కరెన్సీ కట్టలు: రోడ్డుపై రూ.కోటి.. రూ.264 కోట్లు స్వాధీనం 

Tamil Nadu Assembly Polls 2021 Huge Amount Recovered From Raids - Sakshi

ఎన్నికల నేపథ్యంలో తనిఖీలు ముమ్మరం 

ఇప్పటి వరకు రూ.264 కోట్లు స్వాధీనం 

భారీగా పట్టుబడిన బంగారు, వెండి  

కమల్‌ పార్టీ అభ్యర్థి ఇళ్లలో సోదాలు 

రూ.10 కోట్లు స్వాధీనం 

తిరుచ్చి రోడ్డుపై రూ.కోటి 

సాక్షి ప్రతినిధి, చెన్నై: ఎన్నికలు ఏవైనా ధనవర్షం కురవాల్సిందే. ప్రచారం కోసం నోట్లు కుమ్మరించందే ఓట్లు రాలవనే భావన అన్ని పార్టీల్లో పెరిగిపోయింది. వీటికి అడ్డుకట్ట వేసేందుకు ఎన్నికల కమిషన్‌ అభ్యర్థుల కదలికలపై నిఘా పెడుతుంటుంది. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ధర ప్రవాహం పారుతోంది. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో బుధవారం వరకు రూ.264 కోట్ల నగదు పట్టుబడింది. 

కమల్‌ సన్నిహితుడి ఇంట్లో సోదాలు 
మక్కల్‌ నీది మయ్యం అధ్యక్షుడు కమల్‌హాసన్కు సన్నిహితుడు, తిరుచ్చిరాపల్లి తూర్పు నియోజకవర్గం అభ్యర్థి లేరోన్‌ మొరాయ్సి (45) ఇళ్లు, కార్యాలయాలపై ఆదాయపు పన్నుశాఖ (ఐటీ) అధికారులు దాడులు చేశారు. ఈ నెల 22, 23 తేదీల్లో జరిపిన తనిఖీల్లో రూ.10 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కమల్‌ పార్టీ ప్రముఖుల నుంచి రూ.22.5 కోట్లను స్వాధీనం చేసుకుని, రూ.80 కోట్ల పన్ను ఎగవేతకు పాల్పడిన విషయాన్ని ఇటీవల ఐటీ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. పేరు చెప్పేందుకు ఇష్టపడని ఐటీ అధికారి మీడియాతో మాట్లాడుతూ.. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసే లేరోన్‌ మెరాయ్సి భారీ ఎత్తున పన్ను ఎగవేసినట్లు అందిన సమాచారంతో ఐటీ దాడుల చేపట్టామని తెలిపారు. 

ఎంఎన్‌ఎం కోశాధికారి చంద్రశేఖర్‌ ఇళ్లు, పరిశ్రమలపై ఈనెల 17,18 తేదీల్లో దాడులు నిర్వహించి రూ.11.50 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. రూ.80 కోట్ల పన్ను ఎగవేతను గుర్తించారు. ఇదిలా ఉండగా చెన్నై పల్లవరం వద్ద వాహనాల తనిఖీలు చేసున్న ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులకు ఒక కారులో తరలిస్తున్న రూ.4 కోట్ల విలువైన బంగారు, వెండి నగలు పట్టుబడ్డాయి. అలాగే ఈరోడ్‌లో జరిపిన తనిఖీలో రూ. 4.5 కిలోల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. 

అన్నాడీఎంకే నేత కారులో రూ.కోటి 
తిరుచ్చిరాపల్లి జిల్లాలో రోడ్డుపక్కన పడి ఉన్న రూ. కోటి కరెన్సీ కలకలం రేపింది. తిరుచ్చిరాపల్లి–కరూర్‌ జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి రెండు కార్లు, వాటికి సమీపంలో కొందరు వ్యక్తులు వాదులాటలో ఉండగా ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు వచ్చారు. అధికారులను చూడగానే ఒక కారులోని వ్యక్తులు పారిపోగా రెండో కారును, నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఇంతలో కారుకు సమీపంలో రోడ్డు పక్కన పడి ఉన్న బియ్యం బస్తాలను పరిశీలించగా రూ.500 నోట్లతో రూ. కోటి విలుౖవైన కరెన్సీని గుర్తించారు. అన్నాడీఎంకే పతాకంతో కూడిన కారును స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున నగదు, నగలు పట్టుబడడంతో ఎన్నికల కమిషన్‌ 936 ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లతో 24 గంటల నిఘాను తీవ్రతరం చేసింది.  

ఈసీకి జ్యువెలర్స్‌ సంఘం విజ్ఞప్తి 
ఎన్నికల సమయంలో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ తనిఖీలతో బంగారు నగల వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలపై సానుకూలంగా స్పందించాలని కోరుతూ చెన్నై జ్యువెలర్స్‌ అసోసియేషన్‌ బుధవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సత్యబ్రత సాహూను కలిసి వినతిపత్రం సమర్పించింది. ఈసీని కలిసిన వారిలో సంఘం అధ్యక్షుడు ఉమ్మిడి ఉదయకుమార్, ఉపాధ్యక్షుడు ఉమ్మిడి రాజేష్, కార్యదర్శి నారాయణన్‌ సురేష్, కార్యవర్గ సభ్యుడు అళగు చిదంబరం ఉన్నారు.  

చదవండి: TN Assembly Polls: చంద్రమండలంపైకి తీసుకువెళ్తా!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top