
ఇంట్లో వైఫై సిగ్నల్స్ సరిగ్గా లేవా? ఒకరిద్దరు మాత్రమే వాడుతున్నా ఇంటర్నెట్ స్లో అవుతోందా? అయితే మీ వైఫై రూటర్ ఎక్కడ పెట్టారో ఒకసారి చూసుకోండి. సరైన ప్రాంతంలో లేకపోతేనే ఈ సమస్యలన్నీ వస్తాయి మీకు! మరి.. ఇంట్లో వైఫై రూటర్ ఉంచేందుకు బెస్ట్ ప్లేస్ ఏంటి?
ఇంటర్నెట్ వాడకం బాగా పెరుగుతున్న ఈ కాలంలో చాలా ఇళ్లల్లోకి వైఫై రూటర్లు వచ్చేశాయి. అయితే ఎక్కువమంది వీటిని ఎవరికీ కనిపించని చోట ఉంచేస్తూంటారు. కొందరు పుస్తకాల అలమారాలో లేదంటే టేబుళ్ల కింద కుక్కేస్తూంటారు. దీనివల్ల వాటి నుంచి వెలువడే రేడియో సిగ్నల్స్ మన సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఫైర్ స్టిక్స్ వంటివాటికి సరిగ్గా సంకేతాలు పంపలేదు. రేడియో సిగ్నల్స్ ఓపెన్ స్పేసెస్‌లో బాగా ప్రయాణిస్తాయన్న విషయాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి మనం. అడ్డంకులు ఎన్ని ఎక్కువ ఉంటే.. వాటి శక్తి అంత తగ్గిపోతూంటుందన్నమాట. దీంతో ఇంటర్నెట్ వేగమూ మందగిస్తుంది.
వైఫై రూటర్‌ను నేలపై ఉంచడం కూడా సరికాదు. సిగ్నల్ స్ట్రెంగ్త్ గరిష్టంగా ఉండదు. శక్తిమంతమైన రేడియో తరంగాలు ఎక్కువగా కిందివైపు ప్రయాణిస్తూంటాయి. నేలపై ఉంచితే సిగ్నల్స్ కాస్తా నేలల్లోకి వెళ్లిపోతాయన్నమాట. ఇలా కాకుండా..ఎత్తుగా ఉన్న చోట్ల ఉంచడం మేలు.
కుర్చీలు, టేబుళ్ల వెనుక ఉంచినా చిక్కే. గోడలున్నా సిగ్నల్స్ సులువుగా ప్రయాణించలేవు. ఇంకొంతమంది వైఫై రూటర్‌ను ఎవరికీ కనిపించకుండా ఉండాలని ఎక్కడో ఒక మూలన దాచేస్తూంటారు. దీనివల్ల కూడా వైఫై సిగ్నల్స్ పూర్తిస్థాయిలో వాడుకోలేము.
ఇంట్లో రెండు వైఫై రూటర్లు ఉండి.. వాటిని పక్కపక్కనే పెట్టారనుకోండి. నెట్ వేగం పడిపోయేందుకే అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే వైఫై అనేది నిర్దిష్ట స్పెక్ట్రమ్‌లో రేడియో తరంగాలను ప్రసారం చేస్తూంటుంది. రెండూ ఒకే స్పెక్ట్రమ్‌లో ప్రసారం చేస్తూంటే... ఒకదాని సిగ్నల్ ఇంకోదానితో ఇబ్బందిపడటం ఖాయం.
ఏతావాతా.. ఇంట్లో వైఫై సిగ్నల్స్ బాగా ఉండాలంటే... పూర్తి సామర్థ్యం మేరకు వాడుకోవాలంటే రూటర్లను అందరికీ కనిపించేలా ఏదైనా ఎత్తైన టేబుల్ లేదా షెల్ఫ్‌లో ఉంచడం మేలు. వీలైనంత వరకూ వైఫైకి అడ్డుగా ఏ వస్తువు పెట్టకూడదు. గోడలకు లేదా మందంగా ఉండే ఫర్నీచర్‌కు ఒకట్రెండు అడుగుల దూరంలో ఉంచడం అవసరం.