దినకరన్‌ యూటర్న్‌.. చిన్నమ్మ నిర్ణయం ఏమిటో?

TTV Dhinakaran You Turn On VK Sasikala Petition In Tamilnadu - Sakshi

సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, ఉపకార్యదర్శి పదవీ వ్యవహారంలో అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం నేత దినకరన్‌ యూటర్న్‌ తీసుకున్నారు. తాను దాఖలు చేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటున్నట్టు, ఈ కేసు నుంచి వైదొలుగుతున్నట్టు కోర్టుకు దినకరన్‌ సూచించారు. దీంతో ఈ వ్యవహారంలో శశికళ నిర్ణయం ఎమిటో అన్న ప్రశ్న బయలుదేరింది. జయలలిత మరణంతో 2017లో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎంపికైన విషయం తెలిసిందే.

ఆమె ప్రతినిధిగా అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి పదవిని దినకరన్‌ చేపట్టారు. చిన్నమ్మ జైలుకు వెళ్లడం తర్వాత పరిణామాలతో అన్నాడీఎంకే నుంచి ఇద్దరు గెంటి వేయబడ్డారు. పన్నీరు, పళనిల ఏకంతో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవి రద్దయింది. అన్నాడీఎంకేలో కొత్తగా సమన్వయ కమిటీ ఏర్పాటైంది. దీనిని వ్యతిరేకిస్తూ శశికళ, దినకరన్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.  

వెనక్కి తగ్గిన దినకరన్‌.. 
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి తానేనని చిన్నమ్మ, ఉప ప్రధాన కార్యదర్శి తానేనంటూ దినకరన్‌ దాఖలు చేసుకున్న పిటిషన్‌ విచారణ మూడేళ్లుగా మద్రాసు హైకోర్టులో సాగింది. తర్వాత ప్రత్యేక కోర్టుకు మార్చారు. అదే సమయంలో ఈ పిటిషన్‌ను తిరస్కరించాలని అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్‌ పన్నీరుసెల్వం, కో– కన్వీనర్‌ పళనిస్వామి, ప్రిసీడియం చైర్మన్‌ మధుసూదనన్‌ రిట్‌ దాఖలు చేశారు. సోమవారం పిటిషన్లన్నీ ప్రత్యేక కోర్టు ముందు విచారణకు రాగా, దినకరన్‌ తరఫున న్యాయవాదులు హాజరై యూటర్న్‌ వాదనలు వినిపించారు. దినకరన్‌ తరఫున కోర్టుకు లేఖ సమర్పించారు.

అందులో తాను  అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం ఏర్పాటు చేసినట్టు, ఈ పార్టీకి తానే ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నట్టు వివరించారు. ఈ దృష్ట్యా, అన్నాడీఎంకే వ్యవహారాలపై తాను దాఖలు చేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటున్నట్టు, ఈ కేసు నుంచి వైదొలుగుతున్నట్టు దినకరన్‌ స్పష్టం చేశారు. దీంతో ఈ కేసులో మరో పిటిషనర్‌ కూడా ఉన్నారని, వారి మాటేంటో అని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఈ కేసులో మరో పిటిషనర్‌గా ఉన్న శశికళ తన నిర్ణయం ఏమిటో ఏప్రిల్‌ 9వ తేదీలోపు కోర్టుకు తెలియజేయాలని పేర్కొంటూ, అదే రోజుకు పిటిషన్‌ విచారణను న్యాయమూర్తి వాయిదా వేశారు.

చదవండి: రాసలీలల కేసు: ఆమె కోసం హైదరాబాద్‌కు.. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top