భారత్‌ మాకు బలమైన భాగస్వామి

US Defense Secretary Lloyd Austin And Rajnath Singh Discuss Bilateral Ties - Sakshi

అమెరికా రక్షణ మంత్రి లాయిడ్‌ అస్టిన్‌

భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌తో చర్చ

న్యూఢిల్లీ: ఇరు దేశాల మధ్య రక్షణ సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని భారత్, అమెరికా తీర్మానించుకున్నాయి. ఆధునిక అవసరాలకు తగ్గట్టుగా రక్షణ సంబంధాలను విస్తృతం చేసుకోవాల్సిన అవసరం ఉందని, పరస్పర సహకారంతోనే ఇది సాధ్యమని నిర్ణయానికొచ్చాయి. ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలో భారత్‌ తమకు బలమైన భాగస్వామి అని అమెరికా ఉద్ఘాటించింది. భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, అమెరికా రక్షణ మంత్రి లాయిడ్‌ అస్టిన్‌ శనివారం పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు.

ఇండో–యూఎస్‌ రక్షణ భాగస్వామ్యానికి జో బైడెన్‌ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని లాయిడ్‌ అస్టిన్‌ ఈ సందర్భంగా గుర్తుచేశారు. అంతర్జాతీయంగా పరిణామాలు వేగంగా మారిపోతున్న నేపథ్యంలో భారత్‌ తమకు ముఖ్యమైన భాగస్వామిగా మారుతోందని తెలిపారు. ఇండో–పసిఫిక్‌ రీజియన్‌లో అమెరికాకు ఇండియా ఒక మూలస్తంభం అని వ్యాఖ్యానించారు. ఇండియాతో సమగ్రమైన రక్షణ భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నామని వివరించారు. తద్వారా జో బైడెన్‌ ప్రభుత్వ విదేశాంగ విధానంలోని ప్రాధాన్యతలపై  అస్టిన్‌ స్పష్టమైన సంకేతాలిచ్చారు.

చైనా ఆగడాలపై చర్చ
అమెరికా రక్షణ శాఖ మంత్రి లాయిడ్‌ అస్టిన్‌తో చర్చలు సమగ్రంగా, ఫలవంతంగా జరిగాయని రాజ్‌నాథ్‌ సింగ్‌ వెల్లడించారు. భారత సైన్యం, అమెరికాకు చెందిన ఇండో–పసిఫిక్‌ కమాండ్, సెంట్రల్‌ కమాండ్, ఆఫ్రికా కమాండ్‌ మధ్య సహకారం పెంచుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఇండియా–అమెరికా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కలిసి పని చేసేందుకు ఇరు దేశాలు ఆసక్తిగా ఉన్నాయన్నారు. తూర్పు లద్దాఖ్‌లో చైనా సాగిస్తున్న ఆగడాలు కూడా తమ మధ్య చర్చకు వచ్చాయన్నారు. రక్షణ సహకారంపై ఇండియా–అమెరికా మధ్య గతంలో కొన్ని ఒప్పందాలు కుదిరాయని, వాటిని పూర్తిస్థాయిలో అమల్లోకి తీసుకురావడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపైనా చర్చించామని పేర్కొన్నారు.

భారత్‌–అమెరికా భాగస్వామ్యం 21వ శతాబ్దంలో నిర్ణయాత్మక భాగస్వామ్యాల్లో ఒకటిగా నిలిచిపోవాలని రాజ్‌నాథ్‌సింగ్‌ ఆకాంక్షించారు. త్రివిధ దళాల అవసరాల కోసం అమెరికా నుంచి 3 బిలియన్‌ డాలర్ల విలువైన 30 మల్టీ–మిషన్‌ ఆర్మ్‌డ్‌ ప్రిడేటర్‌ డ్రోన్లు కొనుగోలు చేయాలని భారత్‌ నిర్ణయించినట్లు తెలిసింది. దీనిపై రాజ్‌నాథ్‌ సింగ్, లాయిడ్‌ అస్టిన్‌ చర్చించినట్లు సమాచారం. మీడియం–ఆల్టిట్యూడ్‌ లాండ్‌ ఎండ్యురెన్స్‌ (ఎంఏఎల్‌ఈ) ప్రిడేటర్‌–బి డ్రోన్లుగా పిలిచే ఈ డ్రోన్లు ఏకంగా 35 గంటలపాటు గాలిలో సంచరించగలవు. భూమిపై, సముద్రంపై ఉన్న లక్ష్యాలను వేటాడే సామర్థ్యం వీటి సొంతం. రాజ్‌నాథ్‌తో చర్చల అనంతరం లాయిడ్‌ అస్టిన్‌ ఒక ప్రకటన విడుదల చేశారు.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top