సాక్షి, చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో సస్పెన్స్ కొనసాగుతోంది. అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకేకు ప్రభుత్వ ఏర్పాటునకు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ రూపంలో అవాంతరం ఎదురవుతోంది. మెజారిటీ బలంతో వస్తేనే అందుకు అనుమతిస్తానంటూ గవర్నర్ మరోసారి స్పష్టం చేశారు. దీంతో ఇవాళైనా సానుకూల నిర్ణయం వెలువడుతుందని ఎదురు చూస్తున్న టీవీకే ఆశలపై నీళ్లు జల్లినట్లయ్యింది.
బుధవారం లోక్‌భవన్‌లో టీవీకే అధినేత విజయ్‌కు చుక్కెదురైంది. ఆ పార్టీ సమర్పించిన మద్దతుదారుల లిస్ట్‌పై గవర్నర్ పెదవి విరిచారు. పూర్తి స్థాయి బలం లేదు కదా? అని ప్రశ్నించారు. దీంతో గురువారం ఉదయం మరోసారి లోక్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌తో చర్చలు జరిపారు. 113 మంది ఎమ్మెల్యేల మద్దతుతో కూడిన సంతకాలతో పాటు 20 మంత్రుల జాబితాను సమర్పించారు. సుమారు 40 నిమిషాల పాటు ఇందుకు సంబంధించిన చర్చలు జరిగాయి. అయితే..
113 మందితోనే ప్రభుత్వం ఎలా ఏర్పాటు చేస్తారని ఆ సందర్భంలో గవర్నర్ ఆర్లేకర్, టీవీకే అధినేతను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మరోసారి న్యాయ నిపుణులతో చర్చించాకే నిర్ణయం చెబుతానని విజయ్‌ను పంపించేశారు. ఆ వెంటనే సానుకూల ప్రకటన రావొచ్చంటూ కథనాలు వెలువడ్డాయి. కానీ,
లోక్‌భవన్ నుంచి టీవీకే పార్టీకి ఫోన్‌కాల్ వెళ్లింది. విజయ్ సమర్పించిన సంఖ్యా బలం పట్ల గవర్నర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పూర్తి మెజారిటీ లేకున్నా ప్రభుత్వ ఎలా ఏర్పాటు చేస్తారని.. 118 ఎమ్మెల్యేల మద్దతు సమర్పించాకే సీఎంగా ప్రమాణం చేయాలని స్పష్టం చేసింది.
మరోవైపు తమిళనాడు గవర్నర్ తీరుపై కాంగ్రెస్ పార్టీ, సీపీఐ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. అత్యధిక స్థానాల్లో గెలుపొందిన టీవీకేకు ప్రభుత్వ ఏర్పాటునకు అవకాశం ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నాయి. విజయ్ పార్టీకి బలనిరూపణకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నాయి. మరోవైపు ప్రముఖులు సైతం ఈ వ్యవహారంపై స్పందిస్తున్నారు.
తమిళనాడు చరిత్రలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి రాలేదని.. తమిళనాడు గవర్నర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, .. ప్రజల ఆకాంక్షలను అవమానిస్తున్నారని మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ ట్వీట్ చేశారు. రాజ్యంగబద్ధ హోదాలో ఉన్నవాళ్లు ప్రజా తీర్పును గౌరవించాలని..తమ విధుల్ని సరిగా నిర్వర్తించాలని హితవు పలికారు. బలనిరూపణ జరగాల్సింది అసెంబ్లీలోనని.. లోక్‌భవన్‌లో కాదని అన్నారాయన. ప్రభుత్వ ఏర్పాటునకు ఇప్పటికైనా విజయ్‌ని ఆహ్వానించాలని ఆయన అన్నారు. మరో నటుడు ప్రకాశ్‌రాజ్ సైతం విజయ్ మద్దతుగా పోస్ట్ చేశారు. విజయ్‌కు ప్రజలు పట్టం కట్టారు. బలనిరూపణకు అసెంబ్లీలో అవకాశం ఇవ్వాల్సిందేనని ట్వీట్ చేశారు.
తమిళనాడు ఎన్నికల్లో విజయ్ పార్టీ 108 స్థానాల్లో నెగ్గింది. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఆ బలం 113కి చేరింది. ప్రభుత్వ ఏర్పాటునకు మరో ఐదు స్థానాలు అవసరం. ఈ క్రమంలో డీఎంకే కూటమి పార్టీల మద్దతును విజయ్ కోరారు. అయితే అవి విజయ్‌కు మద్దతు ఇచ్చే అంశంలో ఇంకా ఎలాంటి నిర్ణయం వెల్లడించలేదు. మరోవైపు అన్నాడీఎంకే లేదంటే దాని కూటమిలోని చిన్నపార్టీల తరఫు నుంచైనా విజయ్‌కు మద్దతు లభిస్తుందేమోనన్న చర్చ తమిళనాట జోరందుకుంది.


