అల్లర్లకు రిటర్న్‌ గిఫ్ట్‌! దుమ్మెత్తిపోస్తున్న ప్రతిపక్షాలు

Video Incident Is Return Gift For Rioters By UP BJP MLA  - Sakshi

లక్నో: మహ్మద్‌ ప్రవక్త పై బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్‌ శర్మ చేసిన వ్యాఖ్యలు రోజురోజుకి కార్చిచ్చులా రగిలిపోతుందే తప్ప ఇప్పట్లో ఎక్కడా చల్లబడేటట్లు లేదు. అల్లర్లు ఏ మాత్రం తగ్గడం లేదు. ఈ మేరకు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్, సహారన్‌పూర్‌లో బీజేపీ మాజీ అధికార ప్రతినిధి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు వ్యతిరేకంగా శుక్రవారం హింసాత్మక నిరసనలు చోటుచేసుకున్నాయి.

శుక్రవారం మసీదుల్లో ప్రార్థనలు ముగిసిన వెంటనే నిరసనకారులు పోలీస్‌స్టేషన్‌ పై రాళ్లు రువ్వారు. ప్రయాగ్‌రాజ్‌లో ఒక గుంపు కొన్ని మోటార్‌సైకిళ్లను,  బండ్లను తగులబెట్టడమే కాకుండా పోలీసు వాహనాన్ని కూడా తగలబెట్టడానికి ప్రయత్నించింది. దీంతో ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు టియర్ గ్యాస్, లాఠీలను ప్రయోగించక తప్పలేదు. ఈ క్రమంలోనే పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టే నిమ్మితం తొమ్మిది మంది పై గట్టిగా లాఠీ ఝళిపించారు.

ఐతే ఈ ఘటన తాలుకా వీడియోని బీజేపీ ఎమ్మెల్యే శలభ్ మణి త్రిపాఠి సోషల్‌ మీడియాలో ఇది "అల్లర్లకు రిటర్న్‌ గిఫ్ట్‌" అని క్యాప్షన్‌ జోడించి మరీ పోస్ట్‌ చేశారు. దీంతో ఈ వివాదం మరింత ముదిరింది. ప్రతిపక్షాలు పోలీసుల తీరు పై, బీజేపీ ప్రభుత్వ వైఖరిపై దుమ్మెత్తిపోస్తున్నాయి. ఈ మేరకు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ.."ఇలాంటి ఘటనలు న్యాయవ్యవస్థపై ప్రజలకున్న విశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. పైగా ఇలాంటి పోలీస్‌స్టేషన్లను గట్టిగా నిలదీయాలి.

కస్టడీ మరణాల్లో యూపీనే నెంబర్‌ వన్‌. అంతేకాదు మానవ హక్కుల ఉల్లంఘన, దళితులపై వేధింపుల్లో కూడా యూపీనే అగ్రగామిగా ఉందంటూ విమర్శలు గుప్పించారు. ఉత్తరప్రదేశ్‌ పోలీసు ఈ హింసాత్మక ఘటనకు సంబంధించి సుమారు 300 మంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. మరోవైపు ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కూడా.

(చదవండి: బీజేపీ చేసిన తప్పులకు ప్రజలు ఇబ్బందిపడాలా..?)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top