చైనా పరిస్థితి ఒక హెచ్చరిక.. కరోనాపై లోక్‌సభలో ఆరోగ్య మంత్రి కీలక ప్రకటన

Union Health Minister Mansukh Mandaviya on COVID Situation - Sakshi

ఢిల్లీ:  కరోనా పరిస్థితిపై లోక్‌ సభలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మాన్షుక్‌ మాండవియా కీలక ప్రకటన చేశారు. పొరుగు దేశం చైనాలో శరవేగంగా వ్యాప్తి చెందుతున్న వేరియెంట్‌, మరణాలపైనా ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని గురువారం ఆయన లోక్‌సభలో ప్రసంగించారు. 

పొరుగు దేశం చైనాలో కేసుల పెరుగుదల.. ప్రపంచానికి ఒక హెచ్చరికలాంటిది. అక్కడి కేసుల పెరుగుదల, మరణాలను చూస్తున్నాం. పరిస్థితి ముందు ముందు మరింత ఘోరంగా అక్కడ మారే అవకాశాలు ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అందుకే మన దగ్గర రద్దీ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ మాస్క్ కచ్చితంగా మాస్క్ వాడేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను ఆయన కోరారు. ముఖ్యంగా కొత్త కరోనా వేరియంట్లపై అప్రమత్తంగా ఉండాలన్నారు. అన్ని రాష్ట్రాలు జీనోమ్ సీక్వెన్సింగ్ చేయాలని, కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదని ఆయన పేర్కొన్నారు.

గత కొన్నిరోజులుగా ప్రపంచంలో చాలా దేశాల్లో కేసులు పెరిగిపోతున్నాయి. కానీ, భారత్‌లో మాత్రం ఆ ప్రభావం కనిపించడం లేదు. కాబట్టి, ఈ సమయంలోనే తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా చైనాలో కరోనా కేసులు, మరణాలు పెరగుతుండడం చూస్తున్నట్లు తెలిపారు. 

మహమ్మరి పరిస్థితిని అదుపు చేసేందుకు ఆరోగ్య శాఖ అన్ని రకాలుగా సన్నద్ధంగా ఉందని, గతంలో రాష్ట్రాలకు ఆర్థికంగానూ సహకరించిందని ఆయన గుర్తు చేశారు. దేశంలో 220 కోట్ల వ్యాక్సిన్‌ షాట్స్‌ అందించినట్లు ఆయన ప్రకటించారు. పండుగలు, న్యూఇయర్‌ వేడుకల నేపథ్యంలో.. కొవిడ్‌ జాగ్రత్తలు పాటించేలా చూడాలని, ప్రికాషనరీ డోసులు విషయంలో తగిన సూచనలు పాటించాలని కోరారు.

దేశంలోని అంతర్జాతీయ విమానాశ్రయాలకు వచ్చే ప్రయాణీకులలో  RT-PCR టెస్టులు ప్రారంభించినట్లు, తగిన చర్యలు తీసుకుంటున్నట్లు మాన్షుక్‌ మాండవియా స్పష్టం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా వైరస్‌కు సంబంధించిన పరిణామాలను భారత్‌ గమనిస్తూనే ఉంటుందని ఆయన తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top