కోవోవాక్స్‌ అత్యవసర వినియోగానికి డబ్ల్యూహెచ్‌ ఓకే

WHO emergency-use nod for SIIs Covovax - Sakshi

న్యూఢిల్లీ: కరోనాపై పోరుకు సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ అభివృద్ధి చేస్తున్న కోవోవాక్స్‌ టీకాను అత్యవసర వినియోగానికి అనుమతిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) శుక్రవారం ప్రకటించింది. అమెరికాకు చెందిన నోవావాక్స్‌ నుంచి సీరమ్‌ లైసెన్సులు పొంది దీన్ని రూపొందిస్తోంది. సంస్థ నిర్ణయం కరోనాపై పోరులో మరో మైలురాయిగా సీరమ్‌ సీఈఓ అధార్‌ పూనావాలా అభివర్ణించారు. వచ్చే ఆరు నెలల్లో దీనిని విడుదల చేయాలని భావిస్తున్నట్లు ఇటీవల అధార్‌ చెప్పారు. ప్రస్తుతం ఇది ట్రయిల్స్‌ దశలో ఉంది. ట్రయల్స్‌లో ఆశాజనక ఫలితాలు వచ్చాయని కంపెనీ తెలిపింది. కొత్త టీకా వినియోగానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థకు దరఖాస్తు చేసినట్లు సీరమ్‌ గత నెలలో వెల్లడించింది.

నోవావాక్స్‌ రూపొందించిన NVX& CoV2373 టీకా సామర్థ్యానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని డబ్ల్యూహెచ్‌వోకు అందించినట్లు పేర్కొంది. ఈ టీకా 90శాతం సమర్థత కలిగి ఉన్నట్లు ప్రయోగాల్లో వెల్లడైంది. బ్రిటన్, దక్షిణాఫ్రికాలో జరిపిన ప్రయోగాల్లోనూ 89 శాతం ప్రభావశీలత కలిగినట్లు తేలింది. ఇప్పటివరకు అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్‌లకు భిన్న సాంకేతికతతో నోవావాక్స్‌ను అభివృద్ధి చేశారు. ముఖ్యంగా స్పైక్‌ ప్రొటీన్‌ను గుర్తించి, వైరస్‌పై దాడి చేసేందుకు శరీరాన్ని సిద్ధం చేసేలా ఈ వ్యాక్సిన్‌ రూపొందించారు. డీజీసీఐ తనిఖీల ఫలితాల ఆధారంగా నోవోవాక్స్‌ వాడేందుకు అత్యవసర అనుమతినిస్తున్నట్లు డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. అయితే భారత్‌లో దీని అత్యవసర వినియోగానికి డీజీసీఐ నుంచి అనుమతులురావాల్సిఉంది. ప్రస్తుతం 18ఏళ్లు పైబడినవారికే భారత్‌లో కరోనా టీకాలు ఇస్తున్నారు . 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top