ముక్కోణపు పోరు | Three Way Battle in Tamil Nadu Assembly Elections 2026 | Sakshi
Sakshi News home page

ముక్కోణపు పోరు

Mar 20 2026 6:07 AM | Updated on Mar 20 2026 12:37 PM

Three Way Battle in Tamil Nadu Assembly Elections 2026

ఆసక్తికరంగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు 

సీఎం స్టాలిన్‌కు అగ్నిపరీక్ష 

అన్నాడీఎంకేకు అస్తిత్వ పరీక్ష 

గుబులు రేపుతున్న విజయ్‌ పార్టీ

ఇటు కాంగ్రెస్‌ తదితర పార్టీలతో కూడిన అధికార డీఎంకే కూటమి. అటు బీజేపీ–అన్నాడీఎంకేల విపక్ష కూటమి. మరోవైపు కొత్తగా దూసుకొచ్చిన సినీ నటుడు విజయ్‌ సారథ్యంలోని టీవీకే. దాంతో తమిళనాడులో ఈసారి అత్యంత ఆసక్తికరమైన ముక్కోణపు పోరుకు రంగం సిద్ధమైంది. ముఖ్యంగా డీఎంకే అధినేత, సీఎం ఎంకే స్టాలిన్‌ నాయకత్వ పటిమకు ఈ అసెంబ్లీ ఎన్నికలు అగ్నిపరీక్షగా మారాయి. 

దశాబ్దాలుగా తనకు ఏ మాత్రమూ కొరుకుడు పడని తమిళ గడ్డపై ఎలాగైనా కాషాయ జెండా పాతాలని బీజేపీ పట్టుదలగా ఉంది. ప్రజల్లో, ముఖ్యంగా యువత, మహిళల విశేషమైన ఆదరణ కచి్చతంగా ఓట్ల రూపంలో ప్రతిఫలిస్తుందని విజయ్‌ భారీ ఆశలే పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో అన్నా కూటమిని, విజయ్‌ పార్టీని స్టాలిన్‌ ఏ మేరకు నిలువరిస్తారన్నది ఆసక్తికరం. మరోసారి అన్ని స్థానాల్లోనూ ఒంటరిగా బరిలో దిగుతున్న సీమన్‌ సారథ్యంలోని ఎన్‌టీకే ఎవరి ఓటు బ్యాంకును చీలుస్తుందన్నది కూడా కీలకంగా మారనుంది...

డీఎంకే కూటమికి...    మోదమో, ఖేదమో! 
తమిళనాడులో ఈసారి అసెంబ్లీ ఎన్నికల పోరు హోరాహోరీగా సాగనుంది. అన్నాడీఎంకే కూటమితో పాటు కొత్త పార్టీ టీవీకే నుంచి గట్టి పోటీ తప్పదని తేలిపోవడంతో అధికార డీఎంకే సర్వశక్తులూ ఒడ్డుతోంది. సెక్యులర్‌ ప్రోగ్రెసివ్‌ అలయన్స్‌ (ఎస్‌పీఏ) పేరిట కాంగ్రెస్, వామపక్షాలతో పాటు దాదాపు 20 పార్టీలతో మరోసారి జట్టు కట్టి ఎన్నికల బరిలోకి దిగుతోంది! కాంగ్రెస్, ఎండీఎంకేతో పాటు విజయ్‌కాంత్‌ స్థాపించిన డీఎంఎంకేలతో సీట్ల సర్దుబాటు ఇప్పటికే పూర్తయింది. ఎప్పట్లా ద్రవిడ నినాదంతో పాటు ప్రధానంగా సంక్షేమ పథకాలనే స్టాలిన్‌ పార్టీ నమ్ముకుంటోంది. విద్యార్థులకు ఉచిత అల్పాహారం, మహిళలకు నెలవారీ ఆర్థిక సాయం తదితర పథకాలే తమను ఒడ్డున పడేస్తాయని భావిస్తోంది. 

దీనికి తోడు తమిళ అస్తిత్వం, రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధాని నరేంద్ర మోదీతో తలపడుతున్న యోధునిగా స్టాలిన్‌కు ఉన్న ఇమేజీ కూడా కలిసొస్తుందని ఆశిస్తోంది. ముస్లింలు, మైనారిటీల ఓట్లపైనా ఆశలు పెట్టుకుంది. కాకపోతే ప్రభుత్వ వ్యతిరేకత, మంత్రుల విచ్చలవిడి అవినీతి, రాష్ట్రంలో పెచ్చరిల్లుతున్న నేరాలు, డ్రగ్స్‌ వంటివి డీఎంకేకు పెద్ద తలనొప్పిగా మారాయి. కుటుంబ రాజకీయాల ముద్ర కూడా ప్రతికూలంగా మారుతుందేమోనన్న భయం డీఎంకేను వెంటాడుతోంది. దీనికి తోడు సీమన్‌ పార్టీ నామ్‌ తమిళార్‌ కట్చి (ఎన్‌టీకే) కూడా స్టాలిన్‌ పార్టీకి తలనొప్పిగా మారేలా ఉంది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌టీకే సీట్లేమీ గెలుచుకోకపోయినా 6 శాతం ఓట్లు సాధించింది. దాని ఓటు షేరు ఈసారి 10 నుంచి 15 శాతానికి పెరగవచ్చని పలు సర్వేలు చెబుతున్నాయి! ఎన్‌టీకే ప్రధానంగా డీఎంకే ఓటు బ్యాంకుకే గండి కొట్టవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. ఆ అంచనాలే గనక నిజమైతే ముక్కోణపు పోరులో కోలుకోలేని నష్టం తప్పదేమోనని డీఎంకే కలవరపడుతోంది.

డీఎంకే కూటమి 
సానుకూలతలు 
→ భాగస్వాములతో సజావుగా సాగిన పొత్తుల ఖరారు 
→ డీఎంకేకు బూత్‌ స్థాయి దాకా పటిష్టమైన నిర్మాణం 
→ సంక్షేమ పథకాలు. ముఖ్యంగా మహిళలు, విద్యార్థులు మొదలుకుని గిగ్‌ వర్కర్ల దాకా నగదు బదిలీ పథకాలు 
→ డీఎంకే వ్యతిరేక ఓట్లను టీవీకే చీల్చనుందన్న సంకేతాలు 
→ మైనారిటీల మద్దతు 

ప్రతికూలతలు 
→ మంత్రులు, నేతలపై అవినీతి ఆరోపణలు 
→ రాష్ట్రంలో బాగా పెరిగిన నేరాలు 
→ తీవ్రమైన ప్రభుత్వ వ్యతిరేకత

అన్నాడీఎంకే... కష్టాలకు ఎదురీత!
జయలలిత మరణానంతరం పదేళ్లుగా ఒక్క ఎన్నికల్లో కూడా గెలుపు ముఖం చూడని అన్నాడీఎంకే ఈసారి కూడా కష్టాలకు ఎదురీదుతోంది. కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. మాజీ సీఎం ఒ.పన్నీర్‌సెల్వంతో పాటు పలువురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి డీఎంకే, టీవీకే గూటికి చేరారు. దీనికి తోడు నాయకత్వ లేమి పార్టీని తీవ్రంగా బాధిస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో ఇప్పటికీ బలంగానే ఉండటం అన్నాడీఎంకేకు అతి పెద్ద సానుకూలత. దానికి బీజేపీ బలం కూడా తోడవుతోంది. కన్యాకుమారి తదితర జిల్లాలతో పాటు రాష్ట్రంలో పశి్చమ ప్రాంతాల్లో కొన్నేళ్లుగా కాషాయ పార్టీ క్రమంగా పుంజుకుంటూ వస్తోంది. 

తన క్షేత్రస్థాయి బలానికి బీజేపీ ఆర్థిక వెన్నుదన్ను తోడై మెరుగైన ఫలితాలు సాధిస్తానని అన్నాడీఎంకే నమ్ముతోంది. అయితే విజయ్‌ పార్టీని కూటమిలోకి తీసుకొచ్చేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు ఆ పార్టీకి రుచించడం లేదు. ఇది అంతిమంగా వాటి మధ్య సామరస్యాన్ని దెబ్బతీసే ఆస్కారం లేకపోలేదు. పైగా బీజేపీ హిందూత్వ ఎజెండా తమిళనాడులో పెద్దగా ఫలించకపోవచ్చని గత అనుభవాలు చాటుతున్నాయి.అంతేగాక బీజేపీకి ఉన్న మైనారిటీ వ్యతిరేక ముద్ర అంతిమంగా కూటమికి చేటు చేయవచ్చన్న అంచనాలూ లేకపోలేదు. పైగా జయలలిత నెచ్చెలి శశికళ పెట్టిన కొత్త పార్టీ కూడా అన్నాడీఎంకే ఓట్లకు ఎంతోకొంత గండి కొట్టవచ్చంటున్నారు. ఇన్ని సవాళ్ల నేపథ్యంలో పార్టీ పునాదులను పదిలంగా కాపాడుకోవడమే ఎడప్పాడి కె.పళనిస్వా మికి పరీక్షగా నిలవనుంది. అయితే కావేరీ డెల్టాలో రైతుల దుస్థితి తదితర సమస్యలపై గళమెత్తడం ద్వారా ప్రజల్లోకి వెళ్తూ ఆయన గట్టిగానే చెమటోడుస్తున్నారు.

అన్నాడీఎంకే–బీజేపీ కూటమి 
సానుకూలతలు 
→ బీజేపీ రూపంలో అపారమైన అర్థ, అంగ బలాలు 
→ అన్నాడీఎంకేకు క్షేత్రస్థాయి దాకా ఉన్న పట్టు 
→ జయలలిత పట్ల ప్రజల్లో చెక్కుచెదరని ఆదరణ 

ప్రతికూలతలు 
→ నాయకత్వ లేమి 
→ శశికళ సొంత పార్టీతో ఓట్లు చీలే ఆస్కారం 
→ ముఖ్య నేతల వలసలు 
→ బీజేపీపై హిందూత్వ, తమిళ వ్యతిరేక ముద్ర

విజయ్‌ పార్టీ... ఆశల పల్లకీలో! 
సినీ నటుడు విజయ్‌ తమిళ రాజకీయాల్లో ఎక్స్‌ ఫ్యాక్టర్‌గా దూసుకొచ్చారు. ఆయన స్థాపించిన తమిళగ వెట్రి కళగం పార్టీ డీఎంకే, అన్నాడీఎంకే కూటములకు ఆందోళన కలిగించింది. వాటికి మూడో ప్రత్యామ్నాయంగా కనిపించింది. విజయ్‌ రోడ్‌ షోలు, సభలకు జనం విరగబడ్డారు. కానీ వీఎంకే జోరుకు కొన్నాళ్లుగా బ్రేకులు పడుతూ వస్తున్నాయి. గత సెప్టెంబర్లో కరూర్‌ బహిరంగ సభలో జరిగిన తొక్కిసలాట ఉదంతం విజయ్‌కి బాగా మైనస్‌గా మారింది. ఏకంగా 41 మంది కార్యకర్తలు దుర్మరణం పాలైతే వేదిక నుంచి హడావుడిగా నిష్క్రమించారన్న ప్రచారం చేటు చేసింది. కనీసం ఆ తర్వాతైనా చనిపోయిన వారి కుటుంబాలను కలిసేందుకు అయిష్టత వెలిబుచ్చడం విజయ్‌ ఇమేజీని మసకబార్చింది.

 తొక్కిసలాటపై ఆయన పలుమార్లు సీబీఐ విచారణకు హాజరు కావాల్సి వచి్చంది. బీజేపీతో పొత్తు దిశగా ఒత్తిడి పెంచేందుకు దీన్ని మోదీ సర్కారు వాడుకుంటోందన్న ప్రచారాన్ని విజయ్‌ గట్టిగా ఖండించకపోవడం టీవీకేకు మరింత చేటు చేస్తోంది. దీనికి తోడు ఎన్నికలు సమీపించిన తరుణంలో విజయ్‌తో విడాకులు కోరుతూ ఆయన భార్య కోర్టుకెక్కడం మరో మైనస్‌గా మారింది. సినీ నటి త్రిషతో ఆయన బంధమే ఇందుకు కారణమన్న ప్రచారం మహిళల్లో ప్రతికూలంగా మారేలా కనిపిస్తోంది. పైపెచ్చు డీఎంకే, అన్నాడీఎంకేలతో పోలిస్తే టీవీకేకు రాష్ట్రవ్యాప్తంగా బలమైన వ్యవస్థాగత నిర్మాణం లేకపోవడం పెద్ద లోటే. ఇప్పటికైతే ఒంటరి పోరుకే విజయ్‌ పార్టీ మొగ్గుతోంది. అదే జరిగితే డీఎంకే, అన్నాడీఎంకే కూటముల్లో దేని ఓట్లకు టీవీకే గండికొడుతుందన్నది అంతిమ ఫలితాల్లో నిర్ణాయకంగా మారేలా కనిపిస్తోంది.

టీవీకే 
సానుకూలతలు 
→ విజయ్‌ కరిష్మా. యువత, మహిళల్లో భారీ ఫాలోయింగ్‌ 
→ కొత్త పార్టీ కావడంతో క్లీన్‌ ఇమేజీ 
→ మూడో ప్రత్యామ్నాయంగా తటస్థ ఓటర్లను ఆకట్టుకునే అవకాశం  

ప్రతికూలతలు 
→ బలహీనమైన వ్యవస్థాగత నిర్మాణం 
→ ఆదరణను ఓట్లుగా మలిచే యంత్రాంగం లేకపోవడం 
→ నాయకుల లేమి, అనుభవ రాహిత్యం 
→ విజయ్‌ విడాకుల కేసు, ఆయనపై సీబీఐ విచారణ 

Advertisement
 
Advertisement
Advertisement