76 రోజుల తర్వాత ఉత్తరకాశీ సొరంగం పనులు షురూ! | Sakshi
Sakshi News home page

Uttarakhand: 76 రోజుల తర్వాత ఉత్తరకాశీ సొరంగం పనులు షురూ!

Published Sun, Jan 28 2024 8:08 AM

Work Starts in Silkyara Tunnel of Uttarakhand After 76 Days - Sakshi

ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో సిల్క్యారా సొరంగంలో ప్రమాదం చేసుకున్న 76 రోజుల తరువాత తిరిగి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు బార్కోట్ వైపు నుంచి ఉత్తరకాశీ జిల్లా సిల్క్యారా రోడ్డు సొరంగంలో నిర్మాణ పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. 

తాజాగా సొరంగం మధ్య షట్టరింగ్‌ పనులు ప్రారంభించారు.  అలాగే సిల్క్యారా వైపు నుంచి సొరంగం ముఖద్వారం వద్ద నిర్మిస్తున్న వంతెన పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఈ సమాచారాన్ని నేషనల్ హైవేస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌హెచ్‌ఐడిసిఎల్) ప్రాజెక్ట్ మేనేజర్ కల్నల్ దీపక్ పాటిల్ మీడియాకు తెలిపారు. రానున్న 15 రోజుల్లో ఈ పనులు మరింత వేగవంతం కానున్నాయి.

సొరంగంలోని సున్నిత ప్రదేశాల్లో ఎస్కేప్ టన్నెల్స్ రూపంలో పైపులు వేస్తున్నట్లు తెలిపారు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతం, సిల్క్యారా వైపు ముఖద్వారం మధ్య దాదాపు 100 మీటర్ల సున్నిత ప్రాంతంలో రక్షణ పనులు ప్రారంభమయ్యాయి. ఎగ్జిట్ టన్నెల్ ద్వారా కార్మికులను పనులు చేసేందుకు లోపలికి పంపుతున్నారు. 

2023, నవంబర్ 12న కొండచరియలు విరిగిపడటంతో సిల్క్యారా సొరంగంలో 41 మంది కార్మికులు చిక్కుకున్నారు. 17 రోజుల పాటు సాగిన రెస్క్యూ ఆపరేషన్ తర్వాత వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఈ ఘటన దరిమిలా నవంబర్ 12 నుంచి సొరంగ నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ఈ సొరంగంలో ఇంకా 480 మీటర్లు మేర తవ్వాల్సి ఉంది.

కేంద్ర మంత్రిత్వ శాఖ పలువురు నిపుణుల సూచనలు, సలహాలు తీసుకున్న తరువాత సొరంగం పనులకు అనుమతినిచ్చింది. ఈ నేపధ్యంలో సొరంగం ముఖద్వారం నుంచి సిల్క్యారా వైపు 100 మీటర్ల  సెంటర్‌ వాల్‌ (సెపరేషన్‌ వాల్‌) షట్టరింగ్‌ పనులు జరుగుతున్నాయని నిర్మాణ పనులు చేపడుతున్న గజ కంపెనీ అధికారులు తెలిపారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement