
నిబంధనలను సరళతరం చేసిన కేంద్రం
విదేశీ విభాగ ఉన్నతాధికారులతో కేంద్రమంత్రి బండి సంజయ్ సమావేశం
సాక్షి, న్యూఢిల్లీ: వీసా జారీ చేయడానికి ప్రస్తుతం కొన్ని వారాల సమయం పడుతోంది. ఇకపై అన్ని పత్రాలు సమరి్పస్తే ఒక్క రోజులోనే వీసాను పొందేందుకు కేంద్ర ప్రభుత్వం నిబంధనల్లో వెసులుబాటు తీసుకొచి్చంది. అక్రమ వలసదారులు, గడువుతీరినా దేశంలోనే ఉండే విదేశీయులపై పర్యవేక్షణను మరింత బలోపేతం చేసేందుకు డిస్ట్రిక్ట్ పోలీస్ మాడ్యూల్ (డీపీఎం), ఫారినర్స్ ఐడెంటిఫికేషన్ పోర్టల్ (ఎఫ్‌ఐపీ) అనే రెండు కొత్త పోర్టల్స్‌ను ప్రారంభించింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ బుధవారం ఢిల్లీలోని నార్త్ బ్లాక్‌లో విదేశీ విభాగ ఉన్నతాధికారులతో సమీక్షించారు.
ఈ సమావేశంలో వీసా విధానాల సరళతరం, ఇమ్మిగ్రేషన్ చెక్‌పోస్టుల ఆధునీకరణ వంటి అంశాలపై చర్చించారు. 2024లో జారీ చేసిన మొత్తం వీసాలలో ఈ–వీసాల వాటా 65.15 శాతం. వీసా విధానాల సులభతరం వల్ల వీసా జారీ సగటు సమయం కొన్ని వారాల నుంచి ఒక రోజులోపు తగ్గినట్టు కేంద్రమంత్రికి అ«ధికారులు తెలిపారు. అధికారుల పనితీరును అభినందించిన బండి సంజయ్.. వీసా, ఇమ్మిగ్రేషన్ విషయంలో ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సూచించారు.
కేంద్రం తీసుకున్న నిర్ణయాలు, అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్ర స్థాయిలో సాధారణ ప్రజలకు చేరవేయాలని ఆదేశించారు. ఇమ్మిగ్రేషన్ చెక్‌పోస్టు (ఐసీపీ)ల ఆధునీకరణలో భాగంగా ఆటోమేటెడ్ ట్రావెల్ డాక్యుమెంట్ స్కానింగ్, బయోమెట్రిక్ నమోదు సదుపాయాలను కల్పించినట్టు అధికారులు పేర్కొన్నారు. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, కొచ్చి, అహ్మదాబాద్‌లలో ఫాస్ట్–ట్రాక్ ఇమ్మిగ్రేషన్ ట్రస్టెడ్ ట్రావెలర్ ప్రోగ్రాం (ఎఫ్‌టీఐ–టీటీపీ) అమలు చేస్తున్నట్టు అధికారులు చెప్పారు.