సీబీఐ ఛార్జ్‌షీట్‌లో విస్తుపోయే విషయాలు: లోన్లు చెల్లించేంత డబ్బుంది. కానీ, సొమ్ముతో మాల్యా..

Vijay Mallya had enough money to pay back loan But He Did This - Sakshi

ముంబై: బ్యాంకులకు వేల కోట్లు ఎగనామం పెట్టి విదేశాలకు పరారైన విజయ్‌ మాల్యా వ్యవహారానికి సంబంధించి.. సీబీఐ తాజాగా ముంబై కోర్టులో సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. అందులో విస్తుపోయే విషయాలను పేర్కొంది దర్యాప్తు సంస్థ. 

విజయ్ మాల్యా దగ్గర ఆ సమయానికి రుణం తిరిగి చెల్లించడానికి తగినంత డబ్బు ఉనప్పటికీ.. ఆ పని చేయలేదని, బదులుగా ఆయన దేశం విడిచి పారిపోయే ముందు విదేశాలలో ఆస్తులు కొనుగోలు చేశాడని సీబీఐ తన ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. అదే సమయంలో బ్యాంకులు సైతం ఆయన నుంచి లోన్లు రికవరీ చేయడంలో విఫలం అయ్యాయంటూ తెలిపింది. 

2008-17 మధ్య మాల్యా దగ్గర బ్యాంకు లోన్లు చెల్లించడానికి తగినంత డబ్బు ఉంది. ఆ సమయంలోనే కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ లిమిటెడ్‌ కోసం అతను లోన్లు తీసుకున్నాడు అని సీబీఐ పేర్కొంది. అయితే.. తన దగ్గర ఉన్న సొమ్ముతో లోన్లు చెల్లించకపోగా.. యూరప్‌ వ్యాప్తంగా వ్యక్తిగతంగా ఆస్తులు కొనుగోలు చేయడంతో పాటు తన పిల్లలకు సంబంధించి స్విట్జర్లాండ్‌లో ఉన్న ట్రస్టులకు డబ్బును ట్రాన్స్‌ఫర్‌ చేశాడని గుర్తించినట్లు సీబీఐ పేర్కొంది. ఫ్రాన్స్‌లో 35 మిలియన్‌ యూరోలు చెల్లించి రియల్‌ ఎస్టేట్‌ను కొనుగోలు చేశాడు. తన కంపెనీలలో ఒకటైన గిజ్మో హోల్డింగ్స్ ఖాతా నుండి 8 మిలియన్ యూరోలు చెల్లించాడని సీబీఐ పేర్కొంది. అలాగే ఇంగ్లండ్‌లోనూ ఆస్తులు కొన్నట్లు గుర్తించినట్లు కోర్టుకు తెలిపింది. 

ఐడీబీఐ-కింగ్‌పిషర్‌ ఎయిర్‌లైన్స్‌ 900 కోట్ల రూపాయల లోన్‌ ఫ్రాడ్‌ కేసులో విజయ్‌ మాల్యా నిందితుడిగా ఉన్నాడు.  విజయ్‌ మాల్యా 2016లో దేశం విడిచి పారిపోయి.. యూకేలో తలదాచుకున్నాడు.  ఈ మేరకు అతన్ని వెనక్కి రప్పించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి కూడా. కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. 2019, జనవరి 5వ తేదీన ముంబై ప్రత్యేక కోర్టు మాల్యాను fugitive(పరారీలో) ఉన్నట్లుగా ప్రకటించింది.  ఇక.. గత ఛార్జ్‌షీట్‌లో 11 మంది నిందితుల పేర్లను పేర్కొన్న సీబీఐ, తాజా ఛార్జ్‌షీట్‌లో ఐడీబీఐ బ్యాంక్‌ మాజీ మేనేజర్‌ బుద్ధదేవ్‌ దాస్‌గుప్తా పేరును చేర్చింది.  మొత్తంగా రూ.9వేల కోట్ల రుణ ఎగవేత ఆరోపణలతో దేశం విడిచి వెళ్లిపోయాడు మాల్యా.

ఇదీ చదవండి: ఎంజాయ్‌ చేద్దాం అనుకుంటే.. వణికిపోయేలా చేసింది!

మరిన్ని వార్తలు :

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top