ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిపై ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ డైరెక్టర్‌ విమర్శలు

Vivek Agnihotri Objection To Manish Sisodia Rajput Comments - Sakshi

న్యూఢిల్లీ: బీజేపీలో చేరితే కేసులన్నీ ఎత్తివేస్తామని తనకు సందేశాలు వచ్చాయని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా పేర్కొన్నారు. ఈ సందర్భంగా తాను రాజ్‌పుత్‌ కమ్యూనిటీకి చెందిన వాడనని.. ఎవరి ముందు తలవంచనని తెలిపారు. మనీష్‌ సిసోడియా ‘రాజ్‌పుత్‌’ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ డైరెక్టర్‌ వివేక్‌ అగ్నిహోత్రి. రాజ్‌పుత్‌లు మినహా ఇతర కులాల వారు ఎదుటివారి ముందు తలవంచుతారని మనీష్‌ సిసోడియా ఉద్దేశమా? ఇది ఎలాంటి కులవాదం? అని ట్విట్టర్‌ వేదికగా ప్రశ్నించారు.

‘దీనర్థం ఆయన రాజ్‌పుత్‌ కాకపోతే లొంగిపోయేవారా? ఢిల్లీలోని బ్రాహ్మణులు, యాదవులు, గుజ్జార్లు, జాట్స్‌, సిక్కులు వంటి వారి సంగతేంటి? వారంతా ఇతరులకు లొంగిపోయే స్వభావం కలిగి ఉన్నారా? ముస్లింలు, క్రిస్టియన్లు, దళితుల సంగతేంటి?’ అని ట్విట్టర్‌లో రాసుకొచ్చారు డైరెక్టర్‌ వివేక్‌ అగ్నిహోత్రి. మనీష్‌ సిసోడియా చేసిన ప్రకటనను తన ట్వీట్‌కు జోడించారు డైరెక్టర్‌. 

ఢిల్లీ లిక్కర్‌ పాలసీలో అవకతవకలపై ఇటీవల మనీష్‌ సిసోడియా నివాసాల్లో సీబీఐ సోదాలు నిర్వహించిన నేపథ్యంలో బీజేపీ, ఆప్‌ మధ్య మాటల యుద్ధం మొదలైంది. 2024 ఎన్నికల్లో ప్రధాని మోదీకి ప్రధాన ప్రత్యర్థి కేజ్రీవాల్‌ కానున్నారనే కారణంగానే ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతలపై ఒత్తిడి తెస్తున్నారని ఆప్‌ నేతలు ఆరోపించారు. ఈ క్రమంలోనే బీజేపీలో చేరితే కేసులు ఎత్తివేస్తామంటూ బీజేపీ నుంచి తనకు సందేశాలు వచ్చాయని బాంబు పేల్చారు సిసోడియా. ఆ సందేశాలకు ప్రతిస్పందనగా మాట్లాడుతూ తాను రాజ్‌పుత్‌నని, మహారాణా ప్రతాప్‌ వంశస్థుడినని, అవసరమైతే తల నరుక్కుంటా కానీ, ఎవరి ముందు తల వంచనంటూ వ్యాఖ్యానించారు. 

ఇదీ చదవండి: Manish Sisodia: ‘ఆప్‌ని వదిలేసి బీజేపీలో చేరమని మెసేజ్‌ పంపారు’

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top