
నాటిన ప్రతీమొక్కను రక్షించాలి
● డీఎఫ్‌వో నాగిని భాను
సారంగపూర్: అధికారులు, ప్రజలు తాము నాటిన ప్రతీ మొక్కను సంరక్షించాలని, అప్పుడే వనమహోత్సవానికి నిజమైన అర్థం ఉంటుందని జిల్లా అటవీ అధికారి నాగిని భాను అన్నారు. మండలంలోని అడెల్లి మహాపోచమ్మ ఆలయ సమీపంలోని అడెల్లి నందనవనంలో శుక్రవారం వనమహోత్సవం నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా అటవీ అధికారితోపాటు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంర్జుమంద్ అలీ నందనవనంలో మొక్కలు నాటారు. అనంతరం ఆయా పాఠశాలలకు చెందిన విద్యార్థులందరితోపాటు అటవీశాఖ, ఇతర శాఖల అధికారులతో మొక్కలు నాటించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డీఎఫ్‌వో మాట్లాడారు. మొక్కలు నాటడంతోనే తమ బాధ్యత తీరిపోదని వాటిని పెంచి పెద్దవిగా చేస్తేనే చేసిన పనికి నిజమైన అర్థం పరమార్థం ఉంటుందని పేర్కొన్నారు. అలాగే అడవుల పరిరక్షణ సైతం ప్రతీ పౌరుడి బాధ్యతగా గుర్తించాలని సూచించారు. రైతులు, విద్యార్థులు, ప్రజలు తమ ఇళ్ల ఆవరణలతోపాటు పొలం గట్ల వెంట, ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటి రక్షించాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలోనూ అందమైన పూలమొక్కలు, నీడనిచ్చే మొక్కలు నాటించాలని తెలిపారు. కార్యక్రమంలో సారంగాపూర్ ఏఎంసీ చైర్మన్ అబ్దుల్ హాదీ, అటవీ క్షేత్రాధికారి జీవీ.రామకృష్ణారావు, టాస్క్‌ఫోర్స్ అటవీ క్షేత్రాధికారి వేణుగోపాల్, భైంసా ఎఫ్‌ఆర్‌వో రమేశ్‌రాథోడ్, అడెల్లి ఆలయ కమిటీ చైర్మన్ భోజాగౌడ్, మాజీ జెడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, డీఆర్వోలు నజీర్‌ఖాన్, సంతోష్, నిర్మల్, సారంగాపూర్ మండలాల అటవీ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.