ఆస్ట్రేలియా పర్యటన వేళ.. ప్రధాని నరేంద్ర మోదీకి బెదిరింపులు కలకలం రేపుతున్నాయి.. ఆసీస్ పర్యటనకు ముందు మోదీకి ఆన్‌లైన్‌లో బెదిరింపులు వచ్చాయి. ఈ నెల 9న ఆ దేశ పర్యటనకు ప్రధాని మోదీ వెళ్లనున్న క్రమంలో.. ఆస్ట్రేలియా వస్తే చంపేస్తామంటూ వచ్చిన వార్నింగ్‌పై ఆ దేశ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
జులై 9న మార్వెల్ స్టేడియంలో జరగాల్సిన ‘మెల్‌బోర్న్ మీట్స్ మోదీ (Melbourne Meets Modi) కమ్యూనిటీ ఈవెంట్‌ను ప్రకటిస్తూ ఫేస్‌బుక్‌లో పెట్టిన ఒక పోస్ట్ కింద ఈ బెదిరింపు కామెంట్ ప్రత్యక్షమైంది. అబు ముస్తఫా అనే పేరుతో ఉన్న ఖాతా నుండి వచ్చిన ఆ కామెంట్‌లో ‘ఈ కార్యక్రమం జరిగే సమయంలో స్టేడియం రూఫ్ టాప్‌లను (పైకప్పును) మూసివేయడం మంచిది. లేదంటే ఆయన తన మరణం కోసమే ఆస్ట్రేలియాకు వస్తున్నట్లు లెక్క’’ అంటూ బెదిరింపులకు దిగారు. ఈ బెదిరింపులపై ఆస్ట్రేలియా ఫెడరల్ పోలీస్ (AFP)కి ఫిర్యాదు అందినట్లు ది ఆస్ట్రేలియా టుడే తెలిపింది.
ఈ పోస్ట్‌కు సంబంధించిన ఐపీ (IP) అడ్రస్‌ను ర్యాప్తు అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఈ బెదిరింపులపై పలు కోణాల్లో అధికారులు దర్యాప్తు చేపట్టారు. కాగా, ఈ పర్యటనలో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొనడంతో పాటు.. మెల్‌బోర్న్ సమావేశంతో సహా పలు కమ్యూనిటీ ఈవెంట్లలో కూడా పాల్గొననున్నారు. పర్యటనకు వచ్చే ఇతర దేశాల ప్రభుత్వాధినేతలకు వచ్చే బెదిరింపులను ఆస్ట్రేలియా చట్టం అత్యంత తీవ్రంగా పరిగణిస్తుంది. హై-ప్రొఫైల్ అంతర్జాతీయ పర్యటనల భద్రతా ప్రణాళికలో ఆస్ట్రేలియా ఫెడరల్ పోలీస్, స్టేట్ పోలీస్, స్పెషలిస్ట్ ప్రొటెక్టివ్ సెక్యూరిటీ యూనిట్లతో సహా పలు సంస్థలు భాగస్వామ్యమవుతాయి.


