
అర్హులందరికీ రేషన్ కార్డులు
● కలెక్టర్ అభిలాష అభినవ్
తానూరు: అర్హులైన పేదలందరికీ ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డులు జారీ చేస్తుందని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. మండల కేంద్రంలోని రైతువేదికలో ముధోల్ ఎమ్మెల్యే రామారావ్‌పటేల్‌తో కలిసి గురువారం రేషన్ కార్డులు పంపిణీ చేశారు. తానూ రు మండలానికి 1,853 కొత్త రేషన్ కార్డులు మంజూరయ్యాయని తెలిపారు. 2,575 రేషన్ కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లు చేర్చామని వెల్లడించారు. కార్డులు పొందినవారు క్రమం తప్పకుండా రేషన్ బియ్యం తీసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే రామారావ్ పటేల్ మాట్లాడుతూ రేషన్ కార్డుల పంపిణీ పేదల ఆకలి తీర్చడంతోపాటు అనేక పథకాలు పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్, ఆర్డీవో కోమల్‌రెడ్డి, పౌర సరఫరాల శాఖ అధికారి రాజేందర్, శ్రీనివాస్, తహసీల్దార్ మహేందర్, నాయకులు పాల్గొన్నారు.
రోగులకు మెరుగైన వైద్యం అందించాలి..
ప్రభుత్వ ప్రథమిక ఆస్పత్రిలో రోగులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. మండల కేంద్రంలోని పీహెచ్‌సీని తనిఖీ చేశారు. ఇన్‌పేషెంట్, ఔట్ పేషెంట్ విభాగాలను, స్టోర్లో మందుల నిల్వలను పరిశీలించారు. వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులను అరికట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాలింతలు, గర్భిణులకు ప్రత్యేక పర్యవేక్షణలో వైద్యం అందించాలన్నారు.