బాంబు పేలుడు ఘటనలో గాయపడ్డ యువతిని పరామర్శిస్తున్న మోదీ
ఢిల్లీ పేలుడు ఘటనను తీవ్రంగా ఖండించిన కేంద్ర మంత్రివర్గం
పౌరుల మృతిపై విచారం వ్యక్తం చేస్తూ తీర్మానం ఆమోదం
ప్రధాని మోదీ నేతృత్వంలో సమావేశమైన కేబినెట్
విచారణ వేగవంతం చేయాలని దర్యాప్తు సంస్థలకు ఆదేశం
పరిస్థితిని ఉన్నత స్థాయిలో సమీక్షిస్తున్నట్లు వెల్లడి
ఉగ్రవాదాన్ని సహించే ప్రసక్తే లేదని స్పష్టీకరణ
దేశ ప్రజల రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు ఉద్ఘాటన
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఎర్రకోట వద్ద 12 మందిని బలి తీసుకున్న కారు పేలుడు ఘటన ముమ్మాటికీ ఉగ్రవాద దాడేనని కేంద్ర మంత్రివర్గం తేల్చిచెప్పింది. ఈ పేలుడుపై విచారణ వేగవంతం చేయాలని దర్యాప్తు సంస్థలను ఆదేశించింది. దుశ్చర్యకు కారకులైన దుండగులను, వారి భాగస్వాములను, వారి వెనుక ఉన్న అసలైన కుట్రదారులను సాధ్యమైనంత త్వరగా చట్టం ముందుకు తీసుకురావాలని నిర్దేశించింది. ఉగ్రవాద పోషకులను వదిలిపెట్టబోమని తేల్చిచెప్పింది.
విచారణలో ఎలాంటి జాప్యం చేయొద్దని దర్యాప్తు సంస్థలకు సూచించింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో బుధవారం కేంద్ర కేబినెట్ సమావేశమైంది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఢిల్లీ దాడిలో మరణించివారి ఆత్మశాంతి కోసం ప్రధాని, మంత్రులు రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. దాడిలో సామాన్యులు మరణించడం పట్ల తీవ్ర విచారం వ్యక్తంచేస్తూ మంత్రివర్గ సమావేశంలో ఒక తీర్మానం ఆమోదించారు.
మొత్తం పరిస్థితిని ఉన్నత స్థాయిలో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు కేబినెట్ వెల్లడించింది. ఉగ్రవాదాన్ని సహించే ప్రసక్తే లేదని మంత్రివర్గం తమ తీర్మానంలో స్పష్టంచేసింది. ఉగ్రవాదం ఎక్కడ, ఏ రూపంలో ఉన్నాసరే అంతం చేయాల్సిందేనని పేర్కొంది. దర్యాప్తు జరుగుతున్న తీరు, కుట్రదారులను గుర్తించడానికి చేపట్టిన చర్యలను కేంద్ర హోం మంత్రి అమిత్ షా మంత్రివర్గ సహచరులకు తెలియజేశారు.
‘భద్రతపై కేబినెట్ కమిటీ’ సమావేశం
ఢిల్లీ పేలుడు ఘటనను మతిలేని ఉగ్రవాద చర్యగా కేబినెట్ అభివర్ణించింది. ఈ పిరికిపంద చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు స్పష్టంచేసింది. బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటించింది. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. బాధితులకు తగిన సాయం, చికిత్స అందించడంలో వైద్య సిబ్బంది, అత్యవసర సేవల సిబ్బంది, ప్రభుత్వ అధికారులు, దర్యాప్తు సంస్థల సిబ్బంది, సాధారణ పౌరులు చురుగ్గా వ్యవహరించారని ప్రశంసించింది.
వారి అంకితభావం, విధి నిర్వహణలో చిత్తశుద్ధి శ్లాఘనీయమని ఉద్ఘాటించింది. బాధితులకు అండగా ఉంటామని ప్రకటించింది. దేశ పౌరుల రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు మంత్రివర్గం తేల్చిచెప్పింది. జాతీయ భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొంది. మరోవైపు మోదీ నేతృత్వంలో ‘భద్రతపై కేబినెట్ కమిటీ’ సమావేశం జరిగింది. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోంమంత్రి శాఖ మంత్రి అమిత్ షా తదితరులు హాజరయ్యారు. ఢిల్లీ పేలుడు ఘటనతోపాటు తాజా పరిస్థితిపై ఉన్నతాధికారులతో కలిసి సమీక్షించారు.
రూ.25,060 కోట్లతో ఎగమతి ప్రోత్సాహక మిషన్
ఎగమతి ప్రోత్సాహక మిషన్(ఈపీఎం)కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. ఆరు ఆర్థిక సంవత్సరాల్లో రూ.25,060 కోట్లతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ప్రారంభిస్తారు. భారత ఉత్పత్తులపై అమెరికా ప్రభుత్వం భారీగా సుంకాలు విధించిన నేపథ్యంలో దేశీయ ఎగుమతిదారులను ఆదుకోవడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని ప్రభుత్వం చెబుతోంది. ఇందులో రెండు ఉప పథకాలు ఉన్నాయి. అవి నిర్యాత్ పోత్రాహన్(రూ.10,410 కోట్లు), నిర్యాత్ దిశ(రూ.14,659 కోట్లు).
⇒ అరుదైన ఖనిజాలైన గ్రాఫైట్, సేసియం, రుబీడియం జిర్కోనియంపై రాయల్టీ రేట్ల హేతుబదీ్ధకరణ ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించింది. దేశీయంగా ఉత్పత్తిని పెంచడం, దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించుకోవమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో మన దేశంలో ఇంధన భద్రత మరింత బలోపేతం అవుతుందని చెబుతున్నారు. ఆయా ఖనిజాలపై రాయలీ్టని తగ్గించబోతున్నట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.
⇒ మన దేశం నుంచి విదేశాలకు ఎగుమతులను మరింతగా ప్రోత్సహించడానికి వీలుగా క్రెడిట్ గ్యారంటీ పథకాన్ని ప్రవేశపెట్టడానికి మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. ఈ పథకంలో భాగంగా ఎగుమతిదారులకు 100 శాతం క్రెడిట్ గ్యారంటీ కవరేజీని వర్తింపజేస్తారు. అర్హులైన ఎగుమతిదారులకు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు(ఎంఎస్‌ఎంఈ) అదనంగా రూ.20,000 కోట్ల మేర రుణ సౌకర్యం కల్పించబోతున్నారు.


