
‘కష్టమనేది లేని రోజంటు లేదు కదా.. కన్నీరు దాటుకుంటూ సాగిపోక తప్పదుగా’ అన్నారో సినీ కవి. ఇది అక్షర సత్యం. ప్రతి సమస్యకు చావే పరిష్కారం కాదనేది జీవితం నేర్పిన పాఠం. ఆత్మహత్యకు ప్రేరేపించిన పరిస్థితుల కంటే.. దానిని అధిగమిస్తే వచ్చే బంగారు జీవితం గురించి ఒక్క క్షణం ఆలోచించాలని మానసిన వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కలిసుంటే.. కలదు సుఖం అని గ్రహించి, బలవన్మరణాలకు స్వస్తి పలకాలని కోరుతున్నారు.
– భువనేశ్వర్
జాతీయ స్థాయి సగటు కంటే ఒడిశాలో ఈ విషాద ఘటనలు పుంజుకోవడం పట్ల సర్వత్రా విచారం వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల నివారణ పట్ల జంట నగరాల పోలీసు కమిషనరేట్ ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తోంది. వీటి నివారణకు ప్రేరేపిస్తున్న శక్తులు, దర్యాప్తు, విచారణ, మీడియా ప్రసారాల పట్ల దృష్టి సారించాల్సి ఉందని ప్రముఖ మానసిక తత్త్వవేత్త ప్రొఫెసర్ సౌమిత్ర పఠారే తెలిపారు. జాతీయ స్థాయిలో ఆత్మహత్యల పెరుగుదల రేటు 12శాతం నమోదు కాగా, రాష్ట్రంలో 12.5 శాతంగా నమోదు కావడం కలవర పరుస్తోంది.
ఇటీవల వెల్లడించిన జాతీయ నేర నమోదు బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ) నివేదికలో ఈ విషయం పేర్కొంది. యువతరం ఆత్మహత్యల వర్గంలో ఒడిశా దేశంలో రెండో స్థానంలో నిలిచింది. కటక్–భువనేశ్వర్ జంట నగరాల్లో ఈ ఏడాది ఆగస్టు వరకు 226 ఆత్మహత్య ఘటనలు నమోదైనట్లు జంట నగరాల పోలీసు కమిషనరేట్ వెల్లడించింది. ఈ విచారకర ఘటనకు పాల్పడిన వారిలో న్యాయమూర్తులు, మహిళలు, ఇంజినీర్లు, విద్యార్థులు ఉన్నారని నివేదిక విశ్లేషించింది. ఈ పరిస్థితి నివారణ పట్ల పోలీసు యంత్రాంగం ప్రయత్నిస్తోంది.
తాజా గణాంకాలు ఉపశమనం..
విద్యార్థుల ఆత్మహత్య వర్గంలో జాతీయ స్థాయిలో రాష్ట్రం ఐదో స్థానంలో నిలిచింది. విద్యాభ్యాసంతో ఉజ్వల భవిష్యత్ చవి చూడాల్సిన వారు ఆత్మహత్యకు పాల్పడి, బంగారు జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారు. ఉత్తీర్ణతలో నిరాశ, ఉన్నత విద్యాభ్యాసం ఇతరేతర మౌలిక అవసరాలకు ఆర్థిక ఇబ్బందులు, ప్రేమ వ్యవహారాలు తదితర కారణాలతో విద్యార్థి వర్గంలో ఆత్మహత్య ఘటనలు పుంజుకుంటున్నాయి. ఎన్‌సీఆర్‌బీ–2021 నివేదిక ప్రకారం రాష్ట్రంలో గత ఏడాది సమగ్రంగా 834మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
వీరిలో యువకులు అధికంగా బలవన్మరణానికి పాల్పడినట్లు గణాంకాలు వివరించాయి. 697మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడినట్లు రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లల్లో ఫిర్యాదులు నమోదయ్యాయి. ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థినుల సంఖ్య 137గా ఈ నివేదిక వెల్లడించింది. అయితే రాష్ట్రంలో క్రమంగా ఈ పరిస్థితి కుదుటపడే శుభ సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎన్‌సీఆర్‌బీ గత ఏడాది జారీ చేసిన నివేదికలో విద్యార్థుల ఆత్మహత్యల వర్గంలో జాతీయ స్థాయిలో రాష్ట్రం 2వ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది పరిస్థితి కొంత మెరుగుపడినట్లు తాజా నివేదిక వివరాలు స్పష్టం చేస్తున్నాయి.
ఈ ఏడాది జాతీయస్థాయి రేటు ప్రకారం ఈ ఘటనలు తగ్గడంతో 5వ స్థానానికి చేరడం ఉపశమనంగా పరిగణిస్తున్నారు. 2020లో రాష్ట్రంలో 1,469మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. వీరిలో 1,042 మంది బాలురు, 427 మంది బాలికలు ఉన్నారు. 2019 నాటి ఎన్‌సీఆర్‌బీ నివేదిక ప్రకారం 379మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోగా, ఈ జాబితాలో రాష్ట్రం 14వ స్థానంలో నిలిచింది
చక్కటి పరిష్కారం..
ఆత్మహత్యల నివారణలో తల్లిదండ్రులది కీలక పాత్ర. పిల్లలతో నిత్యం కలుపుగోలుగా వ్యవహరించడం తొలి సోపానం. స్వేచ్ఛాపూర్వక భావ వ్యక్తీకరణ ఉచితానుచిత పరిస్థితుల పట్ల అవగాహన కల్పించాలి. జీవితాంతం తోడుగా నిలిచి ఆశయ సాధనకు వెన్నంటి ఉండే వ్యవస్థ కుంటుంబం అనే దృక్పథంతో పిల్లల్లో నమ్మకం, విశ్వాసం బలపరిచి ఒంటరితనాన్ని తరిమితే ఆత్మహత్య నివారణ సాధ్యమే.
విద్యాసంస్థల్లో చైతన్య శిబిరాలు
అంచెలంచెల ఆశయ సాధన లక్ష్యంగా పలు వర్గాల బాల, బాలికలు, యువతీ, యవకులు విద్యా సంస్థలకు విచ్చేస్తారు. వీరి ఆశయ సాధన సాధ్యా సాధ్యాలను మనస్సుకు హత్తుకునేలా విశ్లేషించుకోగలిగే స్థైర్యం ప్రేరేపించడంలో విద్యాసంస్థలు ముందుకు రావాలి. విద్యార్థుల అలవాట్లను అనుక్షణం పరిశీలిస్తూ తదనుగుణంగా చైతన్య శిబిరాలు, మానసిక ఉల్లాసభరిత కార్యక్రమాలు చేపట్టడం విద్యార్థుల్లో ఆత్మహత్య నివారణకు తొలి మెట్టుగా నిలుస్తుంది. జీవితాంతం కలిసి బతుకుదాం.. పూర్ణాయుష్సుతో ఎదుగుదాం.. అనే నినాదంతో ఆత్మహత్య రహిత సమాజ నిర్మాణంలో ప్రతిఒక్కరూ పాత్రధారులు కావాలని ప్రేరేపించనున్నారు.
విఫలయత్నాలెన్నో..
ప్రపంచ ఆరోగ్యసంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) లెక్కల ప్రకారం ప్రతి 40 సెకన్లకు ఒక ఆత్మహత్య చోటు చేసుకుంటుంది. 15 ఏళ్లు నుంచి 29 ఏళ్ల మధ్య ఉజ్వల తారలుగా వెలుగొందాల్సిన వ్యక్తులు అత్యధికంగా ప్రాణాలు విడవటం ఆందోళనకర పరిస్థితి. ఏటా సగటున 7లక్షల 3వేల మంది ఆత్మహత్యలతో జీవితం ముగిస్తున్నారు. ఇలా మృతిచెందిన ప్రతి ఘటన వెనుక 20 ఆత్మహత్య విఫలయత్నాలు ఇమిడి ఉంటున్నాయి.
ఆకస్మిక స్వేచ్ఛ అనర్థం..
ఆకస్మిక స్వేచ్ఛ, ఒంటరి జీవనం, అపరిమిత ఆశయ లక్ష్యం, అపరిచిత వాతావరణంలో సరికొత్త జీవనం విద్యార్థుల్లో అవాంఛిత ఒత్తిళ్లను బలపరిచి, ఆత్మహత్యలను ప్రేరేపిస్తోంది. 90శాతం వరకు సముచిత చికిత్స, వైద్య విధానంతో ఆత్మహత్య పరిస్థితులను నివారించడం సాధ్యం. కళాశాల దశలో అమ్మాయిల కంటే 4, 5 రెట్లు అధికంగా అబ్బాయిలే ఆత్మహత్యకు పాల్పడుతుంటారు. అలాగే యువకుల కంటే 2, 3 రెట్లు అధికంగా యువతులు ప్రాణాపాయం లేని ఆత్మహత్య ప్రయత్నాలకు పాల్పడుతుంటారు. ఒత్తిడి, వేధింపులు, మానసిక అశాంతి, కుటుంబంలో ఆత్మహత్య పూర్వ సంఘటనలు, నిరాశ వంటివి ఆత్మహత్య ప్రేరణ ప్రధాన అంశాలు.
రేపటిని ఆహ్వానించాలి..
ఆత్మహత్య స్వయంకృత అపరాధం. రోజూ కొత్త ఆశయాలతో నేటిని ఆస్వాదించి, రేపటిని ఆహ్వానించడమే జీవన సాఫల్యం. కలవర పరుస్తున్న బలవన్మరణాల నివారణ పురస్కరించుకుని ఏటా సెప్టెంబర్ 10న ప్రపంచ ఆత్మహత్య నివారణ దినం జరుపుకుంటున్నాం. చనిపోయి సాధించేది ఏమీ ఉండదు. మన సమస్యే అందరికంటే పెద్దదని బూతద్దంలో పెట్టి చూడటం మానసికంగా మరింత కృంగదీస్తుంది. ప్రాణాలు తీసుకునేంత వరకు వెళ్లి, బయటపడిన వారి విజయ గాథలను స్ఫూర్తిగా తీసుకోవాలి.
– డాక్టర్ అలోక్‌జ్యోతి సాహు, మానసిక వైద్య నిపుణులు, భువనేశ్వర్