‘టీవీకే’ రోబోను చూశారా? సందడి మాములుగా లేదుగా! | Vijay TVK Party Uses Robot To Boost Campaign In Coimbatore | Sakshi
Sakshi News home page

‘టీవీకే’ రోబోను చూశారా? సందడి మాములుగా లేదుగా!

Apr 21 2026 12:37 PM | Updated on Apr 21 2026 1:24 PM

Vijay TVK Party Uses Robot To Boost Campaign In Coimbatore

చెన్నై: కోయంబత్తూరులో  తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ వినూత్నంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోంది. రోబోతో ఓట్ల వేట మొదలుపెట్టింది. టీవీకే కండువా ధరించిన ఒక రోబోను రంగంలోకి దించారు. సౌత్ చెన్నై అభ్యర్థి సెంథిల్ కుమార్‌కు మద్దతుగా రోబో ప్రజలకు అభివాదం చేస్తూ.. వారితో కరచాలనం చేస్తూ సందడి చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ అధినేత విజయ్ క్షేత్రస్థాయి ప్రచారంలో తక్కువగా పాల్గొంటుండటంతో అభ్యర్థులు వినూత్న పద్ధతుల్లో ప్రచారం చేస్తున్నారు తిరువెరుంబూర్‌లో అభ్యర్థి విజయ్ కార్డ్‌బోర్డ్ కటౌట్‌ను ఉపయోగించారు. కుంభకోణంలో హోలోగ్రామ్ ఏఐ సాంకేతికతతో ప్రచారం నిర్వహించారు. కొలత్తూరులో విజయ్ పోలికలతో ఉన్న వ్యక్తితో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కోయంబత్తూరు సౌత్‌లో ఇప్పుడు రోబో ప్రచారం హాట్ టాపిక్‌గా మారింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుండి విజయ్ కేవలం ఏడు జిల్లాల్లో మాత్రమే పర్యటించడంతో విపక్షాలు ఆయనపై విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ విమర్శలపై విజయ్ స్పందిస్తూ.. పోలీసులు, కొందరు అధికారులు చివరి నిమిషంలో టీవీకే కార్యక్రమాలకు అనుమతులు నిరాకరిస్తున్నారంటూ ఆరోపించారు. కేవలం సంప్రదాయ ప్రచార పద్ధతులపైనే తాము ఆధారపడలేదని, ఇప్పటికే తమిళనాడులోని ప్రతి ఇంటిలోనూ సానుకూల పవనాలు వీస్తున్నాయని ఆయన  ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడులో ఏప్రిల్ 23న పోలింగ్ జరగనుండగా.. నేటితో(ఏప్రిల్‌ 21, మంగళవారం) ప్రచార గడువు ముగియనుంది.

ఈ చివరి రోజున విజయ్ సౌత్ చెన్నైలో రోడ్‌షో నిర్వహించడంతో పాటు చెన్నైలోని పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. పోలింగ్‌ ఏప్రిల్‌ 23 (గురువారం) ఉదయం 7.00 గంటల నుండి సాయంత్రం 6.00 గంటల వరకు జరగనుంది. ప్రచారం ముగిసిన తర్వాత ఎలాంటి బహిరంగ సభలు, ఊరేగింపులు నిర్వహించకూడదని ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు జారీ చేసింది. సంగీత కచేరీలు, థియేటర్‌ ప్రదర్శనలు లేదా ఇతర వినోద కార్యక్రమాల ద్వారా ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేయకూడదన్నారు. ఎన్నికల అంశాలను టీవీలు, సినిమాలు, ఎఫ్‌.ఎమ్‌. రేడియోలు, వాట్సాప్, ఫేస్‌బుక్, ఎక్స్‌(ట్విట్టర్‌) వంటి ఏ మాధ్యమం ద్వారా కూడా ప్రసారం చేయకూడదన్నారు. ఎల్రక్టానిక్‌ రూపంలో వచ్చే సంక్షిప్త సందేశాల, ఇంటర్నెట్‌ ప్రచారాలకు కూడా ఇది వర్తిస్తుందని స్పష్టం చేశారు. 


 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement