Union Budget 2022: ఏపీ రాజధానిపై నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి

Union Budget 2022: Parliament Session 3rd Day Live Updates - Sakshi

ఆంధ్రప్రదేశ్‌ రాజధానిపై నిర్ణయ అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్‌ రాజ్యసభలో ప్రకటించారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఏపీ విభజన చట్టం అమలుపై రాజ్యసభలో కీలక ప్రశ్నలను సభ్యులు లేవనెత్తారు. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు రాజధాని అంశాన్ని ప్రస్తావించారు. దీనిపై స్పందించిన కేంద్ర హోంశాఖ.. రాజధాని నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉందని మరోసారి పార్లమెంట్‌ సాక్షిగా స్పష్టం చేసింది. 

మూడో రోజు పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా రాజ్యసభ జీరో అవర్‌లో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అంశాన్ని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రస్తావించారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందువులకు అత్యంత పవిత్రస్థలమని, టీటీడీ అనేక ధార్మిక, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యాకలాపాల నిర్వహణకు భారీస్థాయిలో నిధులు అవసరం అవుతాయని తెలిపారు. విదేశాల నుంచి ప్రవాస భారతీయులు విరాళాలుగా పంపిస్తుంటారని గుర్తుచేశారు. 

కేంద్ర హోంశాఖ సాంకేతిక కారణాలతో ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్సును తాత్కాలికంగా నిలిపివేసిందని, తగిన పత్రాలన్నీ సమర్పించినప్పటికీ లైసెన్స్ పునరుద్ధరించలేదని కేంద్రం దృష్టికి ఎంపీ విజయసాయిరెడ్డి తీసుకువెళ్లారు. డిసెంబర్ 31 నాటికి రూ.13.04 కోట్ల నిధులు ఎఫ్‌సీఆర్‌ఏ అనుసంధాన బ్యాంకు ఖాతాలో ఉన్నాయని తెలిపారు. యాక్ట్ ఈస్ట్ పాలసీ తరహాలో లుక్ సౌత్ పాలసీని అమలు చేయాలని ఈ సందర్భంగా కోరారు. బీజేపీని హిందూ జాతీయవాదానికి టార్చ్ బేరర్‌గా చెప్పుకుంటారని, తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో ఎందుకు ఉదాసీనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు.

సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా మూడో రోజు ఉభయ సభలు కొలువుదీరాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రసంగానికి లోక్‌సభ, రాజ్యసభలో సభ్యులు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం కేంద్ర బడ్జెట్‌-2022ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.

ఈసారి బడ్జెట్‌ మూలధన వ్యయాన్ని 35. 4 శాతం మేర పెంచారు. వృద్ధి ప్రణాళికలకు మద్దతుగా ఆర్థిక వ్యవస్థ వార్షిక వ్యయం పరిమాణాన్ని రూ.39.5 ట్రిలియన్‌కు (529 బిలియన్‌ డాలర్లు) పెంచాలని సీతారామన్ ప్రతిపాదించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top