
న్యూఢిల్లీ: ధన్‌బాద్ సెషన్స్ జడ్జి ఉత్తమ్ ఆనంద్‌ను వాహనంతో ఢీకొట్టి చంపిన ఘటనపై వారం రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని జార్ఖండ్ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర డీజీపీలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఘటనపై కొనసాగుతున్న దర్యాప్తు ప్రగతిని తమకు తెలియజేయాలని కోరింది.
అదేవిధంగా, జడ్జి మృతిపై జార్ఖండ్ హైకోర్టు చేపట్టిన చర్యలు యథాప్రకారం కొనసాగుతాయని స్పష్టం చేసింది. వారం తర్వాత జరిగే విచారణకు హాజరు కావాలని జార్ఖండ్ అడ్వకేట్ జనరల్‌ను ధర్మాసనం ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్‌ల ధర్మాసనం శుక్రవారం ఈ కేసుపై సుమోటోగా విచారణ చేపట్టింది.