కోవిడ్‌పై పోరులో భారత్‌కు పూర్తి మద్దతు

USA President Joe Biden pledges support to PM Modi on vaccine inputs - Sakshi

అమెరికా అధ్యక్షుడు బైడెన్‌

మోదీతో ఫోన్‌లో మాట్లాడిన బైడెన్‌

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కరోనాపై పోరులో భారత్‌కు పూర్తి సంఘీభావం ప్రకటించారు. ఈ విపత్కర సమయంలో భారత్‌కు అవసరమైన అన్నిరకాల సహాయం చేయాలని కృతనిశ్చయంతో ఉన్నామని ప్రధాని మోదీకి తెలిపారు. మందులు, వెంటిలేటర్లు, వైద్య పరికరాలు, కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ తయారీకి కావాల్సిన ముడిపదార్థాలు సాధ్యమైనంత తొందరగా అందజేస్తామని హామీ ఇచ్చారు. భారత ప్రధాని నరేంద్ర మోదీతో సోమవారం రాత్రి బైడెన్‌ ఫోన్లో మాట్లాడారు.

భారత్‌లో కోవిడ్‌ సంక్షోభ పరిస్థితులపై ఇరువురు నేతలు చర్చించారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు వ్యాక్సిన్లు, మందులు చౌకధరలకు అందుబాటులో ఉండేలా ‘వ్యాపార సంబంధిత ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ రైట్స్‌ (ట్రిప్స్‌)లో మినహాయింపులు ఉండాలని ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్లు్యటీవో)లో భారత్‌ చొరవ తీసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా మోదీ... బైడెన్‌ దృష్టికి తెచ్చారని కేంద్రం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ‘అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ఈ రోజు ఫలవంతమైన సంభాషణ జరిపాను.

ఇరుదేశాల్లో కోవిడ్‌ పరిస్థితులపై విపులంగా చర్చించాం. భారత్‌కు అమెరికా అందిస్తున్న సహాయానికి ప్రెసిడెంట్‌ బైడెన్‌కు కృతజ్ఞతలు తెలిపాను. వ్యాక్సిన్‌ ముడిసరుకుల సరఫరా.. సాఫీగా, సమర్థవంతగా జరగాల్సిన అవసరాన్ని బైడెన్‌తో చర్చల్లో ప్రస్తావించడం జరిగింది. ఆరోగ్యరంగంలో భారత్‌– అమెరికా భాగస్వామ్యం ప్రపంచానికి కోవిడ్‌–19 విసురుతున్న సవాళ్లకు పరిష్కారం చూపగలదు’ అని మోదీ సోమవారం రాత్రి ట్వీట్‌ చేశారు. భారత్‌కు సాయం చేయడానికి ముం దుకు రావడంపై బైడెన్‌కు మోదీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

వ్యాక్సిన్‌ మైత్రి, కోవాక్స్‌లో పాల్గొనడం, క్వాడ్‌ వ్యాక్సిన్‌ సాయంలో పాలుపంచుకోవడం (విదేశాలకు కరోనా టీకాలకు అందించడం) ద్వారా ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌ వ్యాప్తిని అరికట్టడానికి భారత్‌ తమ వంతు ప్రయత్నం చేసిందని మోదీ గుర్తుచేశారు. వ్యాక్సిన్‌ ఉత్పత్తి, సరఫరాలో పరస్పర సమన్వయం, సహకారంతో పనిచేయాలని తమ తమ దేశాల అధికారులను బైడెన్, మోదీలు ఆదేశించారు. ఇకపై తరచూ సంప్రదింపులు జరపాలని ఇరువురూ నిర్ణయించారు.  

కోవిడ్‌తో అల్లాడుతున్న భారత్‌కు అండగా ఉంటామని భరోసానిస్తూ అందుకు సూచికగా యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌.. అక్కడి భవనాలపై మువ్వన్నెల రంగుల్లో విద్యుత్‌ దీపాలను వెలిగించిన దృశ్యం

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top