ఐఏఎస్‌ అధికారినంటూ.. నటి, ఎంపీకి నకిలీ టీకా

West Bengal Actor MP Mimi Chakraborty Gets Covid Jab At Fake Drive - Sakshi

మిమి చక్రవర్తి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన ఫేక్‌ వ్యాక్సిన్‌ డ్రైవ్‌ కార్యక్రమం

పోలీసులు అదుపులో నిందితుడు దేవాంగన్‌ దేవ్‌

కోల్‌కతా: ఐఏఎస్‌ అధికారిని.. వ్యా​క్సినేషన్‌ క్యాంప్‌ని ప్రారంభించాల్సిందిగా నటి, ఎంపీ మిమి చక్రవర్తిని కోరడమే కాక.. ఆమెకు కూడా నకిలీ వ్యాక్సిన్‌ వేసిన ఓ వ్యక్తిని కోల్‌కతా పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేశారు. టీకా తీసుకున్న తర్వాత ఆమె మొబైల్‌కు ఎలాంటి మెసేజ్‌ రాకపోవడంతో అనుమానించిన మిమి చక్రవర్తి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన అధికారులు మిమి చక్రవర్తిని బురిడీ కొట్టించిన వ్యక్తి దేవాంజన్‌ దేవ్‌ని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమబెంగాల్‌ కోల్‌కతా సమీపంలోని కస్బా ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. 

ఈ సందర్భంగా మిమి చక్రవర్తి మాట్లాడుతూ.. ‘‘దేవాంజన్‌ దేవ్‌ అనే వ్యక్తి కొన్ని రోజుల క్రితం నా దగ్గరకు వచ్చి తనను తాను ఐఏఎస్‌ అధికారిగా పరిచయం చేసుకున్నాడు. కోల్‌కతా మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధ్వర్యంలో వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నామని తెలిపాడు. నన్ను ముఖ్య అతిథిగా హాజరుకావాల్సిందిగా కోరాడు. అతడు చేస్తున్నది మంచి పని కావడంతో సరే అన్నాను. టీకా తీసుకునేలా జనాలను ప్రోత్సాహించడం కోసం నేను కూడా వ్యాక్సిన్‌ తీసుకున్నాను’’ అని తెలిపారు.

‘‘వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత నాకు ఎలాంటి సర్టిఫికేట్‌ ఇవ్వలేదు. దాని గురించి నిందితుడిని ప్రశ్నిస్తే పొంతనలేని సమాధానం చెప్పాడు. ఆ తర్వాత టీకా తీసుకున్నట్లు కోవిన్‌ నుంచి నా సెల్‌కు ఎలాంటి మెసేజ్‌ రాలేదు. దాంతో నాకు అనుమానం వచ్చి.. నాతో పాటు వ్యాక్సిన్‌ తీసుకున్న వారిని ప్రశ్నించాను. వారు కూడా నాలానే తమకు ఎలాంటి సర్టిఫికేట్‌ ఇవ్వలేదని.. టీకా వేసుకున్నట్లు ఎలాంటి మెసేజ్‌ రాలేదని తెలిపారు. ఈ వ్యవహారం ఏదో తేడాగా ఉందని భావించి పోలీసులకు ఫిర్యాదు చేశాను. అతను నీలిరంగు బెకన్‌, నకిలీ స్టిక్కర్ ఉన్న కారులో నా దగ్గరకు వచ్చాడు’’ మిమి చక్రవర్తి అని తెలిపారు.

మిమి చక్రవర్తి ఫిర్యాదు మేరకు పోలీసులు దేవాంగన్‌ దేవ్‌ని అరెస్ట్‌ చేశారు. ఇక వ్యాక్సినేషన్‌ క్యాంప్‌లో దాదాపు 250 మందికి టీకా వేశారు. వీరందరికి వేసిన వ్యాక్సిన్‌ నిజమైనదా.. కాదా అనే దాని గురించి దర్యాప్తు చేస్తున్నారు.  ఏ డోస్‌ మీద కూడా ఎక్స్‌పైరీ డేట్‌ లేకపోవడంతో ప్రస్తుతం వాటిని కోల్‌కతాకు పంపినట్లు అధికారులు తెలిపారు. 

చదవండి: నిర్మాత సురేష్‌ బాబును బురిడీ కొట్టించిన కేటుగాడు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top