ట్రాన్స్‌జెండర్‌ చిరకాల కల నెరవేర్చిన సీఎం స్టాలిన్‌

TN: TransWomen Sivanya Selected As Sub Inspector Of Police - Sakshi

చెన్నె: తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎన్నికైన అనంతరం ఎంకే స్టాలిన్‌ ఆదర్శ నిర్ణయాలు తీసుకుంటూ అందరితో శభాశ్‌ అనిపించుకుంటున్నారు. పాలనలోనూ.. ఇటు వ్యక్తిగతంగాను స్టాలిన్‌ ప్రత్యేకత చాటుకుంటున్నారు. తాజాగా స్టాలిన్‌ తీసుకున్న నిర్ణయంతో ట్రాన్స్‌ ఉమన్‌ చిరకాల కల నెరవేర్చి అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ వివరాలు ఏమిటో తెలుసుకోండి.

తిరువాణ్నమలై పట్టణంలోని పవుపట్టుకు చెందిన ఎస్‌.శివన్య లింగ మార్పిడి చేసుకున్న మహిళ. ఆమె కామర్స్‌లో డిగ్రీ పూర్తి చేసింది. ఆమెకు ఎప్పటికైనా పోలీస్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ కావాలని చిరకాల కల. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వం వేసిన పోలీస్‌ ఉద్యోగాల నియామకాలకు దరఖాస్తు చేసుకుంది. నీకెందుకు పోలీస్‌ ఉద్యోగం అని పలువురు అవమానించగా వాటిని సహించింది. ఎంతో దీక్షతో ఉద్యోగానికి సన్నద్ధమైంది. ఈవెంట్స్‌, పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి ఎస్సై ఉద్యోగానికి ఎంపికయ్యింది. లాక్‌డౌన్‌ వలన వైద్య, శారీరక పరీక్షలు, ఇంటర్వ్యూ ఆలస్యంగా జరిగాయి. చివరకు అవి కూడా పూర్తి కావడంతో ఇటీవల ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ శివన్యకు ఎస్సై నియామక పత్రాన్ని అందించారు. 

ఈ పత్రం అందుకున్న తర్వాత శివన్య ఆనందానికి అవధుల్లేవు. ‘నా సోదరులు, కుటుంబసభ్యులు ఎప్పుడూ నాకు అండగా ఉన్నారు. వారు నన్ను ప్రోత్సహిస్తూనే ఉన్నారు. నా లక్ష్యం ఎస్సై కాదు. గ్రూప్‌ 1 సాధించి ఎలాగైనా డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ (డీఎస్పీ) కావాలని ధ్యేయం. అది కూడా సాధిస్తా. తమిళనాడు మొదటి లింగమార్పిడి ఎస్సైగా ప్రీతిక యాసిని నాకు ఆదర్శం’ అని శివన్య తెలిపింది. గతంలో శివన్య తిరువణ్నామలై కోర్టులో పారా లీగల్‌ వలంటీర్‌గా సేవలందించింది. శివన్య అన్నయ్య పేరు స్టాలిన్‌ కావడం గమనార్హం. ఆమె తమ్ముడు తమిళనిధి కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top