
విద్యాబోధనలో సాంకేతిక విప్లవం!
● ప్రభుత్వ పాఠశాలలో ఏఐ పాఠాలు ● రెండోవిడత రాష్ట్రస్థాయి శిక్షణకు జిల్లా ఉపాధ్యాయులు ● మరింత పటిష్టం కానున్న సర్కారువిద్య...
నిర్మల్‌ఖిల్లా: విద్యాబోధన కొత్త పుంతలు తొక్కుతోంది. విద్యార్థులకు పాఠ్యాంశాలు సులభంగా అర్థమయ్యేలా కృత్యాధార బోధనతోపాటు డిజిటల్ పద్ధతిలో పాఠాలు బోధిస్తున్నారు. తాజాగా కృత్రిమ మేధ(ఏఐ) విద్యారంగంలోకి ప్రవేశించింది. పాఠశాల విద్యలో ఏఐ ఆధారిత బోధనను ప్రవేశపెట్టేందుకు సమగ్ర ప్రణాళికలు అమలు చేస్తోంది. ఈ విద్యా సంవత్సరంలో, జిల్లాలో ఎంపిక చేసిన పాఠశాలల్లో 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు గణిత బోధనలో ఏఐని ఉపయోగించేందుకు చర్యలు చేపట్టింది. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో ఆసక్తిని పెంచడంతోపాటు సాంకేతికతతో కూడిన నాణ్యమైన విద్యను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఏఐ బోధనకు చర్యలు..
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా నాణ్యతను పెంచేందుకు ఏఐ ఆధారిత బోధనను ప్రవేశపెట్టే దిశగా చురుకై న చర్యలు చేపట్టింది. ఈ విద్యా సంవత్సరం నుంచి నిర్మల్ జిల్లాలోని ఎంపిక చేసిన ఐదు ప్రాథమిక పాఠశాలల్లో 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు గణితంలో కొన్ని పాఠ్యాంశాలను ఏఐ ద్వారా బోధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. గణిత సబ్జెక్టులో ఏఐ ఆధారిత బోధన ద్వారా విద్యార్థులకు లాజికల్ థింకింగ్, సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంపొందించడం లక్ష్యంగా ఉంది. ఈమేరకు రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో తరగతుల వారీగా ఏఐ ఆధారిత డిజిటల్ కంటెంట్‌ను రూపొందించారు. ఇది విద్యార్థులకు ఆసక్తికరంగా, సౌకర్యవంతంగా ఉండేలా రూపొందించబడింది.
ఉపాధ్యాయుల శిక్షణ..
ఏఐ బోధనను ప్రభావవంతంగా అమలు చేయడానికి, ఉపాధ్యాయులకు సమగ్ర శిక్షణ అందించడం కీలకం. ఈ దిశగా, జిల్లా నుంచి ఎంపిక చేసిన ఐదుగురు ఉపాధ్యాయులు రాష్ట్రస్థాయి శిక్షణలో పాల్గొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 3న హైదరాబాద్‌లో ఎస్‌సీఈఆర్టీ ఆధ్వర్యంలో జరిగిన మొదటి విడత శిక్షణలో ఐదుగురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇటీవల హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ‘‘ఏఐ డిజిటల్ లిటరసీ’’ అంశంపై రెండో విడత శిక్షణ నిర్వహించారు. ఈ శిక్షణలో డిజిటల్ సాధనాలు, ఏఐ ఆధారిత అప్లికేషన్ల వినియోగం గురించి ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. రాష్ట్రస్థాయిలో శిక్షణ పొందిన రిసోర్స్ పర్సన్‌లు జిల్లా స్థాయిలో మండలాల వారీగా ఇతర ఉపాధ్యాయులకు ఏఐ బోధనపై శిక్షణ ఇస్తారు.
విడతల వారీగా డిజిటల్ కంటెంట్..
ఏఐ బోధన కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు డిజిటల్ కంటెంట్ ద్వారా నేర్చుకునే అవకాశం కల్పించబడుతోంది. జిల్లాలోని 535 ప్రాథమిక పాఠశాలల్లో ఈ కార్యక్రమం దశలవారీగా అమలు కానుంది. 50 మందికి పైగా విద్యార్థులు ఉన్న పాఠశాలలకు కంప్యూటర్లను అందించి, డిజిటల్ ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. జి–కంప్రైస్, ఎడ్యుఆక్టివ్ 8, తెలంగాణ కోడ్ మిత్ర, చాట్‌బోట్ వంటి అప్లికేషన్ల ద్వారా గణిత పాఠ్యాంశాలను ఆసక్తికరంగా బోధించేందుకు ఎస్‌సీఈఆర్టీ డిజిటల్ కంటెంట్‌ను రూపొందించింది. ప్రస్తుతం గణితంతో ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని భవిష్యత్తులో ఇతర సబ్జెక్టులకు కూడా విస్తరించనున్నారు.
విద్యార్థులకు ప్రయోజనం..
కృత్రిమ మేధ ద్వారా డిజిటల్ కంటెంటును అభివృద్ధి చేయడం ద్వారా భవిష్యత్తులో విద్యార్థులు ఉత్సాహంగా స్వీయ అభ్యసనం చేయగలుగుతారు. జిల్లా నుంచి నాతోపాటు ఐదుగురు రెండోవిడత రాష్ట్రస్థాయి శిక్షణలో ఇటీవల పాల్గొన్నాం. సర్కారు బడుల్లో చదువుతున్న పేద విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుంది. – రాచర్ల గంగన్న,
జిల్లా రిసోర్స్ పర్సన్, సారంగాపూర్
అభ్యసన మరింత ప్రభావవంతం...
ఇప్పటికే విద్యార్థులకు ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్యను అందిస్తుండగా ఇప్పుడు మరింత దూర దృష్టితో ఏఐ ఆధారిత విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సౌకర్యాలు కల్పిస్తోంది. దీంతో విద్యార్థుల అభ్యసన ప్రక్రియ మరింత ప్రభావవంతంగా సాగేందుకు అవకాశం ఉంటుంది.
– పి.రామారావు, డీఈవో, నిర్మల్
ఏఐ బోధన ప్రభావం ఇలా..
ఏఐ ఆధారిత బోధన విద్యార్థుల్లో నేర్చుకునే ఆసక్తిని, లాజికల్ థింకింగ్‌ను పెంపొందించడంతోపాటు ఉపాధ్యాయులకు కూడా సౌకర్యవంతమైన బోధనా విధానాన్ని అందిస్తోంది. చిత్రాలు, వీడియోలు, ఇంటరాక్టివ్ అప్లికేషన్ల ద్వారా విద్యార్థులు ఉత్సాహంగా నేర్చుకుంటున్నారు. ఈ విధానం వారి సృజనాత్మక ఆలోచన, సమస్య పరిష్కార నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది. డిజిటల్ తెరలు (ఐఎఫ్‌పీ ప్యానెల్ బోర్డులు) ద్వారా ఉపాధ్యాయులు పాఠ్యాంశాలను సులభంగా, ప్రభావవంతంగా బోధించగలుగుతున్నారు. ఇప్పటికే ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ తెరలు అందుబాటులోకి వచ్చాయి. ఇవి బోధన ప్రక్రియను మరింత ఆకర్షణీయంగా, సమర్థవంతంగా మార్చాయి.

విద్యాబోధనలో సాంకేతిక విప్లవం!

విద్యాబోధనలో సాంకేతిక విప్లవం!

విద్యాబోధనలో సాంకేతిక విప్లవం!