అంధుడైన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌కు.. మైక్రోసాఫ్ట్‌లో 47 లక్షల వేతనం

Visually Impaired Software Engineers Get Rs 47 Lakhs Microsoft Job - Sakshi

ఇండోర్‌: అంధత్వాన్ని లెక్కచేయకుండా చివరికి అనుకున్నది సాధించి చూపారు సామాన్య కుటుంబానికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. ప్రముఖ ఐటీ కంపెనీ మైక్రోసాఫ్ట్‌ నుంచి భారీ వేతన ప్యాకేజీ అందుకున్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన యశ్‌.. సొనాకియా ఇండోర్‌లో బీటెక్‌ చేశారు. ‘స్క్రీన్‌–రీడర్‌ సాఫ్ట్‌వేర్‌ సాయంతో చదువుకున్న నేను, కోడింగ్‌ నేర్చుకుని ఉద్యోగాన్వేషణ మొదలుపెట్టా. మైక్రోసాఫ్ట్‌ ఆన్‌లైన్‌ పరీక్ష, ఇంటర్వ్యూలో నెగ్గి, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ పోస్ట్‌కు ఎంపికయ్యా’అని చెప్పారు. ‘మైక్రోసాఫ్ట్‌ ఇచ్చిన రూ.47 లక్షల వార్షిక వేతన ప్యాకేజీ ఆఫర్‌కి ఓకే చెప్పాను’అని వివరించారు.

యశ్‌ సొనాకియా తండ్రి యశ్‌పాల్‌ స్థానికంగా క్యాంటీన్‌ నిర్వహిస్తున్నారు. మొదటి సంతానమైన యశ్‌కు పుట్టుకతోనే గ్లూకోమా ఉంది. అప్పట్లో స్వల్పంగా ఉన్న కంటిచూపు క్రమక్రమంగా తగ్గుతూ 8 ఏళ్లు వచ్చేసరికి పూర్తిగా అంధుడై పోయారు. దీంతో, యశ్‌ 5వ తరగతి వరకు ప్రత్యేక పాఠశాలలో చదివారు. ఆ తర్వాత, తన తోబుట్టువులతోపాటే సాధారణ స్కూలుకు వెళ్లారు. వాళ్లే చదువులో అతడికి సాయం చేసేవారు. ‘సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ కావాలన్న కల సాకారం చేసుకునేందుకు యశ్‌ ఎంతో కష్టపడ్డాడు. నా కోరికా అదే. చివరికి ఫలించింది’అని యశ్‌పాల్‌ గద్గదస్వరంతో అన్నారు.   

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top