పెంబికి 4వ ర్యాంకు రావడం గర్వకారణమన్నారు. త్వరలోనే పలువురు జిల్లా అధికారులు రాష్ట్రస్థాయిలో జరగబోవు కార్యక్రమంలో గవర్నర్ చేతుల మీదుగా కాంస్య పతకం అందుకోనున్నట్లు తెలిపారు. మూడు నెలలపాటు జరిగిన సంపూర్ణత అభియాన్ కార్యక్రమంతో పెంబి ఆస్పిరేషన్ నుంచి ఇన్‌స్పిరేషన్‌గా మారిందన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, పోషణ, సామాజిక అంశాల్లో మెరుగైన అభివృద్ధి సాధించిందని వివరించారు. గర్భిణుల నమోదు, డయాబెటిస్ స్కీన్రింగ్, సప్లిమెంటరీ న్యూట్రీషియన్‌లో వందశాతం పరిపూర్ణత సాధించడంతోపాటుగా హెల్త్ కార్డుల జారీలో 70 శాతం, మహిళా సంఘాల రుణాల విషయంలో 94 శాతం పరిపూర్ణత సాధించినట్లు వెల్లడించారు. నీతి అయోగ్ ఆకాంక్ష హాత్ కార్యక్రమం ఆగస్టు 4వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా ఐదు రోజులపాటు మహిళా సంఘాల హస్తకళలు ప్రదర్శనలతోపాటు, అమ్మకాలు ఉంటాయన్నారు.
జాతీయ పురస్కారం సంతోషకరం..
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ నీతి అయోగ్ పెంబి ఆస్పిరేషన్ బ్లాక్‌కు జాతీయస్థాయిలో ఉత్తమ ర్యాంకు రావడం సంతోషకరమన్నారు. పెంబిని ఉత్తమ స్థానంలో నిలిచేందుకు కృషిచేసిన జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, జిల్లా అధికారు, పెంబి మండల అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. అధికారులు అంకితభావంతో పనిచేయడంతోనే ఉత్తమ ర్యాంకు సాధ్యమైందన్నారు. మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ సొంత కాళ్లపై నిలబడాలన్నారు. కార్యక్రమంలో భాగంగా పలువురు విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు, నాటికలను ప్రదర్శించారు. పెంబి మండల అధికారులు, అంగన్‌వాడీ, ఆశ వర్కర్లు.. ఏఎన్‌ఎంలు, ఇతర ఫ్రంట్‌లైన్ ఉద్యోగులను కలెక్టర్ ఎమ్మెల్యేలు శాలువాతో సన్మానించి, ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమ ప్రారంభానికి ముందు అంబేడ్కర్ భవన్‌లో కలెక్టర్, అదనపు కలెక్టర్, ఎమ్మెల్యేతో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్‌అహ్మద్, జిల్లా అధికారులు, పెంబి మండల అధికారులు, సిబ్బంది, మహిళా స్వయం సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
కలెక్టర్ అభిలాష అభినవ్
పెంబి ఆస్పిరేషన్ బ్లాక్‌కు జాతీయస్థాయి గుర్తింపుపై హర్షం
ఆకాంక్ష హాత్ పేరుతో ఐదు రోజుల ప్రదర్శన, అమ్మకాలు ప్రారంభం

హస్తకళలను ప్రోత్సహిద్దాం