‘కర్తవ్య పథ్‌’లోనే గణతంత్ర వేడుకలు ఎందుకంటే.. | Sakshi
Sakshi News home page

Republic Day 2024: ‘కర్తవ్య పథ్‌’లోనే గణతంత్ర దినోత్సవాలు ఎందుకు?

Published Thu, Jan 25 2024 9:02 AM

Why is Republic Day Parade Celebrated on the Kartavya Path - Sakshi

భారతదేశం రేపు (జనవరి 26) 75వ గణతంత్ర దినోత్సవాలను చేసుకునేందుకు సిద్ధం అవుతోంది. 1950లో భారతదేశం గణతంత్ర దేశంగా అవతరించింది. గణతంత్ర దినోత్సవ వేడుకలకు కేంద్ర బిందువు న్యూ ఢిల్లీలోని కర్తవ్య పథ్‌ (గతంలో రాజ్‌పథ్). ఇక్కడ జరిగే రిపబ్లిక్ డే పరేడ్ అందరినీ ఆకట్టుకుంటుంది.

ఈ పరేడ్‌లో సాయుధ బలగాలకు చెందిన మూడు శాఖల బృందాలు చేసే కవాతు, ఆయుధాలు, సైనిక పరికరాల ప్రదర్శనలు, మోటార్ సైకిల్ విన్యాసాలు భారతదేశ సైనిక సత్తాను చాటుతాయి. ఈ సంవత్సరం భారతదేశ గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరు కావాల్సిందిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌ను ఆహ్వానించారు. ‘కర్తవ్య పథ్‌’ రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు విస్తరించి ఉంది.

ఈ ప్రదేశానికి భారతదేశ స్వాతంత్ర్య పోరాటంతో విడదీయరాని అనుబంధం ఉంది. 1911లో బ్రిటిష్ సర్కారు తన రాజధానిని కలకత్తా (ఇప్పుడు కోల్‌కతా) నుండి ఢిల్లీకి మార్చిన తర్వాత ఈ రహదారిని నిర్మించి, ‘కింగ్స్‌వే’ అనే పేరు పెట్టింది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే ఈ రహదారిని ‘రాజ్‌పథ్‌’గా మార్చారు. ఆ తరువాత దీనికి ‘కర్తవ్య పథ్‌’ అనే పేరుపెట్టారు. 
ఇది కూడా చదవండి: గణతంత్ర దినోత్సవ థీమ్‌ ఏమిటి? ముఖ్య అతిథి ఎవరు?

గత ఏడు దశాబ్దాలుగా అంటే దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి వార్షిక గణతంత్ర దినోత్సవ వేడుకలను ‘కర్తవ్య పథ్‌’లోనే నిర్వహిస్తున్నారు. ఈ రహదారి వలస పాలన నుంచి సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్రం వరకు సాగిన భారతదేశ ప్రయాణానికి చిహ్నంగా నిలిచింది. 2022లో ‘రాజ్‌పథ్’ను ‘కర్తవ్య పథ్‌’గా మార్చారు. అనంతరం దీనికి సెంట్రల్ విస్టా అవెన్యూలో చేర్చారు. 

ఒకప్పడు ‘రాజ్‌పథ్’ అధికార చిహ్నంగా ఉండేది. దానిని ‘కర్తవ్య పథ్‌’గా మార్చాక ఈ రహదారి సాధికారతకు చిహ్నంగా మారింది. ‘కర్తవ్య పథ్‌’ ‍ప్రారంభోత్సవాన ప్రధాని మోదీ మాట్లాడుతూ  నాటి ‘కింగ్స్‌వే’ లేదా ‘రాజ్‌పథ్’ బానిసత్వానికి చిహ్నంగా నిలిచిందని, ఇటువంటి గుర్తింపును శాశ్వతంగా తుడిచివేయడానికే దీనికి ‘కర్తవ్య పథ్‌’ అనే పేరు పెట్టినట్లు తెలిపారు.

Advertisement
Advertisement