
శిబూ సోరెన్ అంతిమ యాత్రలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న జనం
జార్ఖండ్‌లో శిబూ సోరెన్ అంత్యక్రియలు పూర్తి
కడసారి దర్శనం కోసం తరలివచ్చి న వేలాది మంది అభిమానులు
నెమ్రా: జార్ఖండ్ ముక్తిమోర్చా వ్యవస్థాపకుడు, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి శిబూ సోరెన్ అంత్యక్రియలు మంగళవారం పూర్తయ్యాయి. వేలాది మంది అభిమానులు, పార్టీ నేతలు, కార్యకర్తలు తమ గురూజీకి కన్నీటి వీడ్కోలు పలికారు. చాలారోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న శిబూ సోరెన్ సోమవారం ఢిల్లీ ఆసుపత్రిలో కన్నుమూసిన సంగతి తెలిసిందే.
పార్దివదేహాన్ని తొలుత ఢిల్లీ నుంచి విమానంలో జార్ఖండ్ రాజధాని రాంచీకి తరలించారు. రాష్ట్ర అసెంబ్లీలో శిబూ సోరెన్ పార్దివదేహం వద్ద గవర్నర్ సంతోష్ గంగ్వార్, స్పీకర్ రవీంద్రనాథ్ మహతో, పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు నివాళులరి్పంచారు. అనంతరం రామ్‌గఢ్ జిల్లాలోని శిబూ సోరెన్ స్వగ్రామం నెమ్రాకు భౌతికకాయాన్ని తరలించారు. కడసారి దర్శనం కోసం భారీగా జనం తరలివచ్చారు. గురూజీ అమర్ రహే అంటూ నినదించారు. అనంతరం అంతిమ యాత్ర మొదలైంది. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి.
పోలీసులు గాల్లోకి తుపాకులు పేల్చి వందనం సమర్పించారు. శిబూ సోరెన్ చితికి ఆయన పెద్ద కుమారుడు, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నిప్పంటించారు. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, కేంద్ర మాజీ మంత్రి అర్జున్ ముండా తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ హాజరు కాలేకపోయారు. వారు తొలుత విమానంలోని ఢిల్లీ నుంచి రాంచీకి చేరుకున్నారు.
అక్కడి హెలికాప్టర్‌లో బయలుదేరాల్సి ఉండగా, సాంకేతిక సమస్యలతో హెలికాప్టర్ టేకాఫ్ కాలేదు. దాంతో రోడ్డు మార్గంలో సాయంత్రం కల్లా నెమ్రాకు చేరారు. హేమంత్ సోరెన్‌తోపాటు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. మరోవైపు జార్ఖండ్ ప్రభుత్వం మూడు రోజులపాటు సంతాపం దినాలు ప్రకటించింది. మంగళవారం జార్ఖండ్‌లో పాఠశాలలు మూసివేశారు. జార్ఖండ్ అసెంబ్లీ సమావేశాలు సైతం నిరవధికంగా వాయిదా పడ్డాయి.