మంత్రిపై ఆరోపణలు; మహిళ అనూహ్య నిర్ణయం!

Woman Withdraws Complaint On Maharashtra Minister Over Molestation - Sakshi

ముంబై: మహారాష్ట్ర మంత్రి ధనుంజయ్‌ ముండేపై అత్యాచార ఆరోపణలు చేసిన మహిళ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఆయనకు వ్యతిరేకంగా పోలీసులకు చేసిన ఫిర్యాదును ఉపసంహరించుకున్నారు. అయితే ఇందుకు గల కారణాలు మాత్రం ఆమె వెల్లడించలేదు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసు ఉన్నతాధికారి శుక్రవారం ఈ విషయాన్ని మీడియాకు తెలిపారు. కాగా తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక దోపిడీకి పాల్పడ్డాడంటూ సదరు మహిళ జనవరి 11న ధనుంజయ్‌ ముండేపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒశివారా పోలీస్‌ స్టేషనులో ఈ మేరకు వాంగ్మూలం కూడా ఇచ్చారు. ఇందుకు స్పందించిన మంత్రి ఫిర్యాదుదారు సోదరి, తాను రిలేషన్‌షిప్‌లో ఉన్నామని, తనపై వచ్చిన ఆరోపణలను కొట్టిపడేశారు. అడిగినంత డబ్బు ఇవ్వలేదనే అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.(చదవండి: అత్యాచారం చేయలేదు.. రిలేషన్‌లో ఉన్నాం: మంత్రి)

ఈ క్రమంలో ఎన్సీపీ ఎమ్మెల్యే, సామాజిక న్యాయ, సాధికారికత మంత్రి ధనుంజయ్‌ రాజీనామా చేయాలంటూ ప్రతిపక్ష బీజేపీ డిమాండ్‌ చేసింది. అయితే ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ మాత్రం.. ఆరోపణలు వాస్తవాలు తేలితేనే ఆయనపై చర్యలు ఉంటాయని, అంతవరకు పదవిలో కొనాసాగుతారంటూ మద్దతుగా నిలిచారు. ఇక మహిళ ఫిర్యాదు వెనక్కి తీసుకోవడంపై తాజాగా స్పందించిన పవార్‌.. ‘‘ నాకైతే పూర్తి వివరాలు తెలియదు గానీ ఆమె తన కంప్లెంట్‌ వాపసు తీసుకున్నారు. ముండే, అధికారులతో నేను మాట్లాడాను. ఓ వ్యక్తి చెబుతున్నది నిజమో కాదో తెలియకుండా ముందే ఒక నిర్ణయానికి రావడం సరికాదు’’ అని వ్యాఖ్యానించారు. కాగా బాధితురాలిని బెదిరింపులకు గురిచేసినందుకే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top