గుడ్‌ న్యూస్‌ : ఈ నెల 16 నుంచే వ్యాక్సినేషన్‌ | Vaccination drive to kick off on 16th Jan, 2021:Govt of India | Sakshi
Sakshi News home page

గుడ్‌ న్యూస్‌ : ఈ నెల 16 నుంచే వ్యాక్సినేషన్‌

Jan 9 2021 4:47 PM | Updated on Jan 9 2021 5:41 PM

 Vaccination drive to kick off on 16th Jan, 2021:Govt of India - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశ ప్రజలకు కేంద్రం సంక్రాంతి కానుకను అందించింది. 2021 జనవరి 16న కరోనా టీకా డ్రైవ్ ప్రారంభమవుతుందని శనివారం అధికారికంగా వెల్లడించింది.ఈ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ తొలిదశలో ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగంలోని ఆరోగ్య సంరక్షణ కార్మికులకు, ఫ్రంట్‌లైన్ కార్మికులకు ప్రాధాన్యత ఉంటుందని తెలిపింది. ఇందులో భాగంగా 3 కోట్ల మందికి  వ్యాక్సిన్‌ అందించనున్నారు. ఆ తరువాత 50 ఏళ్లు పైబడిన వారికి, తీవ్ర అనారోగ్యంతో ఉన్న 50 ఏళ్లలోపు వారికి టీకా వేయనున్నారు. వీరి సంఖ్య 27 కోట్లుగా ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. 

వ్యాక్సిన్ పంపిణీపై ఉన్నతాధికారులతో ప్రధాని సమీక్ష నిమిత్తం  నిర్వహించిన సీనియర్ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  అధ్యక్షత వహించారు. కోవిడ్ వ్యాక్సినేషన్‌కు సంబంధించి విస్తృత ఏర్పాట్లు చేయాలని కేంద్ర కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌభ అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు ఆదేశాలిచ్చారు. అన్ని రాష్ట్రాల సీఎస్‌లతో మాట్లాడిన కేంద్ర కేబినెట్ సెక్రటరీ డ్రై రన్‌లో ఎదురైన అనుభవాలపై చర్చించిన అంనతరం ఈ ఆదేశాలు జారీ చేశారు. అన్నిరాష్టాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లతో కరోనా టీకా పంపిణీ ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్  ద్వారా ఆయన సమీక్షించారు. డ్రై రన్ అనుభవాలను పరిగణనలోకి తీసుకొని  ఎలాంటి సమస్యలు  తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేయాలని ఆయన కోరారు. 

అలాగే  ప్రభుత్వ  అధికార  కోవిన్ యాప్  (డిజిటల్‌ ప్లాట్‌ఫాం) ద్వారా టీకా ప్రక్రియను సమీక్షించనున్నారు. టీకా లబ్ధిదారులను ప్రామాణీకరించడానికి ఆధార్ నంబర్లను ఉపయోగించకుంటామనీ, టీకా లభ్యమయ్యే తేదీ సమయం వివరాలతో వారి,వారి మొబైల్ ఫోన్లకు కనీసం 12 భాషలలో టెక్ట్స్‌సందేశాలను పంపుతామని ప్రభుత్వం తెలిపింది. మొదటి దశలో  సుమారు 30 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్‌ అందించాలని భుత్వం యోచిస్తోంది. అయితే ఈయాప్ ఇంకా ప్రారంభం కాలేదు.  కాగా దేశంలో అత్యవసర ఉపయోగం కోసం రెండు టీకాలను  ఇటీవల ప్రభుత్వం ఆమోదించింది. వీటిలో ఒకటి భారత్ బయోటెక్ రూపొందిస్తున్న కోవాక్సిన్ కాగా రెండవది ఆస్ట్రాజెనెకా,ఆక్స్‌ఫర్డ్‌  డెవలప్‌చేసిన కోవీషీల్డ్‌. కోవిషీల్డ్‌ టీకాను పూణేకు చెందిన సీరం తయారు చేస్తున్నసంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement