
కేయూలోనే..
నిర్మల్: ఎక్కడో వరంగల్‌లో ఉన్న కాకతీయ యూనివర్సిటీకి వెళ్లిరావాలంటేనే చాలా ఇబ్బంది. తీరా.. అక్కడికి వెళ్లిన తర్వాత ఆరోజు పనవుతుందా.. లేదా..! అన్న గ్యారంటీ ఉండదు. అసలు ఈ కథంతా ఎందుకు..!? ఇంతటి వ్యథ అనుభవించాల్సిన ఖర్మ మాకెందుకు..!? అన్న వాదనలు వస్తున్నాయి. నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలకు అత్యంత సమీపంలోనే నిజామాబాద్‌జిల్లాలో ఉన్న తెలంగాణ యూనివర్సిటీ(తెయూ)కి ఇక్కడి కాలేజీలను అఫ్లియేషన్(అనుబంధం) ఎందుకు చేయడం లేదన్న ప్రశ్న దాదాపు రెండు దశాబ్ధాలుగా వస్తూనే ఉంది. కానీ.. కనీసం పట్టించుకునే నాథుడే లేకపోవడం ఇక్కడి దౌర్భాగ్యం.
రెండు వర్సిటీలూ కాదని..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు నిజామాబాద్‌లో తెలంగాణ, కరీంనగర్‌లో శాతవాహన యూనివర్సిటీలు సమీపంలో ఉన్నాయి. అయినా అధికారులు, పాలకులు ఈ రెండింటినీ కాదని, ఇప్పటికీ ఉమ్మడి జిల్లా కళాశాలలను కేయూ అనుబంధంగానే కొనసాగించడం దారుణం. అసలు.. ఉమ్మడి జిల్లాలోనూ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ప్రధానంగా నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో వర్సిటీ కోసం చాలా ఏళ్లుగా గొంతెత్తుతున్నారు. కానీ.. ఇప్పటికీ ఆ దిశగా కదలిక కనిపించడం లేదు. కనీసం.. దూరభారంగా ఉన్న కాకతీయ నుంచి సమీపంలో ఉన్న యూనివర్సిటీల పరిధిలోకీ అఫ్లియేషన్ తీసుకురావడం లేదు.
ఇప్పటికీ చిన్నచూపే..
దూరంగా ఉందనో.. అడిగేదెవరనో.. తెలియదు కానీ.. ఇప్పటికీ కాకతీయ యూనివర్సిటీకి నిర్మల్, ఆదిలాబాద్ ప్రాంతాలపై చిన్నచూపు ఉందని చా లామంది విద్యావంతులు, విద్యార్థులు అభిప్రా యం వ్యక్తంచేస్తున్నారు. ఈక్రమంలోనే నిర్మల్‌లో ఉన్న యూనివర్సిటీ పీజీ సెంటర్‌ను నిర్లక్ష్యం చేశార ని వాదిస్తున్నారు. ఒకప్పుడు కేయూ పరిధిలోనే ఎంతో పేరున్న ఎంఏ సోషియాలజీ, మంచి డిమాండ్ ఉన్న ఎంఏ ఇంగ్లిష్ వంటి సబ్జెక్ట్‌లను ఇక్కడి స్థానికులకు దూరం చేశారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికీ పీజీ సెంటర్‌కు పూర్వవైభవం తీసుకువచ్చేందుకు కనీసం కృషిచేయడం లేదంటున్నారు. అందుకే.. ‘కేయూ వద్దు.. తెయూ ముద్దు’ అంటున్నారు.
దూరమూ.. భారమే..
ప్రధానంగా ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల విద్యార్థులు, కాలేజీలకు కాకతీయ యూనివర్సిటీ దూరభారంగా మారింది. ఈ రెండు జిల్లాల నుంచి వరంగల్ దాదాపు 270–300కిలోమీటర్ల దూరం ఉంది. ఎంత తక్కువన్నా.. కనీసం 6గంటల ప్రయాణం చేయాల్సి ఉంటుంది. రానుపోనూ అంటే 12 గంటల జర్నీ అవుతుంది. అదే.. తెలంగాణ యూనివర్సిటీ నిర్మల్ నుంచి కేవలం 65 కి.మీ.దూరం, గంట ప్రయాణం. ఆదిలాబాద్ నుంచి 145కి.మీ. మాత్రమే. ఇంత దగ్గరలో తెలంగాణ వర్సిటీ ఏర్పడి 20 ఏళ్లు కావస్తున్నా.. ఇప్పటికీ అఫ్లియేషన్ చేపట్టకపోవడంపై అన్నివర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇంకెన్నాళ్లు.. ఈ ‘వరంగల్ వెతలు’ పడాలని ప్రశ్నిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత పాలనను ప్రజలకు చేరువ చేసేందుకు జిల్లాల పునర్భిజన చేశారు. దీంతో పాలనాధికారులు ప్రజలకు చేరువయ్యారు. కానీ, వర్సిటీలు మాత్రం విద్యార్థులకు చేరువ కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లా డిగ్రీ కళాశాలలకు తప్పని పాట్లు
ఈ ‘దూరభారం’.. ఇంకెన్నేళ్లు?
‘వరంగల్ వెతలు’ తప్పేదెప్పుడూ..!?
పాలకులూ.. పట్టించుకోరా..!?
తెలంగాణ వర్సిటీ ఏర్పడినా..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి 2006లో నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ యూనివర్సిటీ(తెయూ)ను ప్రారంభించారు. మొదట్లో అక్కడి గిరిరాజ్ కాలేజీలోనే తరగతులు కొనసాగించారు. అనంతరం డిచ్‌పల్లి సమీపంలోని ఎన్‌హెచ్.44 పక్కనే విశాలమైన యూనివర్సిటీ క్యాంపస్‌ను ఏర్పాటు చేశారు. తెయూ ఏర్పడి దాదాపు రెండు దశాబ్ధాలు కావస్తున్నా.. ఇప్పటికీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా డిగ్రీ, పీజీ కాలేజీలను వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న కాకతీయ యూనివర్సిటీ పరిధిలోనే కొనసాగిస్తున్నారు. ఇక్కడి కాలేజీలను తెయూ అనుబంధం(అఫ్లియేషన్) చేయడం లేదు.