వైరల్‌గా మారిన తేజస్వి ఫోన్‌ కాల్‌

Tejashwi Yadav Phone Call In Bihar Goes Viral - Sakshi

పాట్నా: బీహార్‌లో ప్రస్తుతం ఓ ఫోన్ కాల్ రికార్డు వైరల్‌గా మారింది. ఆర్‌జేడీ చీఫ్‌, లాలుప్రసాద్‌ యాదవ్‌ తనయుడు తేజస్వి యాదవ్, పట్నా జిల్లా మెజిస్ట్రేట్‌ చంద్రశేఖర్‌ సింగ్‌ మధ్య జరిగిన ఆ సంభాషణ నెట్టింట చక్కర్లు కొడుతూ, తేజస్వి ఇమేజ్‌ను అమాంతం పెంచేసింది. వివరాల్లోకి వెళితే.. పాట్నాలో ఉపాధ్యాయులు చేస్తున్న నిరసనకు మద్దతు తెలిపేందుకు తేజస్వి వెళ్లారు. అయితే ధర్నా వేదిక వద్ద ఉపాధ్యాయులు నిరసన తెలిపేందుకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో.. తేజస్వి కల్పించుకొని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, పట్నా జిల్లా మెజిస్ట్రేట్‌లతో ఫోన్‌లో మాట్లాడి ధర్నా వేదిక వద్ద శాంతియుతంగా నిరసన తెలిపేందుకు అనుమతులు ఇప్పించారు. 

ఈ క్రమంలో తేజస్వీ, జిల్లా మెజిస్ట్రేట్‌ చంద్రశేఖర్‌ సింగ్‌ల మధ్య స్పీకర్‌ ఫోన్‌లో జరిగిన సంభాషణ వైరల్‌గా మారింది. ఇందులో తేజస్వి మాట్లాడుతూ.. సింగ్‌ గారు, ఉపాధ్యాయులు శాంతియుతంగా ధర్నా చేస్తుంటే ఎందుకు అనుమతి నిరారిస్తున్నారని ప్రశ్నించారు. వారు ముందస్తు అనుమతితోనే ధర్నావేదిక వద్ద నిరసన తెలిపుతున్నారన్నారు. అలాంటప్పుడు లాఠీ ఛార్జి చేయడం, ఆహార పదార్థాలను నేలపాలు చేయడం ఎంత వరకు సమంజమని నిలదీశారు. వారి అనుమతి దరఖాస్తులను వాట్సాప్‌ చేస్తున్నాను, దయచేసి వారు నిరసన తెలిపేందుకు అనుమతించండని విజ్ఞప్తి చేశారు. 

ఆపై మెజిస్ట్రేట్‌ బదులిస్తూ.. పరిశీలిస్తానని చెప్పడంతో, ఎంత సమయం కావాలని తేజస్వి గట్టిగా నిలదీశారు. దీంతో ఆయన గంభీర స్వరంతో.. ఎంత సమయం కావాలని నన్నే ప్రశ్నిస్తావా అంటూ అరిచాడు. దీనికి తేజస్వి యాదవ్‌ స్పందిస్తూ.. "డీఎం సాబ్‌ హమ్‌ తేజస్వి యాదవ్‌ బోల్‌ రహే హై" అనడంతో ఆ అధికారి కాసేపు నీళ్లు నములుతూ, స్వరం మార్చి, ఓకే సార్‌ ఓకే సార్‌ అనటంతో ధర్నా వేదిక వద్ద కరతాళ ధ్వనులు మోగాయి. ఈ సంభాషణకు సంబంధించిన వీడియో క్లిప్‌ను మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి సహాయకుడు సుధీంద్ర కులకర్ణి సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ​.. తేజస్వికి దేశవ్యాప్తంగా ఎందుకింత మాస్ ఫాలోయింగ్‌ ఉందో ఈ వీడియో చూస్తే తెలుస్తోందని కామెంట్‌ చేశాడు. కాగా, గతేడాది జరగిన బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తేజస్వి నేతృత్వంలోని మహాఘట్‌ బంధన్‌ స్వల్ప తేడాతో మేజిక్‌ ఫిగర్‌ను చేజార్చుకున్న విషయం తెలిసిందే.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top