
మేనేజర్ సిద్ధార్థ, ఆర్గనైజర్ శ్యామకానుపై శేఖర్ జ్యోతి గోస్వామి ఆరోపణ
గౌహతి: గాయకుడు జుబీన్ గార్గ్ మృతిపై ఆయన బ్యాండ్ సభ్యుడు శేఖర్ జ్యోతి గోస్వామి సంచలన ఆరోపణలు చేశారు. మేనేజర్ సిద్ధార్థ శర్మ, ఫెస్టివల్ ఆర్గనైజర్ శ్యామకాను మహంత.. గార్గ్‌కు విషం ఇచ్చారని ఆయన ఆరోపించారు. పీటీఐకి అందిన అత్యంత కీలక పత్రం ప్రకారం.. గార్గ్ మరణాన్ని ప్రమాదవశాత్తు జరిగినట్లుగా చిత్రీకరించడానికి ‘కుట్ర’ జరిగిందని కూడా గోస్వామి పేర్కొన్నారు. జుబీన్ గార్గ్ సెప్టెంబర్ 19న సింగపూర్‌లో సముద్రంలో ఈత కొడుతూ అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడం తెలిసిందే.
మహంత, అతని సంస్థ నిర్వహించిన 4వ ఈశాన్య భారతదేశ ఉత్సవంలో పాల్గొనేందుకు జుబీన్ గార్గ్ ఆగ్నేయాసియా దేశానికి వెళ్లారు. ‘గార్గ్ మునిగిపోతూ.. శ్వాస ఆడక ఉక్కిరిబిక్కిరవుతున్న విపత్కర సమయంలో ’జబో దే, జబో దే’ (వదిలెయ్, వదిలెయ్) అని శర్మ అరిచాడని, గార్గ్ నిపుణుడైన ఈతగాడని, అతనే తనకీ, నిందితుడికీ ఈత నేర్పించాడు కాబట్టి మునిగిపోయే అవకాశం లేదని.. సాక్షి గోస్వామి స్పష్టం చేసినట్లు రిమాండ్ నోట్ పేర్కొంది. ‘శర్మ, మహంత.. జుబీన్‌కు విషం ఇచ్చారని, తమ కుట్రను దాచడానికి ఉద్దేశపూర్వకంగా విదేశీ వేదికను ఎంచుకున్నారని గోస్వామి ఆరోపించారు.