
ఆనంద్: సహకార రంగం విజయవంతం కావాలంటే పారదర్శకత, సాంకేతికత వినియోగం, సభ్యుల అవసరాలను పని సంస్కృతిలో భాగంగా మార్చుకోవడం ఎంతో అవసరమని కేంద్ర మంత్రి అమిత్ షా చెప్పారు. ప్రఖ్యాత అమూల్ డెయిరీ ప్రాంగణంలో ఆదివారం ఏర్పాటైన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సహకార సంస్థలు ఈ మూడు సూత్రాలను తమ పని సంస్కృతిలో విడదీయరాని భాగాలుగా చేసుకుని జమ్మూ కశీ్మర్ నుంచి అస్సాం వరకు, దేశంలోని ప్రతి గ్రామానికి వాటిని ప్రచారం చేయాలని సూచించారు.
ప్రధాని మోదీ సారథ్యంలో దేశంలో 2 లక్షల ప్రాథమిక సహకారం పరపతి సంఘాలు(పీఏసీఎస్‌లు), మొట్టమొదటి జాతీయ సహకార యూనివర్సిటీ త్రిభువన్, డెయిరీ రంగంలో మూడు జాతీయ సహకార సంఘాలు ఏర్పాటు వంటి కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయన్నారు. సహకార మంత్రిత్వ శాఖ ఏర్పాటైన నాలుగేళ్లలోని 60కి పైగా కార్యక్రమాలను కొత్తగా ప్రారంభించామన్నారు. అమూల్ పాల సహకార వ్యవస్థ వార్షిక టర్నోవర్ ప్రస్తుతమున్న రూ.80వేల కోట్ల నుంచి వచ్చే ఏడాదికల్లా రూ.లక్ష కోట్లకు చేరుకోనుందని అమిత్ షా ప్రకటించారు. గుజరాత్ సహకార పాల మార్కెటింగ్ సమాఖ్యకే అమూల్ అని పేరు. ఈ సంస్థ నిత్యం 36 లక్షల రైతుల నుంచి 3.20 కోట్ల లీటర్ల పాలను సేకరిస్తుంది.