తాజ్‌ మహల్‌ను  సందర్శించిన జేడీ వాన్స్‌  | USA Vice-President J D Vance visited the Taj Mahal | Sakshi
Sakshi News home page

తాజ్‌ మహల్‌ను  సందర్శించిన జేడీ వాన్స్‌ 

Apr 24 2025 12:53 AM | Updated on Apr 24 2025 9:26 AM

USA Vice-President J D Vance visited the Taj Mahal

ఆగ్రా/జైపూర్‌: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ కుటుంబం తాజ్‌ మహల్‌ను సందర్శించింది. తన భార్య ఉషా వాన్స్, ముగ్గురు పిల్లలతో కలిసి బుధవారం ఉదయం తాజ్‌ మహల్‌కు చేరుకున్న జేడీ వాన్స్‌.. తాజ్‌ మహల్‌ అంతటా కలియదిరిగారు. ఓ గంటపాటు ఆ అద్భుత నిర్మాణాన్ని వీక్షించారు. సందర్శన అనంతరం ‘తాజ్‌ మహల్‌ ఓ అద్భుతం. 

నిజమైన ప్రేమకు, మానవ నైపుణ్యానికి నిదర్శనం’అని వాన్స్‌ సందర్శకుల డైరీలో రాశారు. అంతకుముందు జైపూర్‌ నుంచి ఆగ్రా విమానాశ్రయానికి చేరుకున్న వాన్స్‌ కుటుంబానికి ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఘనంగా స్వాగతం పలికారు. 

వారు ఆగ్రా విమానాశ్రయం నుంచి తాజ్‌ మహల్‌ వరకు కారులో ప్రయాణించారు. వారి కాన్వాయ్‌ మార్గం వెంబడి ఉన్న మార్గాలను ప్రత్యేకంగా అలంకరించారు. వందలాది మంది పాఠశాల పిల్లలు వీధుల్లో నిలబడి, అమెరికా–భారత్‌ల జాతీయ పతాకాలను ఎగురవేశారు. తాజ్‌ మహల్‌ దారి పొడవునా రంగురంగుల ముగ్గులు, ఇసుకతో బొమ్మలు సహా వివిధ అలంకరణలతో పండుగ వాతావరణాన్ని సృష్టించారు. 

వాన్స్‌ కుటుంబానికి స్వాగతం పలుకుతూ పలు చోట్ల భారీ హోర్డింగులు కూడా ఏర్పాటు చేశారు. హైప్రొఫైల్‌ పర్యటన సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పర్యటన అనంతరం వాన్స్‌ కుటుంబం జైపూర్‌కు తిరిగి వచ్చింది. ముందే షెడ్యూల్‌ అయిన జైపూర్‌ సిటీ ప్యాలెస్‌ పర్యటనను వారు రద్దు చేసుకుని, నేరుగా రామ్‌ బాగ్‌ ప్యాలెస్‌కు వెళ్లారు. నాలుగు రోజుల భారత పర్యటనలో ఉన్న వాన్స్‌ కుటుంబం గురువారం ఉదయం అమెరికాకు తిరిగి వెళ్లనుంది. 

Advertisement
 
Advertisement
Advertisement