కలిసి వచ్చే పార్టీల వేటలో బీజీగా మారిన టీవీకే చీఫ్
డీఎంకే, అన్నాడీఎంకే జట్టుకడితే మూకుమ్మడి రాజీనామాలు చేసేందుకు రెడీగా ఉన్న టీవీకే ఎమ్మెల్యేలు !
అవసరమైతే న్యాయపోరాటానికీ సిద్ధమని వ్యాఖ్య
నూతన ప్రభుత్వ ఏర్పాటుపై తమిళనాట కొనసాగుతున్న ప్రతిష్టంభన
రాజ్యసభ స్థానానికి అన్నాడీఎంకే నేత షణ్ముగం రాజీనామా
అన్నాడీఎంకేను చీల్చి టీవీకేతో షణ్ముగం కలుస్తారని ఊహాగానాలు
సాక్షి, చెన్నై: తొలి సినిమాతోనే బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టినట్లు తమ మొదటి ఎన్నికల్లోనే అత్యధిక స్థానాల్లో గెలిచి దాదాపు అధికారతీరాలకు చేరిన టీవీకే గంటలు గడుస్తున్నా ప్రభుత్వ ఏర్పాటు గండాన్ని దాటలేక అవస్థలు పడుతోంది. మ్యాజిక్ ఫిగర్ సాధించాకే తన వద్దకు రావాలని ఓవైపు గవర్నర్ అర్లేకర్ స్పష్టంచేయడం, మరోవైపు పదవీయోగం దక్కకుండా చేసేందుకు ద్రవిడ దిగ్గజ పార్టీలు డీఎంకే, అన్నాడీఎంకే కలిసి పనిచేయనున్నాయనే వార్తల నడుమ టీవీకే చీఫ్ విజయ్ వేగంగా పావులు కదుపుతున్నారు.
తమ ప్రియతమ హీరో, నేతను ముఖ్యమంత్రికాకుండా అడ్డుతగిలితే మూకుమ్మడి రాజీనామాలు చేసేందుకూ వెనుకాడబోమని టీవీకే ఎమ్మెల్యేలు ప్రతినబూనారన్న వార్త తమిళనాట సంచలనం సృష్టిస్తోంది. 24 గంటల వ్యవధిలో రెండుసార్లు ప్రత్యేకంగా కలిసి అభ్యరి్థంచినా గవర్నర్ మనసు మార్చుకోకపోవడంతో సర్వోన్నత న్యాయస్థానంలో న్యాయపోరాటానికి సిద్ధపడేందుకు టీవీకే రెడీగా ఉందన్న వార్త చక్కర్లు కొడుతోంది. ఆలోపు భావసారూప్య పార్టీల మద్దతు కూడగట్టేందుకూ టీవీకే శతథా ప్రయత్నిస్తోంది.
టీవీకే అభ్యర్థనతో మద్దతు ఇచ్చే ఆలోచన ఉన్నా బీజేపీ ఒత్తిడి కారణంగా అంతటి సాహసం చేసే దమ్ములేక అన్నాడీఎంకే మిన్నకుండిపోయిందని వార్తలు వినవస్తున్నాయి. టీవీకే కూటమిలోకి దూకేయకుండా తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు ఇప్పటికే అన్నాడీఎంకే రిసార్ట్ రాజకీయాలకు శ్రీకారం చుట్టింది. అటు అన్నాడీఎం కలిసిరాక, ఇటు ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతు సరిపోక విజయ్ ఇతర పార్టీల అగ్రనేతలతో సమాలోచనలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. దీంతో తమిళనాట ఏ పార్టీ/కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందనే దానిపై తలపండిన రాజకీయ పండితులు సైతం ఎటూ తేల్చలేకపోతున్నారు.
మరోసారి లోక్‌భవన్‌కు..
గవర్నర్ అర్లేకర్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు విజయ్ గురువారం లోక్‌భవన్‌కు వెళ్లారు. తమకు అవకాశమిస్తే అసెంబ్లీ బల నిరూపణ చేసుకుంటామని గవర్నర్‌ను లిఖితపూర్వకంగా అభ్యరి్థంచారు. ఇందుకు గవర్నర్ నుంచి సానుకూల స్పందన కరువైంది. 118 మంది ఎమ్మెల్యేల మద్దతుతో వస్తేనే సాధారణ మెజార్టీ సాధించినట్లు భావించి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమిస్తానని విజయ్‌కు గవర్నర్ స్పష్టంచేశారు. తమకంటే ముందుగా మరే పార్టీ లేదా కూటమికి ప్రభుత్వ ఏర్పాటు అవకాశం ఇవ్వొద్దని విజయ్ కోరారని, అందుకు గవర్నర్ సమ్మతి తెలిపారని లోక్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. గవర్నర్‌తో విజయ్ భేటీ 40 నిమిషాల్లోపే ముగిసింది.
అనూహ్యంగా షణ్ముగం రాజీనామా
అన్నాడీఎంకే సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సీవీ షణ్ముగం గురువారం రాత్రి అనూహ్యంగా తన రాజ్యసభ స్థానానికి రాజీనామా చేశారు. ఢిల్లీకొచ్చి సంబంధిత ఉన్నతాధికారికి తన రాజీనామా లేఖను అందజేశారు. విజయ్‌తో అన్నాడీఎంకే పొత్తు పెట్టుకుంటే రాష్ట్రానికి క్షేమదాయకమని ఫలితాలు వెల్లడయ్యాక షణ్ముగం వ్యాఖ్యానించడం తెల్సిందే. దీంతో అన్నాడీఎంకేను చీల్చి తన వర్గం ఎమ్మెల్యేలను టీవీకేకు మద్దతు ఇచ్చేలాచేసి ప్రభుత్వ ఏర్పాటుకు షణ్ముగం ప్రయత్నిస్తున్నారని వార్తలొచ్చాయి. దీనిపై ఆయన స్పందించారు. ‘‘దీనిపై నేనేమీ మాట్లాడను. నాకేమీ తెలియదు’’ అని అన్నారు. డీఎంకేతో అన్నాడీఎంకే పొత్తు ప్రతిపాదనలను మొదట్నుంచీ షణ్ముగం వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. పనయూర్‌లో టీవీకే ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. ఇక్కడ ఏ నిర్ణయాలు తీసుకున్నారనేది తెలియరాలేదు. అందరూ ఐక్యంగా ఉండాలని విజయ్ కోరుకుంటున్నారని పార్టీ ముఖ్యనేత తెలిపారు.
ముందస్తుగా జాబితా ఎందుకు?
‘‘పార్టీ అనేది అసెంబ్లీలో బలనిరూపణ చేసుకుంటుంది. మొత్తం ఎమ్మెల్యేల జాబితాను ముందస్తుగా అడగాల్సిన అవసరం గవర్నర్‌కు ఏముంది? ఉద్దేశపూర్వకంగా బీజేపీ గవర్నర్‌తో తమిళనాట రాజకీయ అస్థిరతను సృష్టిస్తోంది. గవర్నర్ వైఖరిపై శుక్రవారం నిరసనర్యాలీలు కొనసాగుతాయి’’ అని కాంగ్రెస్ తెలిపింది. టీవీకే అభ్యర్థనపై శుక్రవారం సమావేశమై నిర్ణయం తీసుకుంటామని సీపీఎం తెలిపింది.
6 నెలల వరకు ఇబ్బంది పెట్టం: స్టాలిన్
టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు తమ వైపు నుంచి ఎలాంటి అడ్డంకులు ఉండవని డీఎంకే చీఫ్ స్టాలిన్ స్పష్టంచేశారు. ఈ మేరకు గురువారం ఆయన ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అల్పాహార పథకాన్ని నిర్విరామంగా కొనసాగించాలని కోరారు. సీపీఎం, సీపీఐ, వీసీకే, ఐయూఎంఎల్, ఎండీఎంకే పార్టీల నేతలతో గురువారం స్టాలిన్ సమావేశమయ్యారు. ఐక్యంగా ఉందామని కోరారు. తర్వాత సొంత పార్టీ ఎమ్మెల్యేలతోనూ మాట్లాడారు. ఏ నిర్ణయానికైనా కట్టుబడాల్సిందేనని స్టాలిన్ స్పష్టంచేశారు.
మూడు పార్టీల నేతలతో భేటీలు..
టీవీకే నేత నిర్మల్ నేతృత్వంలోని బృందం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి షణ్ముగం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వీరపాండియన్, వీసీకే నేత తిరుమావళవన్‌తో వేర్వేరుగా సమావేశమైంది. తమతో కలిసిరావాలని వీళ్లను నిర్మల్ కోరారు. ఈ మూడు పార్టీలు శుక్రవారం సాయంత్రంలోగా నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలున్నాయి. డీఎంకేతో చర్చించాక చెప్తామని ఐయూఎంఎల్ నేత ఖాదర్ వెల్లడించారు.
పుదుచ్చేరి క్యాంప్‌లో పళనిస్వామి
పుదుచ్చేరి క్యాంప్‌లో ఉన్న తమ ఎమ్మెల్యేలతో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి గురువారం రాత్రి సమావేశమయ్యారు. ఉదయం అంతా చెన్నైలో ముఖ్య నేతలతో సమావేశమైన పళనిస్వామి సరిగ్గా తొమ్మిదిన్నర గంటలకు పదుచ్చేరిలో ఏర్పాటు చేసిన క్యాంప్‌కు చేరుకున్నారు. పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశంలో నిమగ్నమయ్యారు.


