రైతు ఉద్యమంలో చీలికలు

Two farmer unions withdraw from protest after January 26 violence - Sakshi

ఆందోళనల నుంచి తప్పుకున్న రెండు సంఘాలు

ఢిల్లీ అల్లర్లపై కీలక రైతు నేతలపై కేసు నమోదు

200 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

ఢిల్లీ విధ్వంసానికి ఉద్యమంలో చొరబడ్డ విద్రోహశక్తులే కారణమన్న రైతు నేతలు

జనవరి 30న దేశవ్యాప్తంగా సభలు, నిరశన దీక్షలు

సాక్షి, న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ సుమారు గత 2 నెలలుగా ఆందోళన చేస్తున్న రైతు ఉద్యమంలో చీలికలు ప్రారంభమయ్యాయి. రైతు ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్లు రెండు రైతు సంఘాలు ప్రకటించాయి. ఢిల్లీలో మంగళవారం జరిగిన ఘటనలకు నిరసనగా రైతు ఆందోళనల నుంచి విరమించుకుంటున్నట్లు భారతీయ కిసాన్‌ యూనియన్‌(భాను), రాష్ట్రీయ కిసాన్‌ ఆందోళన్‌ సంఘటన్‌ బుధవారం ప్రకటించాయి. మరోవైపు, బడ్జెట్‌ను ప్రకటించే ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంటుకు తలపెట్టిన పాదయాత్రను రద్దు చేస్తున్నట్లు 41 రైతు సంఘాల వేదిక ‘సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్‌కేఎం)’ప్రకటించింది.

గణతంత్ర దినోత్సవం రోజు రైతులు ఢిల్లీలో నిర్వహించిన ట్రాక్టర్‌ పరేడ్‌ సందర్భంగా చెలరేగిన అల్లర్లకు సంబంధించి సుమారు 200 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మేధాపాట్కర్, యోగేంద్ర యాదవ్‌లతో పాటు మొత్తం 37 మంది రైతు నేతల పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. మంగళవారంనాటి ఢిల్లీ నిరసనల్లో 394 మంది పోలీసులు గాయపడ్డారు. రైతు నేతలపై సమయపూర్‌ బద్లి పోలీసు స్టేషన్లో ఐపీసీ 147(అల్లర్లు, విధ్వంసం), 148(అల్లర్లు, విధ్వంసం), 307(హత్యాయత్నం), 120బీ(నేరపూరిత కుట్ర) సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మంగళవారం హింసాత్మక ఘటనలు జరిగిన ఎర్రకోటను కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్‌ పటేల్‌ సందర్శించారు.  

విద్రోహ శక్తుల కుట్ర
రైతు ఉద్యమంలో లేని కొందరు సంఘ విద్రోహ శక్తులే ఢిల్లీలో మంగళవారం జరిగిన అల్లర్లకు, ఎర్రకోట ఘటనకు కారణమని రైతు నేతలు ఆరోపించారు. నటుడు దీప్‌ సిద్ధు వంటి విద్రోహ శక్తులు శాంతియుతంగా సాగుతున్న ఉద్యమాన్ని నాశనం చేసే ఉద్దేశంతో ఈ కుట్ర చేశాయన్నారు. ప్రభుత్వం, ఇతర రైతు ఉద్యమ వ్యతిరేక శక్తులు చేస్తున్న ఈ ప్రయత్నాలను సాగనివ్వబోమని సంయుక్త కిసాన్‌ మోర్చా స్పష్టం చేసింది. ‘శాంతియుతంగా సాగుతున్న మా ఉద్యమాన్ని ప్రభుత్వం తట్టుకోలేకపోయింది. అందుకే కిసాన్‌ మజ్దూర్‌ సంఘర్ష్‌ కమిటీ, ఇతర విద్రోహ శక్తులతో కలిసి ఈ కుట్రకు తెరతీసింది. మా ఉద్యమం ప్రారంభమైన 15 రోజులకు ఈ సంస్థలు వేరేగా నిరసన వేదికను ఏర్పాటు చేసుకున్నాయి. మా ఐక్య ఉద్యమంతో వారికి సంబంధం లేదు’అని సంయుక్త కిసాన్‌ మోర్చా బుధవారం ఒక ప్రకటనలో వివరించింది.

జనవరి 30న దేశవ్యాప్తంగా నిరాహార దీక్షలు, బహిరంగ సభలు నిర్వహిస్తామని వెల్లడించింది. ‘దీప్‌ సిద్ధూ ఆరెస్సెస్‌ మనిషి. ఎర్రకోటలో మత జెండాను ఎగరేసిన తరువాత అక్కడినుంచి వెళ్లిపోయేందుకు ఆయనను పోలీసులు అనుమతించారు’అని రైతు నేత దర్శన్‌ పాల్‌ ఆరోపించారు. ‘ 99.9% రైతులు అనుమతించిన మార్గంలోనే శాంతియుతంగా పరేడ్‌లో పాల్గొన్నారు’అని రైతు నేత బల్బీర్‌ సింగ్‌ రాజేవాల్‌ తెలిపారు. ఢిల్లీలో జరిగిన ఘటనలపై తీవ్రంగా ఆవేదన చెందుతున్నామని, అందువల్ల రైతు ఉద్యమం నుంచి వైదొలగుతున్నామని చిల్లా బోర్డర్‌ వద్ద నిరసన తెలుపుతున్న భారతీయ కిసాన్‌ యూనియన్‌(భాను) అధ్యక్షుడు భాను ప్రతాప్‌ సింగ్‌ ప్రకటించారు. ఇకపై రైతు ఉద్యమంలో తాము భాగం కాదని ఘాజీపూర్‌ సరిహద్దులో రైతు ఉద్యమంలో పాల్గొన్న రాష్ట్రీయ కిసాన్‌ ఆందోళన్‌ సంఘటన్‌ నేత వీఎం సింగ్‌ స్పష్టం చేశారు.  

► ట్రాక్టర్‌ పరేడ్‌లో హింస చెలరేగిన నేపథ్యంలో దేశ రాజధానిలో శాంతి, భద్రతల పరిస్థితిని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా బుధవారం సమీక్షించారు. హోం శాఖ కార్యదర్శి అజయ్‌భల్లా, ఢిల్లీ పోలీస్‌ విభాగం ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

► రైతుల ట్రాక్టర్‌ పరేడ్‌ సందర్భంగా ఢిల్లీలో చెలరేగిన అల్లర్లపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో, మరో ఇద్దరు రిటైర్డ్‌ హైకోర్టు న్యాయమూర్తులు సభ్యులుగా త్రి సభ్య విచారణ కమిషన్‌ను వేయాలని కోరుతూ బుధవారం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. రాజధానిలో జరిగిన హింసకు, జాతీయ పతాకానికి జరిగిన అవమానానికి కారణమైన వ్యక్తులు, సంస్థలపై కేసు నమోదు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించాలని కూడా న్యాయవాది విశాల్‌ తివారీ ఆ పిటిషన్‌లో కోరారు.

► ఇండియన్‌ నేషనల్‌ లోక్‌దళ్‌ నేత అభయ్‌సింగ్‌ చౌతాలా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. హరియాణా అసెంబ్లీలో ఐఎన్‌ఎల్‌డీకి ఉన్న ఏకైక సభ్యుడు చౌతాలానే. కేంద్రం తీసుకువచ్చిన వివాదాస్పద సాగు చట్టాలను సమర్ధిస్తూ హరియాణా అసెంబ్లీలో అధికార బీజేపీ తీర్మానం చేయడాన్ని నిరసిస్తూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. అనుచరులతో కలిసి అసెంబ్లీకి ట్రాక్టర్‌పై వెళ్లి ఆయన రాజీనామా సమర్పించారు.

► ఢిల్లీ ఆందోళనల నేపథ్యంలో రైతు సంఘాల నేతలతో చర్చలు ముగిశాయని ఎన్నడూ ప్రభుత్వం చెప్పలేదని కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ తెలిపారు. తదుపరి విడత చర్చలపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని, ఆ నిర్ణయం తీసుకోగానే తెలియజేస్తామని బుధవారం మీడియాకు వెల్లడించారు.  

చిల్లా సరహద్దులో టెంట్‌లను తొలగిస్తున్న రైతులు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top