‘ఆయన ఆలోచనలను పుస్తక రూపంలో తీసుకొచ్చారు’

Venkaiah Naidu Releases Telugu Version Of The 10 Ideologies Book In Delhi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: భారత సాంస్కృతిక ఐక్యతే ఇవాళ దేశప్రజలను సమైక్యంగా మార్చిందని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి రాసిన ‘ది టెన్ ఐడియాలజీస్’ పుస్తకం తెలుగు అనువాదం ‘పది భావజాలాలు’ను వెంకయ్య నాయుడు ఆన్‌లైన్ ద్వారా మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన దేశం, మన నేల, మన జాతి, మన సంస్కృతి సంప్రదాయాలకు ముప్పువాటిల్లుతుందని గ్రహిస్తే.. ప్రజలంతా ఏకమై ఆ దాడిని ఎదుర్కునేందుకు సిద్ధపడతారని, ఇదే జాతీయవాదమన్నారు. భారతీయ ఆత్మలో జాతీయవాదం బలంగా ఉందని ఇటీవల ఎదురైన పరిణామాలు నిరూపిస్తున్నాయని ఆయన అన్నారు. ‘మతం, జాతి, భాష అనే వాటిని ప్రతికూల దృక్పథంతో ఆలోచించే ధోరణి సరైనది కాదని నా అభిప్రాయం. అవి మన అస్తిత్వానికి, సంస్కృతికి, సమైక్యతకు సమగ్రతకు తోడ్పడి దేశ శ్రేయస్సుకు ఉపయోగపడడం ఆరోగ్యకరమైన పరిణామమే. ఈ విషయంలో మన దృష్టి కోణాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది’ అని వెంకయ్య అన్నారు. (చదవండి: విగ్రహాల ఏర్పాటు ఉద్దేశం ఇదే: ఉప రాష్ట్రపతి)

ప్రజాస్వామ్యం అనేది.. ఒక సామాజిక వ్యవస్థ పరిణామంలో పరిపక్వమైన పరిస్థితులకు సంకేతమన్నారు. ప్రజలు తమకు అవకాశం దొరికినప్పుడల్లా ప్రజాస్వామిక ప్రక్రియను ఉపయోగించుకుని తమ పరిపక్వతను ప్రదర్శించిన సందర్భాలు కోకొల్లలని పేర్కొన్నారు. ‘ప్రజాస్వామిక వ్యవస్థల్లో లోపాలు ఉన్నప్పటికీ.. ఈ లోపాలు పరిణామ క్రమంలో ఏర్పడినవే. వాటిపై చర్చిస్తూ, పరిష్కరించుకునే క్రమంలో ప్రజాస్వామ్యం తనను తాను మెరుగుపరుచుకుని అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. విద్యార్థిగా ఉన్నప్పటి నుంచే విస్తృత అధ్యయనం చేసే ఆసక్తితో మాజీ మంత్రి జైపాల్ రెడ్డి పలు జాతీయ, అంతర్జాతీయ అంశాలపై చక్కటి అవగాహన పెంచుకున్నారు. ప్రతి విషయాన్ని సైద్ధాంతికంగా, కార్యకరణ సంబంధాలతో, లాజికల్‌గా ఆలోచించడం జైపాల్ రెడ్డి ప్రత్యేకత. వాదన పటిమ, లోతైన విశ్లేషణతో, అరుదైన రాజనీతిజ్ఞుడిగా అందరి మనసులు గెలిచిన జైపాల్ రెడ్డి తన ఆలోచనలను ‘టెన్ ఐడియాలజీస్’ పేరుతో పుస్తక రూపంలో తీసుకొచ్చారు’ అని తెలిపారు. (చదవండి: కరోనాపై పోరులో మీడియాది అసమాన పాత్ర)

ఈ ఇంగ్లీష్ పుస్తకాన్ని స్వయంగా ఆయనే తనను కలిసి బహుకరించిన విషయాన్ని ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి గుర్తుచేసుకున్నారు. ‘ఈ పుస్తకంలో వర్తమాన సమస్యలను పరిష్కరించేందుకు ఒక ఆధునిక సైద్ధాంతిక దృక్పథం అవసరమని జైపాల్ రెడ్డి వివరించారు. భావజాలాల గురించి విశ్లేషించేటప్పుడు జైపాల్ రెడ్డి ప్రపంచంలో చర్చకు వచ్చిన అన్ని సిద్ధాంతాల గురించి ప్రస్తావించడం కాకుండా.. సమాజంలో మార్పులకు దోహదం చేసిన అనేక పరిణామాలను వాస్తవిక దృక్పథంతో విశ్లేషించి వాటికి తాత్విక కోణాన్ని జోడించారు. ‘వ్యవసాయిక సమాజం నుంచి పారిశ్రామిక సమాజం వరకు’ మారే క్రమంలో వివిధ దేశాల్లో  జరిగిన అనేక పరిణామాలను, అన్వేషణలను, ఆవిష్కారాలను, భావజాలాలను అన్వేషించారు. ఇవాళ మనం చూస్తున్న ప్రజాస్వామ్యం, పెట్టుబడిదారీ విధానాలతో పాటు పర్యావరణ వాదం, స్త్రీవాదం, ప్రపంచీకరణ, సంస్కరణల వెనుక ఉన్న మూలాల్ని ఆయన పది భావజాలాలుగా వర్గీకరించారు. ఈ పది భావజాలాల్లో ప్రధానమైనది జాతీయవాదం’ అని వెంకయ్య నాయుడు చెప్పుకొచ్చారు. 

(చదవండి: వీవీని కాపాడండి: హృదయం చెమ్మగిల్లుతోంది)

రాజకీయాల్లో ఉన్న వారికి తాత్విక దృక్పథం తప్పని సరిగా ఉండాలని.. సిద్ధాంతం, తాత్విక దృక్పథం లేని రాజకీయాలు పూర్తిగా వృథా అని ఆయన అభిప్రాయపడ్డారు. సైద్ధాంతిక విలువలున్న రాజకీయాలు దేశానికి ఒక స్పష్టమైన దిశానిర్దేశాన్ని అందిస్తాయన్నారు. దేశ ప్రజల సమస్యలను పరిష్కరించడంతో పాటు దేశానికి బలమైన ఆర్థిక, రాజకీయ, సామాజిక వ్యవస్థను ఏర్పర్చేందుకు దీర్ఘకాలిక దృష్టిని, కార్యాచరణను అందించేదే ఒక సైద్ధాంతిక దృక్పథమన్నారు. ఈ పుస్తకాన్ని తెలుగులోకి అనువదించిన సీనియర్ పాత్రికేయుడు కల్లూరి భాస్కరంను, ఈ పుస్తక ప్రచురణ కర్తలు ‘ఓరియంట్ బ్లాక్ స్వాన్’ సంస్థ వారిని కూడా ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి అభినందించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top