గుజరాత్‌ గడ్డ.. ఎవరి అడ్డా కాబోతోంది?.. సర్వేలు చెబుతున్నదేంటి?

Tough Battle: BJP Vs Congress Who will win Gujarat Election 2022 - Sakshi

గుజరాత్ ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ఏ పార్టీకి అధికారం ఇవ్వాలని అనుకుంటున్నారు? సర్వేలు ఏం చెబుతున్నాయి? గుజరాత్‌లో ఈసారి కాంగ్రెస్ కాస్త గట్టిపోటీయే ఇస్తుందని అంటున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా తనదైన ముద్ర వేస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే బీజేపీకి కంచుకోటగా మారిపోయిన గుజరాత్‌లో సీట్లు తగ్గినప్పటికీ మరోసారి బీజేపీయే రావచ్చునన్నది కొందరి అభిప్రాయం. డిసెంబరు 8న ఓట్ల లెక్కింపు పూర్తయితేనే కానీ గుజరాత్‌ను ఏలేది ఎవరో ఎవరూ చెప్పలేరు.

కమలం ప్లస్‌ ఏంటీ? మైనస్‌ ఏంటీ?
బిజెపి మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ ఇమేజ్ పైనే ఆధార పడుతోంది. మోదీ ప్రచారం చేస్తే చాలు గుజరాత్‌లో గెలిచేస్తాం అన్న ధీమాలో బిజెపి ఉంది. ఇది బిజెపికి ప్లస్ పాయింట్ కాగా నిరాటంకంగా పాతికేళ్లకు పైగా పాలించడం ఒక విధంగా బిజెపికి మైనస్ కానుందంటున్నారు పండితులు. బిజెపి పాలనపై ప్రజల్లో  అంచనాలు, ఆకాంక్షలు పెరిగిపోయాయి. మరో పక్క సుదీర్ఘ పాలనలో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత కూడా పెరుగుతోంది.

ప్రభుత్వ వ్యతిరేకత ఎంత?
ఓటర్లలో ప్రధాన భాగం రైతులు. పంట నష్ట పరిహారాలు ఇవ్వడం లేదని రైతులు పెద్ద ఎత్తున కోపంగా ఉన్నారు. అలాగే ప్రభుత్వ ప్రాజెక్టులకోసం బలవంతంగా భూములు సేకరించడంపై రైతులు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. ఇక రెండో పెద్ద వర్గం యువత. ఇటీవల గుజరాత్‌లో తరచుగా పరీక్షా పత్రాలు లీక్ కావడం పరీక్షలు వాయిదాలు పడ్డంపై విద్యార్ధి లోకం  నిరసన వ్యక్తం చేస్తోంది.

గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు లేవు. సదుపాయాలు ఉన్న విద్యాసంస్థల్లో  ఉపాధ్యాయులు సరిపడ సంఖ్యలో లేరు. ఇక పెద్ద సంఖ్యలో మైనార్టీ ఓటు బ్యాంకు ఉంది. బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసులో  బాధితురాలికి న్యాయం జరగలేదని మైనారిటీలు ఆగ్రహంగా ఉన్నారు. సామాన్యుడి విషయానికొస్తే.. విద్యుత్ ఛార్జీల విషయంలో దేశంలోనే అత్యధిక ఛార్జీలు గుజరాత్‌లోనే ఉన్నాయి. వీరంతా దీనిపై ఆగ్రహంగానే ఉన్నారు. మొత్తం మీద బిజెపి ప్రభుత్వం పనితీరుపై పేరుకుపోతోన్న సమస్యలు ప్రభావం చూపిస్తున్నాయి.

చదవండి: (ఆ ఎమ్మెల్యే ఇక రాజకీయాలకు దూరమా?.. ఆ రెండు చోట్ల కొత్త అభ్యర్థులేనా?)

కాంగ్రెస్‌ సంగతేంటీ?
గత ఎన్నికల్లో 77 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ ఈ సారి భారీ మెజారిటీ సాధించి సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేస్తోంది. గుజరాత్‌కు కాబోయే ముఖ్యమంత్రి కాంగ్రెస్ నుంచే వస్తారని ఆ పార్టీ అంటోంది. ఈ సారి ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్-బిజెపిల మధ్యనే  ఉంటుందన్నది వాస్తవం. ఆమ్ ఆద్మీ పార్టీ రంగంలో ఉన్నా కూడా దాని ప్రభావం పెద్దగా ఉండదంటున్నారు విశ్లేషకులు. అలాగని ఆప్ ను తేలిగ్గా తీసుకోకూడదని వారు హెచ్చరిస్తున్నారు.

ఆప్ తనంతట తానుగా సీట్లు గెలవలేకపోవచ్చుకానీ కాంగ్రెస్-బిజెపి అభ్యర్ధులను ఓడించడంలో కీలక పాత్ర పోషించగలదంటున్నారు విశ్లేషకులు. కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి గుజరాత్ ఎన్నికలు అగ్నిపరీక్షే. ఇక్కడ విజయం సాధిస్తే  ఖర్గే  ఆ విజయాన్ని తన ఖాతాలో వేసుకోవచ్చు. ఓడినా దానికి ఆయనే బాధ్యులు అవుతారు కూడా. గుజరాత్, హిమాచల్‌ ప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు మాత్రం డిసెంబరు 8న జరగనుంది. అదే రోజున ఈ రెండు రాష్ట్రాల జాతకాలు బహిర్గతం అవుతాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top