సాక్షి,చెన్నై: ‘నేను ఈ మధ్య ఓ విషయాన్ని గమనించాను. విద్యార్థినులు తరుచుగా షార్ట్స్ ధరించి క్లాసులకు అటెండ్ అవుతున్నారు. ఇలాంటి వస్త్రధారణ పట్ల అటు విద్యార్థులు, ఇటు ప్రొఫెసర్లు ఆక్షరణకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లైంగిక వేధింపులకు ఆస్కారం కలిగిస్తాయంటూ తమిళనాడు నేషనల్ లా యూనివర్సిటీ ప్రొఫెసర్, వైస్ ఛాన్సలర్ వి. నాగరాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
వైస్ ఛాన్సలర్ వి.నాగరాజు వ్యాఖ్యలపై యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. వైస్ చాన్సలర్ విద్యార్థులకు క్షమాపణలు చెప్పాలని ప్లకార్డులు ప్రదర్శించారు. యూనివర్సిటీ అధికారులు మాత్రం.. విద్యార్థులకు ఓ తండ్రిలా మాట్లాడారే తప్పా.. విద్యార్థునులను కించ పరిచే ఉద్దేశం కాదని అన్నారు. ప్రస్తుతం ఛాన్సలర్ చేసిన వ్యాఖ్యలు చర్చాంశనీయమయ్యాయి.
విద్యార్థినులు షార్ట్స్ ధరించడం లైంగిక వేధింపులను ఆహ్వానిస్తుంది అంటూ వైస్ ఛాన్సలర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా, విద్యార్థులు యూనివర్సిటీ పరిపాలనా భవనం ముందు షార్ట్స్ ధరించి ఆందోళన చేపట్టారు. వైస్ ఛాన్సలర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే వీసీ మాత్రం తాను చేసి వ్యాఖ్యల్లో తప్పులేదన్నారు. ఆ వ్యాఖ్యలు చేసినందుకు గర్వకారణంగా ఉందని చెప్పుకొచ్చారు.
జాతీయ మీడియా కథనాల ప్రకారం.. బుధవారం యూనివర్సిటీ న్యాయవాద విద్యార్థులతో జరిగిన ఓ సాధారణ సమావేశంలో వైస్ ఛాన్సలర్ నాగరాజ్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సమావేశానికి ఆయనతో పాటు, రిజిస్ట్రార్, అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌ల డీన్‌లు, మహిళా సంక్షేమ కేంద్రానికి అధిపతిగా ఉన్న అధ్యాపకులతో సహా పరిపాలనలోని ఇతర సభ్యులు కూడా హాజరయ్యారు.
తనపై విద్యార్థులు చేస్తున్న ఆరోపణల్ని వీసీ నాగరాజు ఖండించారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.ఏ వైస్-ఛాన్సలర్ కూడా డ్రెస్ కోడ్ పెట్టలేరు. కానీ నా అభిప్రాయం ప్రకారం, సంస్థ ప్రతిష్టను మెరుగుపరిచే విషయంలో విద్యార్థుల వస్త్రధారణ ఒక అంశం కావొచ్చని అన్నారు. విద్యార్థుల ప్రశ్నలను వారి అభిప్రాయాలుగా ఆయన కొట్టిపారేశారు. నేను ఏం మాట్లాడానో అర్థం చేసుకోకుండా విద్యార్థులు మీడియాతో మాట్లాడుతున్నారని కూడా ఆయన ఆరోపించారు.
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో అధికార డీఎంకే ప్రభుత్వానికి వైస్ ఛాన్సలర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఎటు దారి తీస్తాయోనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


