కోరలు చాస్తోన్న కరోనా.. తమిళనాడులో ఆంక్షలు | Sakshi
Sakshi News home page

కోరలు చాస్తోన్న కరోనా.. తమిళనాడులో ఆంక్షలు

Published Sat, Apr 23 2022 10:52 AM

Tamil Nadu: 30 More At IIT Madras Test Covid Positive, Makes Mask Mandatory - Sakshi

సాక్షి, చెన్నై: కరోనా ప్రభావం తగ్గిపోయిందని సంతోషపడుతున్న తరుణంలో వైరస్‌ మళ్లీ కోరలు చాస్తోంది.  తమిళనాడు రాష్ట్రంలో గురువారం 21 కేసులు నమెదు కాగా శుక్రవారం 37 మంది వైరస్‌ బారిన పడ్డారు. కేసుల సంఖ్యలో క్రమంగా పెరుగుతున్న తరుణంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆంక్షలు విధించేందుకు సిద్ధమైంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ ధరించకుంటే రూ.500 జరిమానా విధానం శక్రవారం నుంచి అమల్లోకి వచ్చింది.

ఐఐటీ మద్రాసులో ముగ్గురికి కరోనా పాజిటివ్‌ బయటపడడంతో అప్రమత్తమై మరికొందరికి పరీక్షలు నిర్వహించగా 16 మందికి పాజిటివ్‌ వచ్చింది. ఈ సంఖ్య శుక్రవారానికి 30కి చేరింది. ఈ క్రమంలో మే 8వ తేదీ రాష్ట్రవ్యాప్తంగా లక్ష మెగా వ్యాక్సిన్‌ శిబిరాలను ఏర్పాటు చేయనున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఎం సుబ్రమణియన్‌ తెలిపారు. రెండు కోట్ల మందికి వ్యాక్సిన్‌ వేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు శిబిరాలు పనిచేస్తాయని చెప్పారు.

చెన్నైలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా కేసులు భారత్‌లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్నాయని అన్నారు. సీఎం స్టాలిన్‌ ఆదేశాల మేరకు రాష్ట్రంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఉత్తరా ది నుంచి కార్మికులను రప్పించే సంస్థలు చెన్నైలోని రాజీవ్‌గాంధీ ప్రభుత్వ ఆస్పత్రి (జీహెచ్‌)కి ముందుగా సమాచారం ఇవ్వాలని మంత్రి సూచించారు. అలాగే వారందరినీ జీహెచ్‌కు తీసుకొస్తే ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు జరుపుతారని తెలిపారు. గుంపులుగా రైళ్లలో వచ్చే ఉత్తరాది కూలీలపై అప్రమత్తంగా ఉండాలని.. లేకుంటే పాజిటివ్‌ కేసులు పెరిగే ప్రమాదం ఉందన్నారు. తమిళనాడులో ఇప్పటికే కరోనా కేసులు 39కి చేరుకున్నాయని తెలిపారు. కరోనా వైరస్‌ ప్రబలకుండా తీసుకుంటున్న చర్యలకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. 
చదవండి👉🏾 సీఎం జగన్‌ బాటలో స్టాలిన్‌.. తమిళనాడులోనూ గ్రామ సచివాలయ వ్యవస్థ

క్వారంటైన్‌లో ఐఐటీ మద్రాసు విద్యార్థులు 
కరోనా కట్టడి చర్యల్లో భాగంగా చెన్నై ఓమందూరులోని ప్రభుత్వ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి డాక్టర్‌ రాధాకృష్ణన్‌ శుక్రవారం తనిఖీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఐఐటీ మద్రాసులో 700 మందికి కోవిడ్‌ పరీక్షలు నిర్వహించగా 30 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయిందని తెలిపారు. స్వల్ప లక్షణాలున్న వారిని కళాశాల ప్రాంగణంలో హోం క్వారంటైన్లలో ఉంచామన్నారు. విద్యార్థులకు కోవిడ్‌ సోకితే ఆయా ప్రాంగణాల్లోనే క్వారంటైన్‌లో ఉంచి వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 

Advertisement
Advertisement