
వీడియో దృశ్యం
అతడు ఆమెను అసభ్యంగా తాకాడు. అనంతరం అక్కడినుంచి...
గువహటి : పట్ట పగలు, నడిరోడ్డుపై తనను అసభ్యంగా తాకిన వ్యక్తిని పట్టి దుమ్ము దులిపిందో యువతి. రోడ్డుపై పెట్టి ముచ్చెమటలు పట్టించింది. జులై 30న అస్సాంలో చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. అస్సాం, గువహటికి చెందిన భావన కశ్యప్ ఈ నెల 30న రుక్మిణి నగర్ రోడ్డుపై నడుచుకుంటూ వెళుతోంది. స్కూటీపై అటుగా వెళుతున్న రాజ్‌కుమార్ స్కూటీని ఆమె దగ్గర ఆపాడు. ఏదో అడ్రస్ అడిగాడు. అది ఆమెకు వినపడలేదు. దీంతో అతడు ఆమెకు మరింత దగ్గర వచ్చాడు. ‘‘ సీనాకి రోడ్డు ఎక్కడ ఉంది’’ అని అడిగాడు. ఆమె తెలియదని చెప్పింది.
ఈ నేపథ్యంలో అతడు ఆమెను అసభ్యంగా తాకాడు. అనంతరం అక్కడినుంచి పారిపోవటానికి ప్రయత్నించాడు. అతడి చర్యతో షాక్‌కు గురైన భావన! ఆ వెంటనే తేరకుని, పారిపోతున్న అతడ్ని పట్టుకుంది. రోడ్డుపై అందరి ముందు దుమ్మ దులిపేసింది. అనంతరం పోలీసులకు పట్టించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను తన ఫేస్‌బుక్ ఖాతాలో షేర్ చేస్తూ.. జరిగిందంతా రాసుకొచ్చింది. ప్రస్తుతం ఆమె ఫేస్‌బుక్ పోస్ట్ వైరల్‌గా మారింది.