భార్య, కుమారున్ని హతమార్చి.. | Three Of A Family Ends Their Life At Mandya | Sakshi
Sakshi News home page

భార్య, కుమారున్ని హతమార్చి..

Jun 10 2026 11:46 AM | Updated on Jun 10 2026 11:55 AM

Three Of A Family Ends Their Life At Mandya

కర్ణాటక: కుటుంబాన్ని ప్రాణంలా కాపాడుకోవాల్సిన ఇంటి పెద్ద హంతకుడయ్యాడు. భార్య, కుమారున్ని చంపి, తాను ఆత్మహత్య చేసుకున్నాడు. మండ్య నగరంలో దుస్తుల వ్యాపారి ఒకరు ఈ ఘోరానికి పాల్పడ్డాడు. వ్యాపారి ప్రభాకర్‌ (65), భార్య జ్యోతి (55), కుమారుడు   సంతోష్‌ (30) మృతులు.  

ఏం జరిగిందంటే.. 
వివరాలు.. నెహ్రూ నగరలో ప్రభాకర్‌కు క్లాత్‌ స్టోర్‌ ఉంది. కుటుంబ నిర్వహణ, వ్యాపారం కోసం పెద్ద మొత్తంలో అప్పులు చేసినట్లు తెలుస్తోంది. ఇంట్లో సోమవారం రాత్రి భోజనం చేసి పడుకున్నాక.. భార్య జ్యోతి గొంతుకు చీర బిగించి చంపబోయాడు. ఆ శబ్ధాలకు మరో గదిలో ఉన్న కుమారుడు సంతోష్‌ వచ్చాడు. అయినప్పటికీ ప్రభాకర్‌ భార్యను హతమార్చి, ఆపై కుమారున్ని కూడా అదే మాదిరిగా ప్రాణాలు తీశాడు. పక్క గదిలో నిద్రిస్తున్న కోడలికి ఇదేమీ తెలియదు. తరువాత తన బట్టల అంగడికి వచ్చి ప్రభాకర్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం ఉదయం కోడలు నిద్రలేచి అత్త వద్దకు వెళ్లగా ఘోరం బయటపడింది. తూర్పు పోలీసు స్టేషన్‌ సిబ్బంది, మండ్య ఎస్పీ శోభారాణి చేరుకుని పరిశీలించారు.   

పాపం.. కొత్త కోడలు 
ఈ ఘటనలో మరో విషాదం ఏమిటంటే.. నెల రోజుల క్రితమే సంతోష్‌కు ఘనంగా పెళ్లి చేయడం. అతని భార్య జీవితం కూడా ఛిన్నాభిన్నమైంది. రాత్రి తన గదినుంచి భర్త బయటకు వెళ్లిన సంగతి ఆమెకు తెలియరాలేదు. ఫ్యాన్‌ శబ్దం ఎక్కువగా ఉండడం వల్ల ఏ చప్పుళ్లు వినిపించలేదని ఆమె తెలిపింది.   

డెత్‌నోట్‌లో..  
వ్యాపారంలో నష్టాలు, అప్పుల వల్ల విరక్తికి గురై ప్రభాకర్‌ భార్య, కొడుకును చంపేశారని ఎస్పీ  శోభ తెలిపారు. ప్రభాకర్‌ డెత్‌నోట్‌ లభించిందని తెలిపారు. ఇంటి రుణం, నష్టాలు, ఉచిత బస్సు పథకం వల్ల తమకు వ్యాపారం బాగా తగ్గిపోయిందని లేఖలో రాశారన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement