పాశ్వాన్‌ కన్నుమూత

Union Minister Ram Vilas Paswan passes away - Sakshi

అనారోగ్యంతో ఢిల్లీలోని ఆసుపత్రిలో మృతి

దళిత నేతగా, దళితుల గొంతుకగా పేరు

రాష్ట్రపతి, ప్రధాని ప్రగాఢ సంతాపం

న్యూఢిల్లీ:  కేంద్రమంత్రి, లోక్‌జనశక్తి పార్టీ వ్యవస్థాపకుడు, ప్రముఖ దళిత నేత రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌(74) గురువారం కన్నుమూశారు. గత కొన్ని వారాలుగా పాశ్వాన్‌ ఢిల్లీలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవలే ఆయనకు గుండె శస్త్ర చికిత్స జరిగింది. పాశ్వాన్‌ మరణవార్తను ఆయన కుమారుడు చిరాగ్‌ పాశ్వాన్‌ ట్వీట్‌ చేశారు. ‘నాన్నా.. ఈ ప్రపంచంలో మీరు లేరు. కానీ మీరెప్పుడూ నాతోనే ఉంటారని నాకు తెలుసు. మిస్‌ యూ నాన్నా’ అని చిరాగ్‌ భావోద్వేగ ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న పాశ్వాన్‌.. కేంద్ర మంత్రివర్గంలో వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖల బాధ్యతలు చూస్తున్నారు. పాశ్వాన్‌ మృతిపై రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

‘యవ్వనంలో పాశ్వాన్‌ ఒక ఫైర్‌బ్రాండ్‌ సోషలిస్ట్‌. ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటంలో జయప్రకాశ్‌ నారాయణ్‌ వంటి నేతల సాంగత్యంలో నాయకుడిగా ఎదిగారు’ అని కోవింద్‌ ట్వీట్‌చేశారు. పాశ్వాన్‌ మరణం తనను మాటలకందని బాధకు గురి చేసిందని ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు.  ‘కృషి, పట్టుదలతో పాశ్వాన్‌ రాజకీయాల్లో ఎదిగారు. యువకుడిగా ఎమర్జెన్సీ దురాగతాలను ఎదుర్కొన్నారు. ఆయన అద్భుతమైన మంత్రి, పార్లమెంటేరియన్‌. చాలా విధాన విషయాల్లో తనదైన ముద్ర వేశారు. ఆయనతో కలిసి పనిచేయడం గొప్ప అనుభవం. కేబినెట్‌ సమావేశాల్లో ఆయన లోతైన సూచనలు ఇచ్చేవారు. రాజకీయ జ్ఞానం, దార్శనికత, పాలనాదక్షతల్లో ఆయనకు సాటిలేరు’ అని మోదీ పేర్కొన్నారు. కేంద్రమంత్రి పాశ్వాన్‌ మృతికి సంతాప సూచకంగా నేడు దేశ రాజధాని ఢిల్లీలో, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల రాజధానుల్లో జాతీయ పతాకాన్ని సగం వరకు అవనతం చేయనున్నారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహిస్తారు.   

ఏపీ గవర్నర్, సీఎం జగన్‌ సంతాపం
సాక్షి, అమరావతి: పాశ్వాస్‌ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. పాశ్వాన్‌ తన ఐదు దశాబ్దాల రాజకీయ జీవితంలో అణగారిన వర్గాల వాణిని ఎలుగెత్తి చాటారని వైఎస్‌ జగన్‌ నివాళులర్పించారు. పాశ్వాన్‌ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పాశ్వాన్‌ మృతి పట్ల వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వేణుంబాక విజయసాయిరెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

తెలంగాణ గవర్నర్, సీఎం కేసీఆర్‌ సంతాపం
సాక్షి, హైదరాబాద్‌: పాశ్వాన్‌ మృతిపట్ల తెలంగాణ గవర్నర్‌ తమిళిసై, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ అండగా నిలిచారని కేసీఆర్‌ గుర్తు చేశారు.

1969లోనే ఎమ్మెల్యే
1946 జులై 5న బిహార్‌లోని ఖగారియాలో పాశ్వాన్‌ జన్మించారు. పీజీ, న్యాయవిద్య అభ్యసించారు.  విద్యాభ్యాసం అనంతరం డీఎస్పీగా పోలీసు ఉద్యోగం వచ్చినా రాజకీయాలపై ఆసక్తితో ఆ ఉద్యోగంలో చేరలేదు. 1969లో సంయుక్త సోషలిస్ట్‌ పార్టీ టికెట్‌పై తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. బిహార్‌లోని హాజీపూర్‌ లోక్‌సభ స్థానం నుంచి రికార్డు స్థాయిలో 8 సార్లు గెల్చారు. లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ రికార్డు చాలా రోజుల పాటు ఆయన పేరు పైనే ఉన్నది. పాశ్వాన్‌ 1975 నాటి ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటంలో జైలుకెళ్లారు. 2000 సంవత్సరంలో ఆయన మరికొందరు నాయకులతో కలిసి లోక్‌జనశక్తి పార్టీ(ఎల్జేపీ)ని స్థాపించారు. పేదలు, అణగారిన వర్గాల సమస్యలపై అవకాశం లభించిన ప్రతీసారి గళమెత్తే నేతగా పాశ్వాన్‌ పేరు గాంచారు. మండల్‌ కమిషన్‌ నివేదిక అమలుకు ఆయన గట్టిగా ప్రయత్నించారు. పార్టీలకు అతీతంగా అందరు నాయకులతో ఆయన సత్సంబంధాలు కలిగి ఉండేవారు. సైద్ధాంతిక వైరుధ్యాలున్న పార్టీల నేతృత్వంలో సాగిన కేంద్ర ప్రభుత్వాల్లో ఆయన భాగస్వామిగా, మంత్రిగా విజయవంతంగా కొనసాగడం విశేషం.

కాంగ్రెస్‌ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వంలోనూ, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారులోనూ కీలకంగా వ్యవహరించడం ఆయనకే చెల్లింది. దాదాపు ఐదు దశాబ్దాలకు పైబడిన రాజకీయ జీవితంలో దళితులు, అణగారిన వర్గాల కోసం పోరాడే నేతగా ఆయన దేశవ్యాప్తంగా పేరుగాంచారు. ఉత్తర భారత దేశంలో దళితులను ఏకం చేయడంలో పాశ్వాన్‌ కీలక పాత్ర పోషించారని ఆయన దీర్ఘకాల సహచరుడు, జేడీయూ నేత కేసీ త్యాగి గుర్తు చేసుకున్నారు. 1989లో వీపీ సింగ్‌ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన పాశ్వాన్‌.. మండల్‌ కమిషన్‌ సిఫారసుల అమలుకు కృషి చేశారన్నారు. బీజేపీతో విబేధాల కారణంగా వాజ్‌పేయి ప్రభుత్వం నుంచి బయటకు వచ్చిన సమయంలో నాటి గుజరాత్‌ సీఎం నరేంద్ర మోదీని తీవ్రంగా విమర్శించిన పాశ్వాన్‌.. అదే మోదీ నాయకత్వంలోని ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగారు. సిద్ధాంతాలకు అతీతంగా అధికారంలో ఉన్న పార్టీలకు దగ్గరయ్యే ఆయన తీరును ప్రత్యర్థులు ‘వాతావరణ నిపుణుడు’ అంటూ విమర్శిస్తారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top